చనిపోవాలని ఎవరికైనా ఉంటుందా .... కని పెంచిన బిడ్డను తమ చేతులతో తామే చంపుకోవాలని ఎవరైనా అనుకుంటారా .., చూస్తూ చూస్తూ కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే అయ్యో పాపం అనకుండా ఎవరైనా ఉంటారా.జీవితం ప్రతి ఒక్కరికీ విలువైనదే. కానీ కొన్నిసార్లు ఆ జీవితం ఒక శిక్షగా మారితే..? 13 ఏళ్లు.. 42 ఏళ్లు.. మంచానికే పరిమితమై, బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి, కేవలం శ్వాస మాత్రమే ఆడుతుంటే.. ఆ వేదన వర్ణనాతీతం. ఘాజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా, ముంబైకి చెందిన అరుణా షాన్‌బాగ్.. వీరిద్దరి జీవితాలు భారతదేశ న్యాయ చరిత్రలో 'కారుణ్య మరణం' అనే అంశంపై పెద్ద చర్చకే దారితీశాయి."
ఒక్క రాత్రిలో ఆమె జీవితం తారుమారు :
ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ - కె.ఇ.ఎం ఆసుపత్రిలో జూనియర్ నర్సుగా పనిచేస్తున్న అరుణా షాన్‌బాగ్‌పై 1973, నవంబర్ 27న అదే ఆసుపత్రిలో పనిచేసే ఒక వార్డ్ బోయ్ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. ఆ రోజు ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్దమవుతుండగా ఆసుపత్రిలోని కుక్కల మీద పరిశోధనలు చేసే విభాగం బేస్ మెంట్ లో ఆమె మెడకు ఇనుప గొలుసులను చుట్టి సోహన్ లాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మెడకు చుట్టిన గొలుసులు బిగుసుకుపోవటంతో మెదడుకు వెళ్లే ఆక్సిజన్ నిలిచిపోయి, మెదడు శాశ్వతంగా దెబ్బతింది. అప్పటి నుండి ఆమె 'పెర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్( పి వి ఎస్) లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో నిందితుడు సోహన్ లాల్‌కు కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే పడింది. ఆ సమయంలో చట్టంలో ఉన్న లోపాల వల్ల "అత్యాచారం" కింద కాకుండా "హత్యాయత్నం", "దోపిడీ" కింద కేసు నమోదు చేశారు. శిక్ష తర్వాత అతను విడుదలయ్యాడు. కాని అరుణా షాన్‌బాగ్ ను చాలా ప్రేమగా చూసుకున్నారు. సుమారు 42 ఏళ్ల పాటు ఆమె అదే ఆసుపత్రిలో ఒక గదిలో చికిత్స పొందుతూ మంచానికే పరిమితమయ్యారు.అరుణా పరిస్థితిని చూసి చలించిన రచయిత్రి పింకీ విరానీ, ఆమెకు గౌరవప్రదమైన మరణం (యుథనేసియా) ప్రసాదించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని ఫలితంగా 2011లో సుప్రీంకోర్టు "కారుణ్య మరణం"పై చారిత్రాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, అరుణా విషయంలో కే ఇ ఏం నర్సులు ఆమెను కన్నబిడ్డలా చూసుకుంటున్నారని గుర్తించి, ఆమెకు మరణాన్ని నిలిపివేసింది.2015 మే 18న ఆమె న్యుమోనియా కారణంగా మరణించారు. అప్పుడే భారతదేశంలో 'ప్యాసివ్ యుథనేసియా' లేదా 'నిష్క్రియ కారుణ్య మరణం' గురించి చర్చ మొదలైంది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు :2018లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఒక కీలక తీర్పునిచ్చింది. "గౌరవప్రదంగా మరణించడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అని కోర్టు పేర్కొంది. లివింగ్ విల్ అంటే ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే, భవిష్యత్తులో తాను కోలుకోలేని స్థితిలోకి వెళ్తే తనకు లైఫ్ సపోర్ట్ వద్దు అని ముందుగానే రాసి పెట్టవచ్చు. దీనిని 'అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్' అంటారు. ప్రతి కారుణ్య మరణం కేసులో తప్పనిసరిగా సంబంధిత హైకోర్టు అనుమతి తీసుకోవాలి. హైకోర్టు ముగ్గురు నిపుణులైన వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసి, రోగి పరిస్థితిని సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది.
ప్యాసివ్ యుథనేసియా అంటే ఏమిటి :
సాధారణంగా, నయం చేయలేని వ్యాధితో బాధపడుతూ, కేవలం కృత్రిమ పరికరాల ద్వారానే ప్రాణాలతో ఉన్న రోగికి, ఆ చికిత్సను నిలిపివేసి మరణానికి అనుమతించడాన్ని ప్యాసివ్ యుథనేసియా అంటారు. ఇందులో బాధితుడికి నేరుగా మందులు ఇచ్చి చంపరు. వారిని బ్రతికించి ఉంచుతున్న పరికరాలను తొలగిస్తారు. ఇందులో భాగంగా శ్వాస అందించే వెంటిలేటర్ ను ఆపివేయటం , గొట్టాల ద్వారా అందించే ఆహారాన్ని నిలిపివేయటం,రోగి గుండె నిరంతరం కొట్టుకోవటానికి , ఇన్ఫెక్షన్లు తగ్గటానికి ఇచ్చే మందులను సైతం నిలిపివేస్తారు. ఇందులో రోగికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే ప్రాణం తీయడం యాక్టివ్ యుథనేసియా ఈ ప్రక్రియ ఇది భారతదేశంలో నేరంగా పరిగణించబడుతుంది. ప్యాసివ్ యుథనేసియా లో సహజ సిద్దంగా మరణం సంభవించే విధంగా చికిత్సను ఉపసంహరిస్తారు.
13 ఏళ్ళ నరకయాతనకు ముగింపు :
ఇపుడు సోషల్ మీడియాలో ఒక వీడియొ వైరల్ అవుతుంది. https://www.youtube.com/shorts/jmzDdQ_OZHw
"ఆ వైరల్ వీడియోలో మహిళ అన్నట్లు.. 'అందరినీ క్షమిస్తూ.. అందరినీ క్షమాపణ కోరుతూ ఇక వెళ్లిపో నాన్నా'. ఈ మాటలు వింటుంటే గుండె బరువెక్కుతుంది. ఇది మరణం కాదు.. ఒక సుదీర్ఘ వేదన నుండి లభించిన స్వేచ్ఛ. కారుణ్య మరణం అనేది ఒక మనిషికి మనం ఇచ్చే చివరి గౌరవం."గా అందరూ భావిస్తున్నారు. సుమారు 13 ఏళ్ల క్రితం చండీగఢ్‌లో చదువుకుంటున్న సమయంలో హరీష్ రాణా ఒక ప్రమాదానికి గురయ్యారు. హాస్టల్ భవనం పైనుంచి కింద పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి, అప్పటి నుండి ఆయన కోమా వంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. దీర్ఘ కాలంగా మంచంపైనే ఉండటంతో ఆయన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులు ఇన్నేళ్లుగా ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు, కానీ ఆయన కోలుకునే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. చివరికి ఈ నరకయాతన చూడలేక కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అన్ని పరిస్థితులను పరిశీలించి, హరీష్‌కు ఈ సుదీర్ఘ వేదన నుండి విముక్తి కల్పించేందుకు ప్యాసివ్ యుథనేసియాకు అనుమతిని ఇచ్చింది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఎయిమ్స్ వైద్యుల నివేదికను పరిగణనలోకి తీసుకుంది. ఆయన మెదడు పనితీరు తిరిగి రాదని, ఆయన అనుభవిస్తున్నది కేవలం వేదన మాత్రమేనని నిర్ధారించుకున్న తర్వాతే ఈ "గౌరవప్రదమైన వీడ్కోలు"కు అనుమతినిచ్చింది. ఆయనను ఈ ప్రపంచం నుండి వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.





