విజయవాడ , కోడికూత : మీ ఇంటి చుట్టుపక్కల మొబైల్ ఫోన్ టవర్లు ఉన్నాయా? అవి రేడియేషన్ ప్రమాణాలను పాటించటం లేదా ? మొబైల్ ఫోన్ టవర్ల రేడియేషన్ పై మీ మనస్సులో సందేహం ఉందా? అయితే మీరు వాటిని తనిఖీ చేయించుకోవచ్చు. దీని కోసం మీరు టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన 'తరంగ్ సంచార్' పోర్టల్ (https://tarangsanchar.gov.in/EMFPortal/Request/Dmeasurement) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ తనిఖీ కోసం నాలుగు వేల రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

4G, 5G మొబైల్ ఫోన్ టవర్ల నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ (EMF) రేడియేషన్ పూర్తిగా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. 2G నుండి 5G వరకు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లు 'నాన్-అయోనైజింగ్' రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాయి. ఈ తరంగాలలో శక్తి స్థాయి ఎంత తక్కువగా ఉంటుందంటే, అవి మానవ శరీరానికి లేదా DNAకు ఎటువంటి హాని కలిగించలేవు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన EMF ఉద్గార ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే పది రెట్లు కఠినంగా ఉన్నాయి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అన్ని టవర్లకు స్వయంగా ధృవీకరణ పత్రాలను సమర్పిస్తారని, ఆ తర్వాత శాఖకు చెందిన బృందం ప్రతి ఏటా మొత్తం మొబైల్ టవర్లలో ఐదు శాతం టవర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి EMF రేడియేషన్ నిబంధనల అమలును పరిశీలిస్తుందని ఆయన తెలిపారు.డిపార్ట్మెంట్ అఫ్ టేలికంమ్యునికేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి ఇప్పటి వరకు 14,665 లైసెన్స్ సర్వీస్ ఏరియాలలో ఆడిట్‌లను నిర్వహించింది.2025-26 సంవత్సరంలో మొత్తం 320 సైట్‌లను ఆడిట్ చేశారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటి వరకు10902 లైసెన్స్ సర్వీస్ ఏరియాలలో ఆడిట్‌లను నిర్వహించగా 2025-26కు సంభందించి 520 ఆడిట్ లు పూర్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 2016 నుంచి ఇప్పటి వరకు ప్రజల అభ్యర్దన మేరకు మొత్తం 20 EMF రేడియేషన్ నిబంధనల అమలు కోసం తనిఖీ చేశారు. అదేవిధంగా తెలంగాణలో అవే సంవత్సరంలో మొత్తం 10 6 తనిఖీలు చేసారు. అయితే ఈ బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ లన్నీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు.