వేసవి జ్ఞాపకాలు, మట్టి వాసనలు మరియు మరుగున పడుతున్న గ్రామీణ క్రీడల విశిష్టతపై ప్రత్యేక కథనం. మన సంస్కృతికి వెన్నెముక వంటి పాతకాలపు ఆటలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే.
పల్లెల్లో ఏప్రిల్ మాసం వచ్చిందంటే చాలు.. ఆ గాలే వేరు. మండుతున్న ఎండలను సైతం వెక్కిరిస్తూ పొలాల్లో కోతకొచ్చిన వరి వెన్నుల పసిడి వర్ణం కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యంపై నుంచి వీచే గాలి, ఆ తడిగడ్డి కమ్మటి వాసన ముక్కుపుటాలను తాకుతుంటే.. అది కేవలం ఒక రుతువు కాదు, అదొక అనుభూతి. అటు ఆకులు రాలి పోయి ఎండిపోయి న కొండల్లో నుంచి నల్లటి పొగ గాలిలో ఊగిసలాడుతూ ఆకాశం వంక వేగంగా ఎగబాకుతుంది. కానీ, కాలచక్రం గిర్రున తిరిగింది. ఒకప్పుడు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వినిపించిన పిల్లల కేరింతలు, ఆ గొంతుకల్లోని పల్లెపాటలు ఇప్పుడు మాయమైపోయాయి. గ్రామాల్లో సైతం ఆధునికత పేరిట కాంక్రీట్ గోడలు వెలుస్తుంటే, ఆ గోడల మధ్య శైశవం బందీ అయిపోతోంది. గోలికాయలాట, గూటి బిల్లాట, కోతికొమ్మచ్చి, దాగుడుమూతలు.. ఈ పేర్లు వింటేనే నేటి నలభై ఏళ్ల పైబడిన వారికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి. ఇవి కేవలం వినోదం కోసం ఆడిన ఆటలు కావు; ఇవి మన సామాజిక నిర్మాణంలో అంతర్భాగాలు. రూపాయి ఖర్చు లేని ఈ ఆటలు పిల్లల్లో సాహసాన్ని, సంఘీభావాన్ని, ఓటమిని తట్టుకునే ధైర్యాన్ని, గెలుపులో వినయాన్ని నేర్పించేవి. 'చెమ్మచెక్క' లాంటి ఆటలు పాడుతూ ఆడుతుంటే గొంతు కలిపే ఆత్మీయత పెరిగేది. కానీ నేడు, ఆరు అంగుళాల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రపంచాన్ని కుదించేసింది. మైదానాలు అదృశ్యమవుతున్నాయి, డిజిటల్ ఆటల మాయలో పడి పిల్లలు శారీరక శ్రమను, సామాజిక స్పృహను కోల్పోతున్నారు.
నగరాలు పట్టణాలుగా, పట్టణాలు మహానగరాలుగా మారుతున్న క్రమంలో గాలి కూడా చొరబడని ఏసీ గదుల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు నేటి బాలలు. శబ్దం తప్ప స్పర్శ తెలియని, మెరుపులు తప్ప మనసు అంటని ఈ కృత్రిమ ఆటలు వారిని ఒంటరితనం వైపు నెట్టేస్తున్నాయి. వామగుంటలాటలో ఉన్న వ్యూహం కానీ, కబడ్డీలో ఉన్న తెగువ కానీ, గొనె సంచులాటలో ఉన్న సరదా కానీ మొబైల్ గేమింగ్‌లో ఎక్కడ దొరుకుతాయి? ఇవి మన సంస్కృతికి వెన్నెముక వంటివి. ఆటల ద్వారా సంస్కృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం పలకరించుకోవడమే.
ఇక్కడ అసలు ప్రశ్న ఈ ఆటలు సృజనాత్మకమైనవా లేదా చారిత్రక ప్రాముఖ్యత కలిగినవా అనేది కాదు. అవి ఖచ్చితంగా మన అస్తిత్వానికి ప్రతీకలే. అయితే, ఈ ‘డిజిటల్ యుగం’లో దేనినైనా కాపాడుకోవడానికి కేవలం సృజన , చరిత్ర సరిపోతాయా? అన్నదే అసలైన సవాలు.
ఒకప్పటి పల్లెల్లో కనిపించిన ఆ సామూహిక జీవన శైలిని, ఆ సహజసిద్ధమైన క్రీడలను మళ్ళీ మన బిడ్డలకు పరిచయం చేయాల్సిన బాధ్యత పెద్దలందరిపై ఉంది. గోలికాయలాట, గూటి బిల్లాట , కోతికొమ్మచ్చి , దాగుడుమూతలు , పుల్లాట , నాలుగు స్తంభాలాట , కాళ్ళా గజ్జి , చెమ్మ చెక్క , బువ్వలాట, బొమ్మలపెల్లిల్లు , వామన గుంటలాట, వొంగుల్లు దూకుళ్ళు , గొనె సంచులాట , చేడుగుడులాట ...ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగింటి గ్రామాల్లో ఎన్నో ఆటలు పిల్లలకు సాయంత్రాలు ఆటవిడుపు , వేసవి , దసరా , సంక్రాంతి సెలవలకు ఇవే పెద్ద సరదా , కాలక్షేపం గా కొనసాగేవి. చరిత్ర పుస్తకాల్లోనో, యూట్యూబ్ వీడియోల్లోనో ఈ ఆటలను చూసి మురిసిపోవడం కాదు.. మళ్ళీ మన వీధుల్లో పిల్లలు పరుగు తీయాలి. గోదావరి గట్టున కేరింతలు వినిపించాలి. ఆ మట్టి వాసనను మన భావి తరాలకు వారసత్వంగా అందించాలి. లేదంటే, రేపటి తరం ఒక అందమైన సంస్కృతిని కేవలం గూగుల్‌లో వెతుక్కునే పరిస్థితి వస్తుంది.
అమ్మ చేతి ముద్ద, పచ్చని పొలం గట్టు, పాతకాలపు ఆట.. ఇవి మన మూలాలు. ఆ మూలాలను తెంచుకుని ఎదిగే నాగరికత ఎప్పటికీ నిలబడదు. మేల్కొందాం.. మన పాత ఆటలను, పసిపాపల నవ్వులను కాపాడుకుందాం!