నాసిక్/ముంబై: కార్పొరేట్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ యూనిట్ వేదికగా సాగుతున్న ఒక భయంకరమైన నెట్‌వర్క్ గుట్టురట్టయింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ముసుగులో యువతులే లక్ష్యంగా సాగుతున్న లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఉదంతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కేవలం ఒక కార్యాలయ వివాదంగా మొదలైన ఈ వ్యవహారం, తీగ లాగితే డొంక కదిలినట్లు అంతర్జాతీయ ఉగ్రవాద మూలాలు, మలేషియా కనెక్షన్ల వరకు వెళ్లడం దర్యాప్తు సంస్థలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఈ వ్యవహారంలో నిందితులు అనుసరించిన తీరు అత్యంత అమానవీయంగా ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతులనే వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ట్రైనింగ్ టీమ్‌లో ఉన్న నిందితులు బాధితుల వ్యక్తిగత వివరాలను ముందే సేకరించి, వారు మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో స్నేహం పేరుతో దగ్గరయ్యేవారు. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ వారిని మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చేవారు. కొన్ని కేసుల్లో పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయగా, మరికొన్ని చోట్ల బలవంతంగా మాంసాహారం తినిపించడం, నమాజ్ చేయమని వేధించడం వంటి అమానుషాలు వెలుగుచూశాయి. ఒక నిందితుడైతే తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి, ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. బాధితురాలు అకస్మాత్తుగా ఇస్లామిక్ ఆచారాలను పాటించడం, ప్రవర్తనలో మార్పు రావడం చూసిన కుటుంబ సభ్యులు ఆమెను ఉద్యోగానికి పంపడం మానేశారు, ఇది పోలీసుల దర్యాప్తుకు మరింత ప్రేరణనిచ్చింది.

ఈ దారుణాలకు కార్యాలయంలోని ఉన్నతాధికారులే కొమ్ముకాయడం గమనార్హం. హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అశ్విని చైనానీ వంటి వారు బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడమే కాకుండా, నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారు. బాధితులు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోకపోగా, నిందితులకు మద్దతుగా నిలిచి వారిని మరింత రెచ్చగొట్టారు. సుమారు 70 ఫిర్యాదులను హెచ్‌ఆర్ మేనేజర్ నిర్లక్ష్యం చేసినట్లు సిట్ విచారణలో తేలింది. దీనివల్ల నిందితులు మరింతగా రెచ్చిపోయి, కార్యాలయంలోనే అసభ్యంగా తాకడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

మలేషియా కనెక్షన్: తెర వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్?

ఈ మొత్తం కుట్ర వెనుక మలేషియాకు చెందిన 'ఇర్మాన్' అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా యువతులను టార్గెట్ చేయడం, వారితో వీడియో కాల్స్ చేయించడం వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని అనుమానిస్తున్నారు. విదేశీ నిధులు, ఉగ్రవాద సంబంధాలపై కూడా నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంభందించి 9 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 12 మంది బాధితులను గుర్తించారు. ఆసిఫ్ అన్సారీ, డానిష్ షేక్, షఫీ షేక్ వంటి ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, హెచ్‌ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. రిక్రూట్‌మెంట్ మరియు అంతర్గత ప్రక్రియలలో ఆమె పాత్రపై విచారణ కొనసాగుతోంది. బాధితుల్లో ఎక్కువమంది తక్కువ జీతాలతో పనిచేసేవారని, అందుకే వారు పని ఒత్తిడి, ఉన్నతాధికారుల మాయమాటలకు సులభంగా లోనయ్యారని నివేదికలు చెబుతున్నాయి.

రంగంలోకి జాతీయ మహిళా కమిషన్.. నిఘా నీడలో క్యాంపస్!

ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. వాస్తవాలను వెలికితీసేందుకు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సాధనా జాధవ్ , హరియాణా మాజీ డిజిపి బి కే. సిన్హా సహా మొత్తం నలుగురు నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు సేకరించనుంది. మరోవైపు, ఈ ఘటనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ వంటి ఇతర ఐటీ దిగ్గజాలు కూడా అప్రమత్తమయ్యాయి. తమ కార్యాలయాల్లో మహిళా భద్రతపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన సంస్థగా పేరున్న టీసీఎస్ లోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల అటు ఐటీ నిపుణులు, ఇటు పౌర సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

ఒక రహస్య ఆపరేషన్.. 'కార్పొరేట్ జిహాద్' సెగ

ఫిబ్రవరి నెలలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్త నాసిక్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ఈ కేసులో కీలకంగా మారింది. టీసీఎస్‌లో పనిచేస్తున్న ఒక హిందూ యువతి అకస్మాత్తుగా రంజాన్ ఉపవాసాలు పాటిస్తోందన్న సమాచారంతో పోలీసులు కంపెనీ ఆవరణలో రహస్య ఆపరేషన్ చేపట్టారు. ఈ విచారణలో కొందరు ఇస్లామిక్ టీమ్ లీడర్లు లైంగిక వేధింపులు, అత్యాచారం మరియు మహిళా ఉద్యోగులను మత మార్పిడికి ప్రేరేపించే చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల వాట్సాప్ కమ్యూనికేషన్లను పరిశీలించగా, మలేషియాకు చెందిన 'ఇర్మాన్' అనే ఇస్లామిక్ బోధకుడిని వీడియో కాల్స్ ద్వారా మహిళలకు పరిచయం చేసినట్లు ఆధారాలు లభించాయి.

ఈ ఉదంతంపై రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఈ ఘటనను ‘కార్పొరేట్ జిహాద్’గా అభివర్ణించారు. ఒక ప్రొఫెషనల్ సెటప్‌లో వ్యవస్థీకృత ఇస్లామిక్ దోపిడీ జరుగుతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఈ పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సమగ్ర విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. వేధింపులు, బలవంతపు చర్యలపై తమకు 'జీరో టాలరెన్స్' విధానం ఉందని టీసీఎస్ పునరుద్ఘాటించింది.

కేసులో నాసిక్ పోలీసులు పాత్ర

 ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి మహిళా కానిస్టేబుళ్లను 'హౌస్‌కీపింగ్ స్టాఫ్' గా పంపించి సుమారు 40 రోజుల పాటు అత్యంత రహస్యంగా సమాచారాన్ని సేకరించారు. ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో అత్యాచారం, లైంగిక వేధింపులు మరియు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అంశాలపై (BNS సెక్షన్లు 64, 75, 299) కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆసిఫ్ అన్సారీ, అశ్విని చైనానీ సహా మొత్తం 7 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం 4 బృందాలతో గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు అధికారికంగా తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి డిలీట్ చేసిన సుమారు 78 ఈమెయిల్స్, వాట్సాప్ చాట్‌లను ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో రికవర్ చేశారు. ఇందులో మలేషియా కనెక్షన్ మరియు మతమార్పిడికి సంబంధించిన కీలక సంభాషణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.