పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఉరుముతున్నాయి. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగిన పోరు, ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముక లాంటి ‘రెడ్ సీ’ (ఎర్ర సముద్రం) తీరానికి చేరింది. యెమెన్‌లోని హూతీ రెబల్స్ ఈ యుద్ధంలోకి ప్రవేశించడమే కాకుండా, బాబ్-అల్-మందేబ్ జలసంధిని అస్త్రంగా మార్చుకోవడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకవేళ ఈ జలసంధి గనుక మూతపడితే, అది కేవలం ప్రాంతీయ సమస్యగా మిగలదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ‘మహా సంక్షోభం’గా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎవరీ హూతీలు? ఎందుకీ దాడులు?
యెమెన్‌కు చెందిన 'అన్సార్ అల్లా' అనే సాయుధ సంస్థనే హూతీలుగా పిలుస్తారు. జైదీ షియా ముస్లిం వర్గానికి చెందిన వీరు, 1990ల్లో మతపరమైన ఉద్యమంగా ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు యెమెన్ రాజధాని సనాతో సహా ఆ దేశంలోని మెజారిటీ భాగంపై పట్టు సాధించారు. వీరికి వెనుక నుంచి ఇరాన్ దన్ను ఉందని పాశ్చాత్య దేశాల బలీయమైన నమ్మకం. ఇజ్రాయెల్‌పై హమాస్ చేస్తున్న పోరుకు మద్దతుగా, తాము ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ సంబంధిత నౌకలను టార్గెట్ చేస్తున్నామని హూతీలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ అణు కేంద్రాలు, కీలక నగరాలపై వీరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
బాబ్-అల్-మందేబ్: ప్రపంచ వాణిజ్యానికి ఊపిరితిత్తు
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు ఎంత కీలకమో, బాబ్-అల్-మందేబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అంత కీలకం. ఇది ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో కలుపుతూ, సూయజ్ కాలువ ద్వారా యూరప్-ఆసియా మధ్య వారధిలా పనిచేస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% నుంచి 15% వరకు నౌకలు ఈ చిన్న జలసంధి ద్వారానే ప్రయాణిస్తాయి. ఒకవేళ హూతీలు ఈ మార్గాన్ని అడ్డుకుంటే, నౌకలు ఆఫ్రికా చుట్టూ ఉన్న ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా రావాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం 15 రోజులు పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు 40% వరకు భారమవుతాయి.
‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.. విస్తరిస్తున్న యుద్ధం
పశ్చిమ ఆసియాలో ఇరాన్ నిర్మించిన ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ నెట్‌వర్క్ ఇప్పుడు యాక్టివ్ అయ్యింది. ఇందులో లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు, ఇరాక్-సిరియాలోని మిలీషియాలతో పాటు హూతీలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 15 మంది సైనికులు గాయపడటం, అమెరికా తన యుద్ధ నౌకలను, అదనపు దళాలను రంగంలోకి దించడం చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
అమెరికా ఆయుధ నిల్వలపై ఆందోళన
మరోవైపు, హూతీలను అడ్డుకునే క్రమంలో అమెరికా తన అత్యాధునిక ‘టామ్ హాక్’ క్షిపణులను యధేచ్ఛగా వాడుతోంది. కేవలం నాలుగు వారాల్లోనే 850కి పైగా మిసైళ్లను ప్రయోగించడం పట్ల పెంటగాన్ వర్గాల్లో అంతర్గత చర్చ మొదలైంది. ఒక్కో క్షిపణి తయారీకి రెండేళ్ల సమయం, 3.6 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుండటంతో, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అమెరికా ఆయుధ గిడ్డంగులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్‌పై పడనున్న ప్రభావం
ఎర్ర సముద్రం సంక్షోభం భారత్‌కు శరాఘాతమే. మన దేశానికి వచ్చే చమురు సరఫరాలో అధిక భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. రవాణా ఖర్చులు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతాయి. ఐరోపా దేశాలకు మనం చేసే ఎగుమతులు ఆలస్యమై, మార్కెట్ పోటీలో వెనుకబడే అవకాశం ఉంది. రష్యా నుంచి వచ్చే చౌక చమురు కూడా ఈ మార్గంలోనే రావాల్సి ఉండటంతో భారత్ ఇప్పుడు ఆందోళన చెందుతోంది.
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇది కేవలం సరిహద్దు పోరు కాదు, ఒక ‘ఎనర్జీ వార్’ (ఇంధన యుద్ధం)గా మారుతోంది. హోర్ముజ్ మరియు బాబ్-అల్-మందేబ్.. ఈ రెండు జలసంధులను దిగ్బంధిస్తే ప్రపంచం అంధకారంలోకి వెళ్లడం ఖాయం. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, మరోవైపు క్షిపణుల మోత ఆగడం లేదు. అటు ట్రంప్ సర్కార్ దూకుడు, ఇటు ఇరాన్ పట్టుదల మధ్య సామాన్య ప్రపంచం నలిగిపోతోంది. ఈ సముద్ర సెగ చల్లారకపోతే, రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. -news agencies




