వారు ఎవరో తెలియదు.. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు.. వారి కోసం ఎక్కడో ఒక మూల ఒక తల్లి ఎదురుచూస్తుంది ఒక భార్య తన భర్త ఆచూకీ కోసం కళ్లలో వత్తులు వేసుకుని కనిపెట్టుకుని ఉంటుంది. ఇదంతా ఎవరికి ఎరుక. ప్రస్తుత సమాజంలో అత్యంత విషాదకరమైన కోణం 'గుర్తుతెలియని మృతదేహాల' (Unidentified Dead Bodies - UDB) సమస్య. ప్రతి ఏటా వేల సంఖ్యలో లభ్యమవుతున్న ఈ అజ్ఞాత జీవుల వెనుక సామాజిక, ఆర్థిక మరియు నేరపూరిత కోణాలు అనేకం దాగి ఉన్నాయి. ఇది ఒక ప్రాంతానికి , రాష్ట్రానికి సంభందించిన సమస్య కాదు మొత్తం భారత దెస వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో - యెన్ సి ఆర్ బి వెల్లడించిన గణాంకాలు దేశంలో ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా సగటున 40,000 నుండి 50,000 మృతదేహాలు 'గుర్తుతెలియనివి'గా నమోదవుతున్నాయి. అంటే ప్రతి గంటకు ఐదారుగురు అనాథలుగానే ఈ లోకాన్ని వీడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు దేశ రాజధాని ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక వాడలు ఈ అజ్ఞాత మరణాలకు నిలయాలుగా మారుతున్నాయి.

వృత్తి రీత్యా వలస వెళ్లే కూలీలు, కుటుంబ కలహాలతో ఇళ్లు వదిలి వచ్చే వారు, మానసిక అస్థిమితంతో తిరిగే అభాగ్యులు చివరికి అనాథ శవాలుగా మిగిలిపోతున్నారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు కొన్ని సందర్భాల్లో పక్కా ప్లాన్‌తో జరిగే హత్యలు కూడా ఈ జాబితాలో చేరుతున్నాయి.

సాంకేతికతే సంజీవని: 'జిప్ నెట్' మరియు 'దర్పణ్'

పూర్వం ఒక ఫోటో మాత్రమే ఆధారంగా ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ZIPNET (Zonal Integrated Police Network) పోర్టల్ ఒక ఆశాకిరణంగా మారింది. దేశంలోని ఏ మూల మృతదేహం లభించినా, వారి శరీర గుర్తులు, ధరించిన దుస్తులు, ట్యాటూల వివరాలను ఇందులో పొందుపరుస్తారు. దీనివల్ల బాధితుల బంధువులు ఆన్‌లైన్ ద్వారా తమ వారిని గుర్తించే వీలు కలుగుతోంది.

తెలంగాణ పోలీస్ విభాగం వాడుతున్న 'దర్పణ్' (Darpan) యాప్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మిస్సింగ్ కేసుల డేటాను పరిశీలించి, మృతదేహాల ముఖ కవళికలతో పోల్చి చూడటం ద్వారా అనేక క్లిష్టమైన కేసులను ఛేదిస్తున్నారు.

చట్టం ఏం చెప్తోంది?

భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం ముఖ్యంగా కొత్తగా అమల్లోకి వచ్చిన BNSS సెక్షన్ 194 లేదా పాత CrPC 174 ప్రకారం, అజ్ఞాత మృతదేహం లభించినప్పుడు కొన్ని కఠిన నిబంధనలు పాటించాలి. మృతదేహాన్ని 72 గంటల పాటు మార్చురీలో ఉంచి గుర్తింపు కోసం ప్రయత్నించాలి. ఫోరెన్సిక్ పరిక్షల కోసం పంచనామా సమయంలో వేలిముద్రలు, డి యెన్ ఏ నమూనాలను తప్పనిసరిగా సేకరించాలి. మృతుని గుర్తింపు లభించని పక్షంలో మున్సిపల్ యంత్రాంగం లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలి.

 'ఆధార్' డేటాబేస్ అజ్ఞాత మృతదేహాల గుర్తింపులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను UIDAI డేటాతో సరిపోల్చడం ద్వారా వారి చిరునామాను కనుగొంటున్నారు. తెలంగాణ మరియు కేరళ పోలీసులు ఈ విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే, దీనికి సంబంధించి చట్టపరమైన అనుమతులు, గోప్యత వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల స్థితిగతులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సమస్య పరిష్కారానికి పోలీసులు వినూత్నంగా స్పందిస్తున్నారు. ఏపీలో 'పోలీస్ సేవా యాప్' ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రైల్వే లైన్లు ఉన్న ఏపీలో రైల్వే పోలీస్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

తెలంగాణలో సాంకేతికత వినియోగం ఒక అడుగు ముందే ఉంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో లభించే మృతదేహాలను గుర్తించడానికి ఆధార్ బయోమెట్రిక్స్‌ను సమర్థవంతంగా వాడుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో జిల్లా కేంద్రాల్లో ఉన్న మార్చురీల్లో 'కోల్డ్ స్టోరేజ్' సౌకర్యాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. 72 గంటల పాటు మృతదేహం కుళ్లిపోకుండా ఉంచడం పోలీసులకు సవాలుగా మారుతోంది.

ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. ఎవరో తెలియకపోయినా, ఒక మనిషిగా ఆఖరి వీడ్కోలు గౌరవప్రదంగా ఉండాలని ఈ సంస్థలు వేల సంఖ్యలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.

గుర్తుతెలియని మృతదేహాల సమస్య కేవలం పోలీస్ రికార్డులకు సంబంధించిన అంశం కాదు. అది ఒక సామాజిక వైఫల్యం. సాంకేతికత ఎంత పెరిగినా, ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు, ఆఖరి ప్రయాణంలో కన్నవారి సాకారం లభించినప్పుడే వ్యవస్థకు సార్థకత. ఆధార్ అనుసంధానాన్ని మరింత సులభతరం చేస్తూ, దేశవ్యాప్తంగా ఏకీకృత డి యెన్ ఏ డేటాబేస్ ఏర్పాటు చేయడమే దీనికి శాశ్వత పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.