మనిషికి గౌరవంగా జీవించే హక్కు ఉంది.. మరి గౌరవంగా మరణించే హక్కు? ఈ ప్రశ్న దశాబ్దాలుగా న్యాయ, వైద్య మరియు నైతిక చర్చలకు కేంద్రబిందువుగా ఉంది. అయితే, మరణం తథ్యమని తెలిసినప్పుడు, స్పృహ లేని స్థితిలో యంత్రాల మధ్య నలిగిపోవడం కంటే, ముందే తన ముగింపును తానే నిర్ణయించుకునే 'లివింగ్ విల్' సంస్కృతి ఇప్పుడు భారత ఆర్థిక రాజధాని ముంబైలో చిగురిస్తోంది. కేవలం ఒక నగరంలోనే 85 మంది మేధావులు ఈ దిశగా అడుగులు వేయడం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.

సాధారణంగా కుటుంబ వ్యవస్థలో ఇప్పటి వరకు కుటుంబంలోని పెద్దలు ఆస్తుల కోసం 'విల్లు' (మరణ శాసనం) రాస్తారు. కానీ, 'లివింగ్ విల్' లేదా 'అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్'- ఏ ఏం డి అనేది ప్రాణాలకు సంబంధించిన విల్లు. రేపు ఏదైనా ప్రమాదం జరిగి లేదా కోలుకోలేని జబ్బు చేసి, తాను నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి వెళ్తే.. తనను వెంటిలేటర్లపై ఉంచి బతికించాలా లేక ప్రశాంతంగా వెళ్లనివ్వాలా అని ఒక వ్యక్తి రాసుకునే రాతపూర్వక పత్రమే ఇది. ఇపుడు ముంబైలో పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది: ఆధునిక సమాజంలో ప్రజలు తమ చివరి క్షణాలపై నియంత్రణను కోరుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమ కుటుంబాలకు ఆర్థిక, మానసిక భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.

వైద్య పరికరాలు , యంత్రాల మధ్య నలిగిపోకుండా, మనిషిగా తన హుందాతనాన్ని కాపాడుకుంటూ తుది శ్వాస విడిచే అవకాశం కోసం కొందరు ఇలా చేస్తున్నారు. అదేవిధంగా ఒక క్లిష్ట సమయంలో "చికిత్స ఆపేయాలా వద్దా?" అనే కఠిన నిర్ణయం తీసుకునే మానసిక భారం నుండి కుటుంబ సభ్యులను కాపాడటం., అదేసందర్భంలో ఫలితం లేని వైద్యం కోసం లక్షల రూపాయలు వెచ్చించి కుటుంబం అప్పుల పాలు కాకుండా చూడటం, వారికి భారంగా పరిణమించామన్న భావన కలగకుండా చేయటం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

ముంబై ముందడుగు: వ్యవస్థాగత మార్పులు

సుప్రీంకోర్టు 2023లో నిబంధనలను సరళతరం చేస్తూ ఇచ్చిన తీర్పును బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అందిపుచ్చుకుంది. తన పరిధిలోని 24 వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లను 'కస్టోడియన్లు'గా నియమించి, ఈ ప్రక్రియకు ఒక అధికారిక రూపాన్ని ఇచ్చింది. కేవలం దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా, వాటిని డిజిటలైజ్ చేసేందుకు ఒక ప్రత్యేక పోర్టల్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఇది దేశంలోనే అత్యంత ప్రగతిశీలమైన అడుగు.

చట్టం ఏం చెబుతోంది?

భారతదేశంలో 'యాక్టివ్ యూథనేసియా' (ఒక వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి చంపడం) నేరం. కానీ 'పాసివ్ యూథనేసియా' (చికిత్సను నిలిపివేయడం ద్వారా మరణాన్ని అనుమతించడం) చట్టబద్ధం. 2018లో అరుణా షాన్‌బాగ్ కేసులో వచ్చిన చారిత్రాత్మక తీర్పు దీనికి పునాది వేయగా, 2023 సవరణలు దీనిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పుడు మెజిస్ట్రేట్ సంతకం అవసరం లేకుండా, కేవలం నోటరీ లేదా గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో లవింగ్ విల్ సిద్ధం చేసుకోవచ్చు.

ఈ రెండింటి మధ్య తేడాలు

అంశం

యాక్టివ్ యూథనేసియా (Active)

పాసివ్ యూథనేసియా (Passive)

విధానం

ఇంజెక్షన్ లేదా మందుల ద్వారా ప్రాణం తీయడం.

వెంటిలేటర్ వంటి కృత్రిమ మద్దతును నిలిపివేయడం.

నిర్ణయం

డాక్టర్ లేదా మరొకరు తీసుకునే చర్య.

రోగి రాసుకున్న 'లివింగ్ విల్' ప్రకారం జరిగే ప్రక్రియ.

భారత్‌లో స్థితి

చట్టవిరుద్ధం (నేరం)

చట్టబద్ధం (అనుమతి ఉంది)

అమలులో సవాళ్లు: అడ్డంకులు ఎక్కడ?

ముంబైలో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా, దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇంకా కస్టోడియన్ల నియామకంపై స్పష్టత లేదు. ప్రధానంగా మూడు సమస్యలు ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నాయి:

  1. డిజిటలైజేషన్ లోపం: అత్యవసర సమయంలో వ్యక్తి దగ్గర విల్ కాపీ ఉండకపోవచ్చు. అందుకే దీనిని 'నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్'తో అనుసంధానించడం అత్యవసరం.
  2. వైద్యుల సందేహాలు: చికిత్స ఆపివేస్తే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయేమోనని డాక్టర్లు భయపడుతున్నారు.
  3. సామాజిక నిషేధం: మరణం గురించి మాట్లాడటాన్ని మన సమాజం ఇంకా అశుభంగా భావిస్తుంది.

లివింగ్ విల్ రాయడం ఎలా?

లివింగ్ విల్ రాయాలనుకునే వారు ముందుగా డ్రాఫ్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక తెల్ల కాగితం మీద మీ పేరు, ఆధార్ వివరాలు రాసి.. భవిష్యత్తులో మీకు ఎలాంటి చికిత్సలు వద్దో (వెంటిలేటర్, డయాలసిస్ వంటివి) స్పష్టంగా ఎవరికి వారు పేర్కొనవచ్చు. మీరు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మీ తరపున డాక్టర్లకు వివరించే ఒక నమ్మకమైన వ్యక్తిని సైతం దీనికి సంభందించి నామినేట్ చేసుకోవచ్చు. ఈ పత్రం రాసే సమయంలో ఇద్దరు సాక్షుల తో ఈ పత్రంపై సంతకాలు తీసుకోవాలి. ఆ పత్రాన్ని నోటరీ లేదా గెజిటెడ్ అధికారి దగ్గర ధృవీకరిస్తూ సంతకం, ముద్ర వేయించుకోవటం మంచిది. ఇలా తయారు చేసిన ఒక కాపీని స్థానిక మున్సిపాలిటీలోని హెల్త్ ఆఫీసర్ కు ముందుగా అందజేయటం మంచిది.

ఆర్థిక మరియు మానసిక కోణం

ఆశ లేని స్థితిలో లక్షల రూపాయల ఖర్చుతో వెంటిలేటర్లపై ఉంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. లివింగ్ విల్ అనేది కేవలం మరణం గురించిన నిర్ణయం మాత్రమే కాదు, ఒక కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా కాపాడే 'ఆర్థిక భద్రత' కూడా. అలాగే, "మా నాన్నను మేమే చంపేశామా?" అనే అపరాధ భావం నుండి కుటుంబ సభ్యులను ఈ విల్ కాపాడుతుంది. లివింగ్ విల్ అనేది ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు. ఒకసారి రాసిన తర్వాత నిర్ణయం మారితే, పాత దానిని రద్దు చేసి మరొకదాన్నికొత్తగా రాసుకునే అవకాసం ఉంది.

ముంబైలో అందిన 85 దరఖాస్తులు కేవలం అంకెలు కావు.. అవి మారిన సమాజ ఆలోచనా ధోరణికి చిహ్నాలుగా భావించాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ ముగింపును ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు మనిషికి ఉండాలనేది అంతర్లీనంగా వినిపిస్తుంది.

"మరణం అనేది ప్రకృతి సహజం, కానీ ఆ మరణం ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కును లివింగ్ విల్ కల్పిస్తుంది. ఇది మరణాన్ని కోరుకోవడం కాదు, గౌరవప్రదమైన నిష్క్రమణను కోరుకోవడం."