ఢిల్లీలో భారీ సైబర్ ఫ్రాడ్ గుట్టురట్టు చేసిన క్రైమ్ బ్రాంచ్. పోలీసు అధికారి ఖాతాలో సొమ్ము మాయం కావడంతో మొదలైన దర్యాప్తు, RBL బ్యాంక్ మేనేజర్ అరెస్టుకు దారితీసింది. ఫోర్జరీ పత్రాలతో అకౌంట్లు తెరిచి కోట్లు కాజేసిన వైనంపై పూర్తి వివరాలు.
న్యూఢిల్లీ, ఏప్రియల్ 12: సామాన్యుల సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన బ్యాంక్ అధికారియే భక్షకుడిగా మారాడు. అంకెలకు వారధిగా ఉండాల్సిన చేతులే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. సైబర్ కేటుగాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వేల కోట్ల రూపాయల దందాకు రాచబాటలు వేసిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర సైబర్ ముఠాతో చేతులు కలిపిన ఆర్ బి ఎల్ బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్ ఇర్షాద్ మాలిక్‌ను ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విభాగం తాజాగా అరెస్ట్ చేసింది.
ఖాకీ ఖాతాలోనే కన్నం.. అసలు గుట్టు రట్టు!
ఈ మొత్తం వ్యవహారం ఒక పోలీసు అధికారి ఖాతాలో జరిగిన అక్రమ లావాదేవీలతో వెలుగులోకి రావడం గమనార్హం. ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సందీప్ యాదవ్ ఎస్.బి.ఐ ఖాతా నుండి 2023 అక్టోబర్‌లో ఎటువంటి ఓటీపీ లేదా అనుమతి లేకుండానే రూ. 88,000 మాయమయ్యాయి. దీనిపై సైబర్ ద్వారకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రాథమిక విచారణలో ఈ సొమ్ము ఆర్ బి ఎల్ బ్యాంక్‌లోని "లారీ ట్రేడ్ ఎగ్జిమ్" అనే ఖాతాకు చేరినట్లు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు, ఈ చిన్న లావాదేవీ వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఛేదించారు.
ఫోర్జరీ పత్రాలతో నకిలీ ఖాతాల సృష్టి
తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి పేరుతో ఉన్న ఆ ఖాతా పూర్తిగా ఫోర్జరీ పత్రాలతో సృష్టించబడిందని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ధృవీకరించింది. ఉద్యోగం ఇప్పిస్తామనే నెపంతో మన్మోహన్ సింగ్ ఆధార్, పాన్ కార్డులను సేకరించిన హర్జిందర్ అనే నిందితుడు, వాటిని బ్యాంక్ ఉద్యోగి ఇర్షాద్ మాలిక్‌కు అందించాడు. నిబంధనల ప్రకారం ఖాతా తెరిచే వ్యక్తిని ప్రత్యక్షంగా కలవాలి, సంతకాలను సరిచూడాలి. కానీ, కమిషన్ ఆశకు కక్కుర్తి పడిన ఇర్షాద్ మాలిక్, అసలు వ్యక్తి రాకపోయినా, సంతకాలు కలవకపోయినా కళ్ళు మూసుకుని "లారీ ట్రేడ్ ఎగ్జిమ్" పేరుతో కరెంట్ అకౌంట్‌ను తెరిచాడు.
అమాయకులే లక్ష్యంగా టెలిగ్రామ్ ‘టాస్క్’ మాయాజాలం
నిందితుల మోసపూరిత విధానం అత్యంత ప్రణాళికాబద్ధంగా సాగింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో "పార్ట్ టైమ్ జాబ్స్" పేరుతో ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను, సామాన్యులను ఆకర్షించేవారు. వారిని టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, కొన్ని వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకోమని చెప్పి చిన్న చిన్న టాస్కులు ఇచ్చేవారు. నమ్మకం కుదరడం కోసం మొదట్లో కొంత లాభాన్ని ఖాతాల్లో జమ చేసేవారు. ఆ తర్వాత భారీ లాభాల ఆశ చూపి, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు, పెట్టుబడుల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. ఈ సొమ్మంతా ఇర్షాద్ మాలిక్ సాయంతో తెరిచిన నకిలీ ఖాతాలకు చేరేది. ఒకసారి భారీ మొత్తంలో నగదు జమ కాగానే, బాధితులను బ్లాక్ చేసి టెలిగ్రామ్ గ్రూపులను, వెబ్‌సైట్లను మూసివేసేవారు. ఈ పంథాలో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల పక్కా ఆపరేషన్.. కటకటాల్లోకి కిలేడీ మేనేజర్
గతంలోనే ఈ కేసులో హర్జిందర్, కుల్వీందర్ సింగ్, హర్జీ సింగ్, హిమాన్షు కపూర్ వంటి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వీరికి వెన్నుముకగా నిలిచిన బ్యాంక్ ఉద్యోగి కోసం వేట కొనసాగించారు. ఏప్రిల్ 10న ఇర్షాద్ మాలిక్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఆర్ బి ఎల్ బ్యాంక్ బ్రాంచ్‌కు వస్తున్నాడన్న పక్కా సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ డీసీపీ హర్ష్ ఇందోరా నేతృత్వంలోని బృందం మాటు వేసి పట్టుకుంది. విచారణలో తాను చేసిన నేరాన్ని ఇర్షాద్ ఒప్పుకున్నాడు. కేవలం కమిషన్ల కోసం తన వృత్తి ధర్మాన్ని విస్మరించి, నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు అంగీకరించాడు.
ఈ ఉదంతం బ్యాంకింగ్ రంగంలోని భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపుతోంది. సామాన్యులు తమ కష్టార్జితాన్ని భద్రంగా దాచుకునే బ్యాంకులపై నమ్మకం ఉంచే ముందు, సైబర్ నేరాల పట్ల మరియు ఇలాంటి ‘ఇన్సైడర్’ ముప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.