ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలను కనుగొనేందుకు ఏపీ ప్రభుత్వం భారీ పరిశోధన ప్రారంభించింది. బయో మార్కర్ల ద్వారా 4 ఏళ్ల ముందే వ్యాధిని గుర్తించే సరికొత్త విధానంపై ప్రత్యేక కథనం.
విశాఖపట్నం: దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల పాలిట శాపంగా మారిన 'ఉద్దానం కిడ్నీ వ్యాధి' మూలాలను వెలికితీసే ప్రక్రియ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వ్యాధి వచ్చాక చికిత్స అందించడం కంటే, అసలు వ్యాధి ఎందుకు వస్తోంది? ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అనే అంశాలపై ప్రభుత్వం శాస్త్రీయ వేట మొదలుపెట్టింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో, ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ – ఐ సి ఏం ఆర్ భాగస్వామ్యంతో ఒక బృహత్తర పరిశోధన ప్రాజెక్టు పట్టాలెక్కింది. విశాఖ కేజీహెచ్ కేంద్రంగా జరుగుతున్న ఈ రీసెర్చ్‌లో తొలిసారిగా 'బయో మార్కర్స్' వంటి అత్యాధునిక పరీక్షలను ప్రవేశపెట్టడం వైద్యరంగంలో ఒక మైలురాయిగా చెబుతున్నారు.
ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎందుకు విజృంభిస్తున్నాయన్నది ఇప్పటికీ ఒక చిక్కుముడిగానే మిగిలిపోయింది. గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత 'జార్జ్ ఇన్‌స్టిట్యూట్' ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం, ఈ కిడ్నీ మృత్యుఘోషకు చరమగీతం పాడాలన్న కృత నిశ్చయంతో ఉంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ నేరుగా ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరిపి, ఐసీఎంఆర్ ద్వారా సుమారు రూ. 6.2 కోట్ల గ్రాంటును ఈ ప్రాజెక్టుకు మంజూరు చేయించారు. ప్రస్తుతం సీనియర్ నెఫ్రాలజిస్ట్ ప్రొఫెసర్ తాతపూడి రవిరాజు మెంటార్‌గా, ఆంధ్ర వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి. ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్‌గా ఈ పరిశోధన శరవేగంగా సాగుతోంది.
బయో మార్కర్స్: ముందస్తు హెచ్చరికల వ్యవస్థ
సాధారణంగా కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడే సమయానికే అవయవాలు గణనీయంగా దెబ్బతింటాయి. కానీ, ఉద్దానంలో ప్రవేశపెట్టిన 'బయో మార్కర్స్' పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధి రాకను 3 నుండి 4 సంవత్సరాల ముందే పసిగట్టే అవకాశం ఉంది. రక్త, మూత్ర నమూనాలను సూక్ష్మస్థాయిలో విశ్లేషించడం ద్వారా, భవిష్యత్తులో ఎవరికి కిడ్నీలు పాడయ్యే ముప్పు ఉందో వైద్యులు అంచనా వేస్తారు. ఇలాంటి సామూహిక పరీక్షలు జరగడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఉద్దాన ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించి, సుమారు 1,500 మంది నుంచి శాంపిల్స్ సేకరించాయి. కేవలం పరీక్షలే కాకుండా, బాధితుల కుటుంబ నేపథ్యం, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి అంశాలపై ఒక సమగ్ర ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇది వ్యాధికి గల జన్యుపరమైన, పర్యావరణపరమైన కారణాలను విశ్లేషించడానికి తోడ్పడనుంది.
కేజీహెచ్‌లో 'హైటెక్' ల్యాబ్.. మౌలిక సదుపాయాల కల్పన
ఈ పరిశోధన కేవలం క్షేత్రస్థాయి సేకరణకే పరిమితం కాకుండా, శాస్త్రీయ విశ్లేషణ కోసం విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రి లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ఐసీఎంఆర్ నిధులతో సుమారు రూ. 80 లక్షల వ్యయంతో సెంట్రిఫ్యూజ్‌లు, డీప్ ఫ్రీజర్లు, సాంపుల్ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి అత్యున్నత ప్రమాణాలతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. పలాసలోని కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో సేకరించిన నమూనాలను తగిన జాగ్రత్తలతో భద్రపరిచి, అక్కడి నుంచి కేజీహెచ్ ల్యాబ్‌కు తరలిస్తున్నారు. బయో సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్న ఈ ప్రయోగశాల విశ్లేషణలు, రానున్న రోజుల్లో కిడ్నీ వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం 'ఆర్ఎన్పీ సీక్వెన్సింగ్' (RNP Sequencing). దీని ద్వారా వ్యాధికి గల జన్యుపరమైన మూలాలను శోధించనున్నారు. ఉద్దానంలో కొన్ని తరాల నుంచి ఈ సమస్య ఎందుకు వెంటాడుతోంది? దీని వెనుక ఉన్న క్రోమోజోమ్ మార్పులేమిటి? అన్న కోణంలో పరిశోధకులు లోతైన అధ్యయనం చేస్తున్నారు. ఇటీవలే ఈ పరిశోధన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. నిర్ణీత మూడేళ్ల కాలపరిమితిలో ఈ పరిశోధనను పూర్తి చేసి, బాధితులకు ఊరట కలిగించేలా ఫలితాలను వెల్లడించాలని మంత్రి ఆదేశించారు. వ్యాధి ముదరకముందే గుర్తించడం వల్ల, రోగులకు తగిన జాగ్రత్తలు సూచించవచ్చని, తద్వారా డయాలసిస్ వంటి ఖరీదైన, బాధాకరమైన ప్రక్రియల వరకు వెళ్లకుండా ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి, ఉద్దాన ప్రాంతవాసుల ఏళ్లనాటి కన్నీళ్లను తుడిచే దిశగా ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు ఆశాజనకంగా ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, రాజకీయ సంకల్పం తోడైతే.. ఉద్దానంలో కిడ్నీ రక్కసి పీడ విరగడవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.