ఒకప్పుడు తరగతి గది అంటే పుస్తకాల సవ్వడి, ఉపాధ్యాయుల బోధన. కానీ నేడు.. డెస్క్ కింద దాక్కున్న స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్ల మోత. ఈ డిజిటల్ పరధ్యానం విద్యార్థుల భవిష్యత్తును చిధ్రం చేస్తోందా? అంటే యునెస్కో తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మొనటరింగ్ – జి ఇ ఏం నివేదిక అవుననే అంటోంది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల నిషేధం కేవలం ఒక ట్రెండ్ కాదు, అది ఒక "విద్యా విప్లవం"లా ఇపుడు మారుతోంది.
అంకెల్లో మార్పు: ఒక ఆందోళనకర నిజం
యునెస్కో నివేదిక ప్రకారం, పాఠశాలల్లో ఫోన్లను నిషేధించే దేశాల సంఖ్య కేవలం రెండేళ్లలో రెట్టింపు అయింది. గతంలో అంటే 2023లో ప్రతి నాలుగు దేశాల్లో ఒక దేశం 24% మాత్రమే నిషేధం విధించింది. ప్రస్తుతం 2026 కి ప్రపంచంలోని 58% దేశాలు ఇప్పటికే అధికారికంగా స్కూళ్ల నుంచి ఫోన్లను తరిమికొట్టాయి. 2025 చివరి నాటికి అనేక దేశాలు తమ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై జాతీయ స్థాయిలో నిషేధాన్ని అమలు చేశాయని, దీనివల్ల ఈ ధోరణి నిరంతరం పెరుగుతోందని నివేదికలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బొలీవియా, కోస్టారికా, క్రొయేషియా, జార్జియా, మాల్దీవులు మరియు మాల్టా వంటి దేశాలు ఈ జాబితాలో చేరాయి. ఫ్రాన్స్ ఇప్పటికే పూర్తిస్థాయి నిషేధాన్ని అమలు చేస్తుండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి.
విశ్లేషణ: ఎందుకు ఈ 'డిజిటల్ కక్ష'?
కేవలం ఫోన్లు వాడటం వల్ల మార్కులు తగ్గుతాయని మాత్రమే కాదు, దీని వెనుక లోతైన సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు:
1. 'గోల్డ్ ఫిష్' మెదడుగా మారుతున్న విద్యార్థి:
నిరంతరం రీల్స్, షార్ట్ వీడియోలు చూడటం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత సమయం దారుణంగా పడిపోతోంది. ఒక నోటిఫికేషన్ చూసిన తర్వాత విద్యార్థి తిరిగి పాఠంపై దృష్టి పెట్టడానికి సగటున 20 నిమిషాల సమయం పడుతోంది. అంటే ఒక గంట పీరియడ్‌లో సగం సమయం కేవలం దృష్టిని కేంద్రీకరించడానికే సరిపోతోంది.
2. అదృశ్య వేధింపులు :
తరగతి గదిలో ఉపాధ్యాయులకు తెలియకుండా తోటి విద్యార్థుల ఫోటోలు తీయడం, వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వంటి ఉదంతాలు పెరుగుతున్నాయి. ఇది విద్యార్థుల్లో ఆత్మహత్యా సదృశ్య ఆలోచనలకు, మానసిక కుంగుబాటుకు దారితీస్తోంది.
3. సామాజిక దూరం - భౌతిక ఒంటరితనం:
లంచ్ బ్రేక్‌లో విద్యార్థులు కలిసి ఆడుకోవడానికి బదులు, తల దించుకుని ఫోన్లలో మునిగిపోతున్నారు. దీనివల్ల సామాజిక నైపుణ్యాలు మృగ్యమైపోతున్నాయి.
నిషేధం వల్ల మార్పు సాధ్యమేనా?
బెల్జియం మరియు స్పెయిన్ వంటి దేశాల్లో చేపట్టిన ప్రయోగాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్లు నిషేధించిన స్కూళ్లలో విద్యార్థుల మార్కులు 4% మెరుగుపడ్డాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. అంటే, ఫోన్ల లేమి వారి మధ్య ఉన్న 'డిజిటల్ అంతరాన్ని' తగ్గించి సమానత్వాన్ని పెంచింది.
"సాంకేతికత అనేది ఒక సాధనంగా ఉండాలి, అది నేర్చుకోవడానికి ఆటంకంగా మారకూడదు. మానవీయ సంబంధాలే విద్యకు పునాది." ఇది యునెస్కో జి ఇ ఏం నివేదిక సారాంశం. కొందరు విద్యావేత్తలు భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. ఫోన్లను పూర్తిగా నిషేధించడం వల్ల విద్యార్థులు వాటిని దొంగచాటుగా వాడటం నేర్చుకుంటారని, దానికి బదులు 'డిజిటల్ రెస్పాన్సిబిలిటీ' నేర్పాలని వారు సూచిస్తున్నారు. మధ్యేమార్గంగా తరగతి గదిలోకి వెళ్లేముందు ఫోన్లను ఒక బాక్స్‌లో డిపాజిట్ చేయడం. కేవలం కోడింగ్ లేదా రీసెర్చ్ క్లాసుల సమయంలో మాత్రమే స్కూల్, కాలేజ్ టాబ్లెట్స్ వాడటం వంటి ప్రత్యామ్నాయాలను వారు సూచిస్తున్నారు.
భారతదేశం వంటి దేశాల్లో కూడా ఫోన్ల వాడకంపై పాఠశాలలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే కేవలం నిషేధించడమే కాకుండా, విద్యార్థులకు క్రీడలు, కళలు మరియు ముఖాముఖి చర్చల వైపు మళ్లించినప్పుడే ఈ నిషేధం సత్ఫలితాలను ఇస్తుంది. యునెస్కో పూర్తి నివేదిక కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ప్రశ్న ఒక్కటే: స్మార్ట్ ఫోన్ల కంటే స్మార్ట్ అయిన తరాన్ని మనం తయారు చేయగలమా?
మీ అభిప్రాయం ఏంటి? పాఠశాలల్లో ఫోన్ల నిషేధాన్ని మీరు సమర్థిస్తారా? కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.






