మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోలార్ ప్యానెల్స్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. సబ్సిడీ మరియు తక్కువ ధర ఆశచూపి లక్షల్లో వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్న కేటుగాళ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? బాధితులు ఎలా మోసపోయారు? పూర్తి వివరాలు మరియు నిపుణుల జాగ్రత్తలు ఈ కథనంలో..
హైదరాబాద్ , ఏప్రియల్ 23: పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవడానికి సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తుంటే, అదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు 'సౌర' మోసాలకు తెరలేపుతున్నారు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, తక్కువ ధరకే విద్యుత్ అందిస్తామంటూ ఆశ చూపి కోట్లాది రూపాయలు వసూలు చేసి అడ్రస్ లేకుండా పోతున్నారు. తాజాగామహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో వెలుగు చూసిన వరుస ఘటనలు మధ్యతరగతి కుటుంబాలను బెంబేలెత్తిస్తున్నాయి.
నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న ఫిర్యాదుల ప్రకారం.. ఈ ముఠాలు ఒక పద్ధతి ప్రకారం వ్యూహరచన చేస్తున్నాయి. సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలని ఆసక్తి చూపే వ్యక్తులను ముందుగా గుర్తించి, తాము ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్లమని నమ్మిస్తున్నారు. భారీ సబ్సిడీలు ఇప్పిస్తామని, మార్కెట్ ధర కంటే తక్కువకే పని పూర్తి చేస్తామని నమ్మబలుకుతున్నారు. పని త్వరగా మొదలుపెట్టాలనే నెపంతో రూ. 40 వేల నుంచి రూ. 2 లక్షల వరకు అడ్వాన్స్ వసూలు చేస్తున్నారు. నమ్మకం కలిగించడానికి నకిలీ ఒప్పంద పత్రాలు (Fake Agreements), బిల్లులను కూడా సృష్టిస్తున్నారు. ఒక్కసారి డబ్బు చేతికి అందగానే రాత్రికి రాత్రే బోర్డు తిప్పేయడం వీరి నైజం.
ఒకే ముఠా ధాటికి 14 మంది బలి: రూ. 14.34 లక్షల భారీ మోసం
జరిపట్కా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఘటన ఈ మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది. నారా ప్రాంతానికి చెందిన సంజయ్ మధుకర్ డాంగ్రే తన ఇంటిపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు హర్షల్ శివరాజ్ వాఘ్మారే, శ్వేతా వాఘ్మారే అనే వ్యక్తులు పరిచయమయ్యారు. తాము 'పవిత్ర సోలార్ ఇంజనీరింగ్' అనే సంస్థను నడుపుతున్నామని, సబ్సిడీపై తక్కువ ధరకే పని చేస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మిన డాంగ్రే సుమారు రూ. 43,700 చెల్లించారు. అంతటితో ఆగక, తన బంధువులను, స్నేహితులను కూడా ఈ సంస్థకు పరిచయం చేశారు. ఇలా మొత్తం 14 మంది బాధితుల నుండి సుమారు రూ. 14.34 లక్షలు వసూలు చేసిన హర్షల్ బృందం, ప్యానెల్స్ అమర్చకుండా కాలయాపన చేస్తూ చివరకు బాధితులనే బెదిరించడం మొదలుపెట్టారు.
వృద్ధురాలిని వదలని వంచకుడు: రూ. 3 లక్షలు స్వాహా
మరో కేసులో నందనవన్ ప్రాంతానికి చెందిన సీమా రామదాస్ గజభియే (70) అనే వృద్ధురాలు మోసపోయారు. వర్ధాకు చెందిన దర్శన్ రవీంద్ర సిర్సోడ్ అనే వ్యక్తి తానొక అధీకృత ఇన్‌స్టాలర్‌నని నమ్మబలికి, ఆమె వద్ద నుండి వివిధ విడతల్లో రూ. 3 లక్షలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా సోలార్ సిస్టమ్ ఊసు లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది.
అధీకృత డీలర్లను మాత్రమే సంప్రదించండి: కేవలం ప్రభుత్వ పోర్టల్స్ లేదా విద్యుత్ శాఖ గుర్తింపు పొందిన కంపెనీల ద్వారానే సోలార్ ప్యానెల్స్ కొనుగోలు చేయాలి.
అడ్వాన్స్ చెల్లింపుల్లో జాగ్రత్త: పని ప్రారంభించకముందే పూర్తి మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించవద్దు. దశలవారీగా బిల్లులు చెల్లించేలా ఒప్పందం చేసుకోవాలి.
ధృవీకరణ పత్రాల తనిఖీ: డీలర్ వద్ద ఉన్న ఐడి కార్డులు, కంపెనీ రిజిస్ట్రేషన్ మరియు గతంలో వారు పూర్తి చేసిన పనుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
సైబర్ సెల్ లేదా పోలీసుల సహాయం: ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే లేదా మోసం చేస్తున్నారని అనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలి.
కేవలం తక్కువ ధరకే వస్తుందనే ఆశతో అనధికార వ్యక్తుల చేతిలో డబ్బులు పెట్టి సామాన్యులు మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.