డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా – డి సి జి ఐ జారి చేసిన లేఖ ఇపుడు సంచలనంగా మారింది. ఇందులో 90 రకాల మందుల జాబితా ఉంది. వీటికి సంబంధించి ముందుగా మార్కెట్లో ఉన్న స్టాక్‌ను సీజ్ చేయడానికి, తయారీదారులపై చర్యలు తీసుకోవడానికి అధికారులకు ఈ సమాచారం ఇచ్చారు. వీటిలో మందులలో మల్టీవిటమిన్, ఫోలిక్ యాసిడ్, సిరప్, పారాసిటమాల్, క్లోట్రిమజోల్ మరియు బెటామెథాసోన్ క్రీమ్, డిక్లోఫెనాక్ పొటాషియం మరియు డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్‌లతో పాటు మరికొన్ని ఉన్నాయి. సరఫరా వ్యవస్థలో ధృవీకరించబడని మందులు ఉండటం ప్రజారోగ్యం మరియు భద్రతకు తీవ్రమైన ముప్పు అని డిజిసిఐ రాష్ట్రాలకు పంపిన లేఖలో పేర్కొంది.

ఈ మేరకు దేశవ్యాప్తంగా 90 కంటే ఎక్కువ ధృవీకరించబడని ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ – ఎఫ్ డి సి మందుల తయారీ, విక్రయాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ మందులు కేంద్ర అనుమతి లేకుండానే విక్రయించబడుతున్నాయి.నిబంధనల ప్రకారం 2025 నాటి సుగమ్ ల్యాబ్ పరీక్షల డేటాలో పెద్ద సంఖ్యలో మందుల నమూనాలు ధృవీకరించబడనివిగా తేలాయి, వీటిని 'కొత్త మందుల' విభాగంలో ఉంచారు. కేంద్ర లైసెన్సింగ్ అథారిటీ అనుమతి లేకుండా ఏ కొత్త మందు తయారీ మరియు విక్రయాలు జరపకూడదు. ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే2012లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 59వ నివేదికలో కూడా కొన్ని రాష్ట్ర లైసెన్సింగ్ అధికారులు కేంద్రం అనుమతి లేకుండానే అనేక ఎఫ్‌డిసిలకు లైసెన్సులు ఇస్తున్నారని, దీనివల్ల భద్రత మరియు సామర్థ్యం పరీక్షించని మందులు మార్కెట్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని, తీసుకున్న చర్యల నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని రాష్ట్ర అధికారులను డిజిసిఐ కోరింది.

ఒక మందును పూర్తిగా దేశవ్యాప్తంగా "నిషేధించాం" అని ప్రకటించడానికి ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అయితే ప్రస్తుతం ఈ 90 మందులు"ధృవీకరించబడనివి" - Unapproved అని గుర్తించారు. అంటే వీటికి అసలు అమ్మే హక్కే లేదని అర్థం. గతంలో 2018 -2023లో ప్రభుత్వం దాదాపు 300 పైగా ఎఫ్‌డిసి మందులను నిషేధించినప్పుడు పూర్తి జాబితాను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో పెట్టింది. వీటికి సంభందించిన వివరాలు https://cdsco.gov.in/opencms/opencms/en/Notifications/Circulars/ అందుబాటులో ఉన్నాయి .

సాధారణంగా ప్రభుత్వం ఈ మందుల 'కాంబినేషన్' పేర్లను (ఉదాహరణకు: Paracetamol + Phenylephrine + Caffeine) విడుదల చేస్తుంది తప్ప, కంపెనీ బ్రాండ్ పేర్లను (ఉదాహరణకు: Dolo లేదా Saridon) నేరుగా ప్రస్తావించదు. ఎందుకంటే ఒకే కాంబినేషన్‌ను వందల కంపెనీలు వేర్వేరు పేర్లతో తయారు చేస్తాయి.

మందులు కొనేటప్పుడు అవి నాణ్యమైనవా మరియు గుర్తింపు పొందిన కంపెనీలవా అని నిర్ధారించుకోవడానికి ఈ క్రింది పద్ధతులను పాటించడం మంచిది:

నకిలీ మందుల ప్యాకెట్లపై కంపెనీ పేరు లేదా మందు పేరులో చిన్న చిన్న స్పెల్లింగ్ తప్పులు (ఉదాహరణకు: 'Paracetamol' కు బదులుగా 'Paracetamool') ఉంటాయి. అసలు కంపెనీ లోగో రంగు, ఫాంట్ మరియు ప్యాకింగ్ నాణ్యతను గమనించాలి. నకిలీవి కొంచెం వెలిసిపోయినట్లు లేదా తక్కువ నాణ్యతతో కనిపిస్తాయి.ప్రతి మందు ప్యాకెట్ లేదా బాటిల్‌పై మందు తయారీ బ్యాచ్ నంబర్, తయారీ మరియు గడువు ముగిసే తేదీలు స్పష్టంగా ఉండాలి. కంపెనీ పూర్తి పేరు మరియు చిరునామా ఉండాలి. అదేవిధంగా తయారీ లైసెన్స్ నంబర్ (Mfg. Lic. No.) తప్పనిసరిగా ముద్రించి ఉండాలి.ప్రస్తుతం ప్రభుత్వం చాలా ముఖ్యమైన మరియు ఖరీదైన మందుల ప్యాకెట్లపై QR కోడ్ ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఫోన్‌లోని స్కానర్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ మందు తయారీ వివరాలు, కంపెనీ వెబ్‌సైట్ లేదా మందు యొక్క ప్రామాణికతను చెక్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటుభారత ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ సంస్థ (CDSCO) ఎప్పటికప్పుడు నాణ్యత లేని మందుల జాబితాను విడుదల చేస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సుగమ్' పోర్టల్‌లో మందుల రిజిస్ట్రేషన్ వివరాలను ఎప్పటికపుడు తెలుసుకోనుకే అవకాసం ఉంది. టాబ్లెట్లు పగిలిపోయి ఉన్నా, రంగు మారినా, లేదా పొడిపొడిగా రాలిపోతున్నా అవి నాణ్యత లేనివని గుర్తించాలి. సిరప్ సీల్ సరిగ్గా ఉందో లేదో, లోపల ఏదైనా గడ్డలు కట్టాయో లేదో చూసుకోవాలి. ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మరియు పేరున్న మెడికల్ షాపుల్లోనే మందులు కొనుగోలు చేయటం మంచిది. తప్పనిసరిగా జీఎస్టీ బిల్లు అడగండి. బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ షాపులో మందులు కొనకపోవడమే మంచిది. అలాగే మీరు రెగ్యులర్‌గా వాడే మందు ప్యాకింగ్ లేదా రంగులో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మీ డాక్టర్‌ని లేదా ఫార్మసిస్ట్‌ని సంప్రదించి అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం మంచిది.

Note : ఇందులో ప్రస్తావించిన కంపెనీల పేర్లు కేవలం పాఠకులు అవగాహన కోసం మాత్రమే , వాటిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.