దక్షిణ మధ్య రైల్వే కేవలం జరిమానాల రూపంలోనే రూ. 223.60 కోట్లు ఆర్జించిందంటే మనం సంతోషించాలా? లేక ఇంతమంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అని ఆశ్చర్యపోవాలా? భారతదేశంలో "టికెట్ లేని ప్రయాణం నేరం" అని ప్రతి స్టేషన్‌లోనూ బోర్డులు కనిపిస్తాయి. కానీ, గణాంకాలను లోతుగా పరిశీలిస్తే, ఆ బోర్డులను ఎంతగా బేఖాతరు చేస్తున్నారో అర్థమవుతుంది. భారతీయ రైల్వే గణాంకాల ప్రకారం, ప్రతి ఏటా దేశవ్యాప్తంగా దాదాపు 3.5 కోట్ల మందికి పైగా ప్రయాణికులు టికెట్ లేకుండా లేదా తప్పుడు టికెట్లతో పట్టుబడుతున్నారు. సగటున ప్రతిరోజూ దాదాపు 1 లక్ష మందికి పైగా ప్రయాణికులు జరిమానాలు కడుతున్నారు. కేవలం జరిమానాల ద్వారానే భారతీయ రైల్వే ఏటా రూ. 2,000 కోట్లకు పైగా రాబడిని పొందుతోంది. ఇది కొన్ని చిన్న దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. అత్యధికంగా ముంబై లోకల్ ట్రైన్స్‌లో (మధ్య మరియు పశ్చిమ రైల్వే) నిమిషానికి ఒకరు చొప్పున పట్టుబడుతుంటారు. ఒక ప్రభుత్వ సంస్థకు ఆదాయం రావడం శుభపరిణామమే అయినా, ఈ భారీ మొత్తం వెనుక ఉన్న సామాజిక ధోరణిని విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి

ఎందుకు ఈ నిర్లక్ష్యపు ధోరణి?

మన దేశంలో టికెట్ తీసుకోకపోవడానికి ప్రయాణికులు చెప్పే కారణాలు వింతగా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తి అంటే అది ఉచితం అనే ఒక తప్పుడు భావన కొందరిలో బలంగా ఉంది. ఈ ఒక్క రోజుకు టీటీఈ రాడులే అనే నమ్మకంతో ప్రయాణించి, తీరా దొరికిపోయాక జరిమానా రూపంలో టికెట్ ధర కంటే ఐదారు రెట్లు ఎక్కువ చెల్లిస్తారు. క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నాయని లేదా మెషీన్లు పని చేయడం లేదని సాకులు చెప్పి రైలు ఎక్కేసేవారు లక్షల్లో ఉంటారు. చిత్రమేమిటంటే, టీటీఈకి పట్టుబడి జరిమానా కట్టిన తర్వాత కూడా చాలామంది దాన్ని ఒక పొరపాటుగా కాకుండా, ఒక 'అనుభవం'గా గొప్పగా చెప్పుకుంటారు. గతంలో టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూలు ఉండేవనే సాకు ఉండేది. కానీ ఇప్పుడు Rail One App, UTS App ద్వారా నిమిషాల్లో మొబైల్‌లోనే టికెట్ తీసుకోవచ్చు. స్టేషన్లలో QR కోడ్‌లు, ATVM మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికత పెరిగినా జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకపోవడం చూస్తుంటే, సమస్య 'సౌకర్యం'లో లేదు, ప్రయాణికుల 'ఆలోచనా విధానం'లోఉందని అర్థమవుతోంది.

నేరం వెనుక ఉన్న నష్టం

మనం ఒక టికెట్ తీసుకోకపోవడం వల్ల రైల్వేకు కేవలం ఆ వంద రూపాయల నష్టమే అనుకుంటాం. కానీ, ఈ అలవాటు వల్ల జరిమానాలు వసూలు చేయడానికి రైల్వే శాఖ వేల సంఖ్యలో సిబ్బందిని నియమించాల్సి వస్తోంది. ఆ ఖర్చు కూడా ప్రయాణికులపైనే పడుతుంది. రావలసిన ఆదాయం సరిగ్గా రాకపోతే, కొత్త రైళ్లు లేదా స్టేషన్లలో ఆధునిక వసతులు కల్పించడం రైల్వేకు కష్టమవుతుంది. టికెట్ లేకుండా ప్రయాణించే వారు, రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుల సౌకర్యాలకు భంగం కలిగిస్తున్నారు.

రైల్వే శాఖ పరంగా చూస్తే ఇది వారి సమర్థతకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష్యానికి 14 రోజుల ముందే దక్షిణ మధ్య రైల్వే రూ. 221 కోట్ల మార్కును దాటడం, అక్టోబర్ 18న ఒక్క రోజే రూ. 1.85 కోట్లు వసూలు చేయడం అధికారుల పనితీరును మెచ్చుకోదగ్గ అంశమే. కానీ, మరో కోణంలో చూస్తే.. ప్రజల్లో 'టికెట్ కొని ప్రయాణించాలి' అనే కనీస బాధ్యత లోపిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్ని కోట్ల జరిమానా వసూలు అయిందంటే, ఎన్ని లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణించి ఉంటారో ఊహించుకోవచ్చు. పౌరులుగా అది మన వైఫల్యం. జరిమానాలు కట్టి 'రికార్డులు' సృష్టించడం కంటే, టికెట్ కొని 'గౌరవంగా' ప్రయాణించడమే ఉత్తమం. నిజానికి ప్రయాణికులు సకాలంలో టికెట్లు కొని ఉంటే, రైల్వే ఖాతాలో 'జరిమానా'గా కాకుండా 'సేవా ఆదాయం'గా ఉండేవి. శిక్షల భయంతో కాకుండా, బాధ్యత గల పౌరులుగా టికెట్ కొని ప్రయాణించినప్పుడే రైల్వే నిజమైన అభివృద్ధి పథంలో పయనిస్తుంది.

గుర్తుంచుకోండి... మీరు కొనే ఒక చిన్న టికెట్, దేశాభివృద్ధిలో ఒక పెద్ద భాగస్వామ్యం!