భారతదేశ ఆధ్యాత్మిక ముఖచిత్రంలో శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత అపారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం భక్తికే కాదు, రాజ్యాంగపరమైన చర్చలకు, న్యాయ పోరాటాలకు వేదికగా మారింది. 2018లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించగా, ఇప్పుడు 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం ముందు మొదలైన విచారణ భారత న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను గడగడలాడించిన ఈ అంశం, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముంగిట ఢిల్లీలోని సుప్రీంకోర్టు హాల్‌ నుంచి కేరళ వీధుల్లోకి చేరింది. అయితే ఈసారి సీన్ మారింది. గతంలో ‘ప్రగతిశీలత’ పేరుతో మహిళల ప్రవేశానికి పట్టుబట్టిన పినరయి విజయన్ సర్కార్, ఇప్పుడు ‘విశ్వాసం’ బాట పట్టడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

విశ్వాసం.. వివక్ష కాదు!

శబరిమల ఆలయంలో 10 నుండి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కేవలం ‘లింగ వివక్ష’గా చూడలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలంగా వాదించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించిన వాదనలు సనాతన ధర్మం యొక్క లోతును, బహుళత్వాన్ని ప్రతిబింబించాయి. అయ్యప్ప స్వామి ‘నైష్ఠిక బ్రహ్మచారి’ స్వరూపంలో కొలువై ఉండటం వల్ల, ఆ ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందే తప్ప, మహిళలను తక్కువ చేసి చూపే ఉద్దేశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది ఒక ‘విలక్షణమైన’ కేసు అని, దీనిని పాశ్చాత్య ఫెమినిజం, పితృస్వామ్య సిద్ధాంతాల కోణంలో చూడటం అశాస్త్రీయమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

2018 తీర్పులో మహిళల ప్రవేశ నిరాకరణను రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 (అంటరానితనం) కిందకు తీసుకురావడాన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. కుల వివక్షను రూపుమాపేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 17ను, మతపరమైన ఆచారాలకు ముడిపెట్టడం సరైనది కాదని మెహతా వాదించారు. అయితే, దీనిపై జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. "నెలకు మూడు రోజులు అంటరానితనం ఉండి, నాలుగో రోజు పోతుందని ఎలా అంటాం?" అని ప్రశ్నించడం ద్వారా ఈ చర్చను మరో మలుపు తిప్పారు.

హిందూ ధర్మం: ఒక జీవన విధానం

ఈ విచారణలో అత్యంత ఆసక్తికరమైన అంశం హిందూ ధర్మంపై జరిగిన లోతైన చర్చ. హిందూ మతం అనేది క్రైస్తవం లేదా ఇస్లాం వంటి కేవలం ఒక మతం కాదని, అది అనేక శాఖలు, సంప్రదాయాలు, దర్శనాల సమాహారమని కేంద్రం వాదించింది. ఆఖరికి దేవుడిని నమ్మని ‘చార్వాక’ దర్శనాన్ని (నాస్తికత్వం) కూడా గౌరవించే బహుళత్వం హిందూ సంస్కృతిలో ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే, ప్రతి వర్గానికి తనదైన మత ఆచారాలను పాటించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పిస్తున్నాయని, ఇందులో న్యాయస్థానాల జోక్యం పరిమితంగా ఉండాలని కోరారు.

‘నైష్ఠిక బ్రహ్మచారి’ అంటే ఏమిటి?

హిందూ ధర్మంలో బ్రహ్మచర్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉపకుర్వాణ బ్రహ్మచర్యం (విద్యాభ్యాసం పూర్తయ్యాక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం), రెండవది నైష్ఠిక బ్రహ్మచర్యం. ‘నిష్ఠ’ కలిగిన బ్రహ్మచారిని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. అంటే, జీవితాంతం వివాహం చేసుకోకుండా, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, కేవలం ఆధ్యాత్మిక చింతనలో గడిపే వారిని ఇలా పిలుస్తారు. శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి 'నైష్ఠిక బ్రహ్మచారి' రూపంలో ఉంటారు. ఈ రూపంలో ఉన్న దైవం యోగ సమాధిలో ఉంటారని, స్త్రీ సామీప్యానికి దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శబరిమలలో 10 నుండి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఉండటానికి ప్రధాన కారణం స్వామివారి ఈ 'నైష్ఠిక బ్రహ్మచర్య' వ్రతమే. స్వామివారి తపస్సుకు లేదా ఆయన సంకల్పానికి భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నియమాన్ని భక్తులు పాటిస్తారు.

కేరళ సర్కార్ రాజకీయ వ్యూహం?

మరోవైపు, కేరళలోని ఎల్‌డిఎఫ్ (LDF) ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న ‘యూ-టర్న్’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో మహిళల ప్రవేశానికి మద్దతు పలికిన పినరయి విజయన్ సర్కార్, ఇప్పుడు ‘విస్తృత సంప్రదింపుల’ రాగం అందుకుంది. హిందూ పండితులు, సామాజిక సంస్కర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు నివేదించడం వెనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల ఆగ్రహానికి గురికాకుండా, అటు ప్రగతిశీల భావాలను వదలకుండా సమతుల్యత పాటించే ప్రయత్నంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు , గత లోక్‌సభ ఎన్నికల్లో శబరిమల అంశం వల్ల ఎల్‌డిఎఫ్ భారీగా దెబ్బతింది. ఆ తప్పును పునరావృతం చేయకూడదనే ఉద్దేశంతోనే, భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ‘యూ-టర్న్’ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, న్యాయస్థానంలో జరుగుతున్నది చట్టపోరాటమే కావొచ్చు.. కానీ కేరళ వీధుల్లో సాగుతున్నది మాత్రం పక్కా ఓట్ల వేట!

మోదీ ప్రభుత్వం ఈ కేసులో ఆది నుంచీ చాలా స్పష్టంగా ఉంది. ‘నైష్ఠిక బ్రహ్మచారి’ అనే అంశాన్ని తెరపైకి తెచ్చి, ఇది మహిళలకు వ్యతిరేకం కాదు.. కేవలం ఒక సంప్రదాయం మాత్రమే అని వాదించడం ద్వారా హిందూ ఓటు బ్యాంక్ మనోభావాలను కేంద్రం తన వైపు తిప్పుకుంది. సనాతన ధర్మాన్ని ఒక ‘జీవన విధానం’గా అభివర్ణించడమే కాకుండా, ‘చార్వాక’ నాస్తికత్వాన్ని కూడా హిందూ ధర్మం అంగీకరిస్తుందని చెప్పడం ద్వారా కమ్యూనిస్ట్ కంచుకోట అయిన కేరళలోని మధ్యస్థ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

క్షేత్రస్థాయిలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడిఎఫ్ ) కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరియు బిజెపిలు విజయన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. "ఎన్నికలు రాగానే అయ్యప్ప గుర్తుకు వచ్చారా?" అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ విమర్శలు గుప్పిస్తోంది. కేరళ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు ఈ విచారణ జరగడం రాజకీయ ఉత్కంఠను పతాక స్థాయికి చేర్చింది.

ప్రశ్నార్థకమైన ‘అవశ్యక మత ఆచారం’

ఈ కేసులో ఇప్పుడు ప్రధాన చర్చ అంతా ‘Essential Religious Practice’ (అవశ్యక మతపరమైన ఆచారం) చుట్టూ తిరుగుతోంది. ఒక మత గ్రంథంలో లేదా సంప్రదాయంలో ఏది ముఖ్యం, ఏది కాదని తేల్చడానికి న్యాయస్థానాలకు ఎంతవరకు అధికారం ఉంది? ఆధ్యాత్మిక అంశాలను సమీక్షించేటప్పుడు న్యాయమూర్తులకు ఆ స్థాయి ఆధ్యాత్మిక అవగాహన అవసరమా? అనే ప్రశ్నలను కేంద్రం లేవనెత్తింది. ఇది కేవలం శబరిమలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ముస్లిం మహిళల మసీదు ప్రవేశం, ఇతర మతాల ఆచారాలపై కూడా ప్రభావం చూపనుంది.

శబరిమల వివాదం ఇప్పుడు కేవలం కొందరు మహిళల ఆలయ ప్రవేశానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగం కల్పించిన ‘సమానత్వ హక్కు’కు మరియు ‘మత స్వేచ్ఛ’కు మధ్య జరుగుతున్న ఒక చారిత్రాత్మక యుద్ధం. 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చే తీర్పు భారతదేశ లౌకికవాదానికి, మతపరమైన స్వయంప్రతిపత్తికి కొత్త నిర్వచనాన్ని ఇవ్వబోతోంది. అప్పటి వరకు శబరిమల చుట్టూ ఉన్న ఈ ఆధ్యాత్మిక మరియు న్యాయపరమైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

మరో వైపు శబరిమల అంశం అటు న్యాయస్థానంలో ‘అవశ్యక మత ఆచారం’పై చర్చకు దారితీస్తుంటే, ఇటు కేరళలో మాత్రం అది అధికార పీఠాన్ని తేల్చే ‘అవశ్యక రాజకీయ ఆయుధం’గా మారింది. మే 4న వచ్చే ఫలితాలు ఈ న్యాయ-రాజకీయ యుద్ధంలో అసలైన విజేత ఎవరో తేల్చనున్నాయి. అప్పటివరకు శబరిమల సెగ కేరళ రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉంటుంది!