ప్రముఖ సినీ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. రూ. 10 కోట్ల పెట్టుబడుల మోసం మరియు న్యాయవాదిని బెదిరించిన ఆరోపణలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
హైదరాబాద్ , ఏప్రియల్ 11 : ఖ్యాతి గడించిన గొంతుక.. వివాదాల వేదికగా మారింది. ప్రముఖ సినీ, జానపద గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి ఆమె పాడిన పాటల వల్ల కాదు, ఆమెపై నమోదైన పోలీసు కేసు కారణంగా. పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయల మోసం, బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదికి ప్రాణహాని తలపెట్టారనే తీవ్రమైన ఆరోపణలు రావటం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గాయని మంగ్లీపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పథకాలలో పెట్టుబడులు పెట్టిస్తామని, తద్వారా భారీ లాభాలు గడించవచ్చని నమ్మించి సుమారు 9.5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, రమావత్ మధుపాల్ (భరత్ చౌహాన్), శైలజా చౌహాన్ అనే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి సేకరించిన ఈ భారీ మొత్తాన్ని 'గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్, ట్రేడింగ్ వ్యాపారాల్లో మళ్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హేమకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తిరుమల్ వంటి పలువురు వ్యక్తులు ఈ పథకాలలో పెట్టుబడి పెట్టి చివరకు తాము మోసపోయామని గ్రహించారు.
న్యాయవాది రంగప్రవేశం.. తెరపైకి బెదిరింపుల పర్వం
తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు తార్నాకకు చెందిన న్యాయవాది సింగపోగు సుబ్బారావును ఆశ్రయించారు. ఈ అంశంపై చర్చించేందుకు ఆయన మంగ్లీని సంప్రదించగా, ఆమె నుంచి ఎదురైన స్పందన విస్తుగొలిపేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో తనను, తన సోదరుడిని చేర్చవద్దని మంగ్లీ సదరు న్యాయవాదికి భారీగా డబ్బు ఆశ చూపారని, దానికి ఆయన అంగీకరించకపోవడంతో వ్యవహారం బెదిరింపులకు దారితీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పంజాగుట్టలో సినీ దర్శకుడు వేణు ఊడుగుల, అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ భేటీలో కేసు వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను తొలగించాలని న్యాయవాదిపై ఒత్తిడి తెచ్చారని, అది కాస్తా తీవ్రస్థాయి దూషణలకు దారితీసిందని బాధితుడు ఆరోపిస్తున్నారు.
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు
సమావేశం ముగిసే సమయంలో మంగ్లీ ఆమె సహచరులు తనను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ప్రాణాలతో వదిలిపెట్టమని బెదిరించారని సుబ్బారావు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. మంగ్లీ సోదరుడు శివ తో పాటు రమావత్ మధు లు ఫోన్ చేసి తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 351(2) , నేరపూరిత బెదిరింపు సెక్షన్ 352 కింద కేసు నమోదు చేశారు. మొత్తం ఐదుగురిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
వివాదాల 'రాములో రాముల'.. గతం నుంచి నేటి వరకు
అనంతపురం జిల్లాలోని ఒక సాధారణ బంజారా కుటుంబం నుంచి వచ్చి, తన అద్భుతమైన గాత్రంతో గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రస్థానంలో వివాదాలు నీడలా వెన్నాడుతూనే ఉన్నాయి. గతంలో 'బోనాల పాట' సాహిత్యం విషయంలో కొందరు మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించగా, బర్త్‌డే పార్టీ వివాదం, కన్నడ చిత్రం ' కేడి' పాటలో ఉపయోగించిన అసభ్య పదజాలం వంటి అంశాలు ఆమెను విమర్శల పాలు చేశాయి. అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక మోసం, హత్య యత్నం బెదిరింపుల ఆరోపణలు అత్యంత తీవ్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఒక సామాన్య కళాకారిణిగా మొదలై కోట్లాది రూపాయల ఆస్తులు, పాపులారిటీ సంపాదించిన మంగ్లీ చుట్టూ ఇటువంటి ఆర్థిక నేరాల ఆరోపణలు రావడం ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రస్తుతానికి ఈ కేసులో పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. బాధితుల నుంచి వసూలు చేసిన పది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? ఆ కంపెనీలో మంగ్లీ పాత్ర ఏమిటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న మంగ్లీ, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి. చట్టపరంగా ఈ ఆరోపణలు నిరూపితమైతే ఆమె కెరీర్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.