విజయవాడ , అక్టోబర్ 08 : క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న లక్షలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వ్యాధి చికిత్సలో వాడే కీలక ఔషధాల విక్రయాలపై విచ్చలవిడిగా సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (షెడ్యూల్డ్ జాబితా) పరిధిలోకి రాని నాన్-షెడ్యూల్డ్ యాంటీ క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్‌పై 30 శాతం పరిమితి (క్యాప్) విధిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తయారీదారు లేదా దిగుమతిదారు నుంచి రోగి చేతికి చేరే క్రమంలో నిర్ణయించే గరిష్ఠ చిల్లర ధర (MRP)లో ఈ మార్జిన్ 30 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మార్కెట్లో క్యాన్సర్ మందుల ధరలు ఏకంగా 70 శాతం వరకు దిగిరానున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గనుంది.

భారతదేశంలో క్యాన్సర్ విస్తృతి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన, అప్పులపాలు కావాల్సిన దుస్థితి రోగుల కుటుంబాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) క్షేత్రస్థాయిలో నిర్వహించిన మార్కెట్ అధ్యయనంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. తయారీ వ్యయానికి, రోగుల నుంచి వసూలు చేస్తున్న ధరకు మధ్య ఏమాత్రం పొంతన లేదని తేలింది. నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాలపై సగటున 170 శాతం, కొన్ని అత్యంత కీలక ఔషధాల పై ఏకంగా 700 శాతానికి పైగా లాభాల మార్జిన్లు వేసి అమ్ముతున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా సాధారణ రిటైల్ మెడికల్ షాపులు, కార్పొరేట్ ఆసుపత్రుల ఫార్మసీలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే మందుకు వేర్వేరు ధరలు వసూలు చేస్తూ రోగుల జేబులను గుల్ల చేస్తున్న తీరుపై మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే నిత్యావసర ఔషధాల జాబితాలోని క్యాన్సర్ మందులకు ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ ధరలు అమలవుతుండగా, అధిక ధరలుండే నాన్-షెడ్యూల్డ్ మందుల విషయంలో ఇప్పటివరకు సరైన నియంత్రణ లేకపోవడం వ్యాపారులకు వరంగా మారింది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ప్రస్తుతం ఔషధాల జాబితాను ఖరారు చేసే పనిలో ఉంది. ఈ కమిటీ సిఫార్సుల అనంతరం NPPA అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. గతంలో అంటే 2019 ఫిబ్రవరిలోనూ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) లోని పేరా 19 కింద ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 42 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై పరిమితి విధించింది. ఆ నిర్ణయంతో 526 బ్రాండ్ల మందుల ధరలు 91 శాతం దాకా తగ్గి, ఏటా రూ.984 కోట్ల మేర రోగులకు ఆదా అయ్యింది. నాటి అనుభవం అందించిన విజయంతో, ఇప్పుడు విస్తృత స్థాయిలో ఈ ధరల నియంత్రణను కేంద్రం అమల్లోకి తెస్తోంది.

ధరలు భారీగా తగ్గినప్పుడు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు ఉండటంతో కేంద్రం ముందుచూపుతో పకడ్బందీ నిబంధనలను రూపొందించింది. ప్రాణాలను కాపాడే ఈ ఔషధాల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు, కంపెనీలు తమ ప్రస్తుత ఉత్పత్తి పరిమాణాన్ని యథాతథంగా కొనసాగించాలని షరతు విధించింది. ఈ నిబంధన బ్రాండెడ్, జనరిక్, స్వదేశీ తయారీ, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులతో పాటు పేటెంట్ పొందిన, పేటెంట్ లేని అన్ని రకాల నాన్-షెడ్యూల్డ్ యాంటీ క్యాన్సర్ ఔషధాలకు సమానంగా వర్తిస్తుంది. మధ్యవర్తులు, ఫార్మా సంస్థల మితిమీరిన లాభాపేక్షకు ముకుతాడు వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న సామాన్యులకు జీవన భరోసానివ్వడమే కాకుండా, స్వచ్ఛమైన ఆరోగ్య హక్కు దిశగా బలమైన ముందడుగుగా నిలవనుంది.