విజయవాడ: పిల్లలు అన్నం తినకపోతే భూకడు వస్తున్నాడని , తినకపోతే వచ్చి ఎత్తుకు పోతాడని తల్లి వారిని భయపెట్టి ఎలాగోలా గోరుముద్దలు తినిపిస్తుంది. వేడి అన్నంలో పప్పువేసి, నెయ్యి వేసి తినిపిస్తుంది. అయితే ఆ గోరుముద్దలు కలిపిన గిన్నె ప్లాస్టిక్ అయితే ఏమవుతుంది. మేనల్లుడు కోసం , మనవాడి కోసం పుట్టిన రోజున మీరు కొనిస్తున్న బొమ్మల్లో ఏముంటుందో ఎవరైనా ఎపుడైనా గమనించారా.. జాగ్రత్త పడండి. పిల్లల శరీరాల్లోకి మెల్లగా బూచోడు దూరుతున్నాడు. వాడి పేరు బి పి ఏ . రసాయన పరిమితి ఒక మోతాదు వరకు శరీరం లోకి వెళ్ళినా ఏమి కాని ప్రమాణంను పీజీఐ అంటే ప్రోవిజినల్ టలరబుల్ డైలీ ఇన్టేక్ అంటార. ఈ పరిమితి దాటితే ఆరోగ్యంపై తీవ్రప్రభావం కనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో పీజీఐ పరిమితి మించటం వల్ల ఏర్పడిన అనారోగ్య సమస్యల నుంచి ట్రీట్మెంట్ కోసం వస్తున్న చిన్నారుల పై జరిపిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు తాజాగా వెలుగు చూసాయి. ప్లాస్టిక్ వల్ల ముఖ్యంగా పాల బాటిళ్లు, ప్లాస్టిక్ తో తయారైన బొమ్మలు, ప్యాకేజ్డ్ ఆహారం వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల శరీరాల్లోకి నెమ్మదిగా విషం చేరుకుంటుందని వారు తమ అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుంచి పీజీఐకి వచ్చే 2 నెలల నుండి 5 సంవత్సరాల మధ్య వయసున్న 184 మంది పిల్లలపై ఈ పరిశోధన చేశారు. ఇందులో 94.56 శాతం పిల్లల నమూనాల్లో బీపీఏ - బిస్ఫెనాల్ ఏ అనే ప్రమాదకర రసాయనం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే పలు దేశాలు బి పి ఏ పిల్లలు వినియోగించే బాటిల్స్ లో వాడకాన్ని నిషేధించారు.

బి పి ఏ – బిస్ఫెనాల్ ఏ అంటే ఏమిటి?

BPA (Bisphenol-A) అనేది ఒక రసాయన పదార్థం. ఇది ముఖ్యంగా ప్లాస్టిక్ తయారీ మరియు ఫుడ్ క్యాన్‌ల లోపల కోటింగ్ గా ఉపయోగిస్తారు. ఈ పదార్థం వల్ల ప్లాస్టిక్ వస్తువులు బలంగా, పారదర్శకంగా తయారవుతాయి. ఇది ఎక్కువగా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్లు లో ఉంటుంది. అంతేకాకుండా టిన్ ఫుడ్ క్యాన్‌లలో లోపల పూతగా ఈ రసాయనాన్ని వినియోగిస్తారు.గతంలో బేబీ ఫీడింగ్ బాటిళ్లలోలోనూ దిన్ని వినియోగించేవారు. బి పి ఏ ఉన్న ప్లాస్టిక్ కంటైనర్, క్యాన్‌లలో ఉన్న ఆహారం ద్వారా ఇది మనుషుల శరీరంలోకి చేరుతుంది. ప్లాస్టిక్ కంటైనర్‌లో వేడి ఆహారం పెట్టడం, ప్లాస్టిక్ బాటిల్‌ను ఎక్కువ వేడి లో ఉంచడం, క్యాన్ ఫుడ్ ఎక్కువగా తినదం వల్ల బి పి ఏ ఆహారంలో కలిశి శరీరంలోకి చేరుతుంది.

ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించే బి పి ఏ

పరిశోధనల ప్రకారంబి పి ఏ మానవశరీరంలో హార్మోన్‌లపై ప్రభావం చూపే రసాయనం. ఇది ఎండోక్రైన్ డిస్రప్టర్ గా భావిస్తున్నారు. చిన్న వయసులోనే దీని ప్రభావానికి గురైన పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధి కుంటుబడుతుంది. దీంతో ఏకాగ్రత తగ్గి నేర్చుకునే సామర్థ్యం కోల్పోతారు. వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే కాకుండా హార్మోన్ అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, పిల్లల మెదడు అభివృద్ధి చెందకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీని నుంచి బయట పడాలంటే బి పి ఏ ఫ్రీ అని రాసి ఉన్న బాటిళ్లు మాత్రమె వినియోగించాలి. ప్లాస్టిక్ కంటైనర్‌లో వేడి వేడి ఆహారం పెట్టకూడదు. గాజు లేదా స్టీల్ కంటైనర్లు వాడటం మంచిది. క్యాన్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. పాత ప్లాస్టిక్ బాటిళ్లు మల్లీ మల్లీ వాడకూడదు.