ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్ల లోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా, డిజిటల్ భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, ఏజ్ టోకెన్ వ్యవస్థ మరియు అంతర్జాతీయ విధానాలపై ప్రత్యేక కథనం.
అమరావతి, ఏప్రియల్ 10: ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ చిన్నారుల చేతిలో ఆయుధంగా మారుతోంది. విజ్ఞానాన్ని అందించాల్సిన సామాజిక మాధ్యమాలు, నేడు పసి మనసులపై విషం చిమ్ముతూ వారి సృజనాత్మకతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితులను గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బాలల డిజిటల్ భద్రతే ధ్యేయంగా ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. 13 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ మీడియా అనేది రెండంచుల కత్తి లాంటిదని, ముఖ్యంగా అవగాహన లేని వయసులో చిన్నారులు దీని బారిన పడితే వారి మానసిక వికాసం దెబ్బతింటుందని మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠినమైన విధివిధానాలతో కూడిన ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేవలం నిషేధించడమే కాకుండా, 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల కిశోర ప్రాయం వారికి కేవలం వారి వయసుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా సాంకేతిక మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం డిజిలాకర్‌తో అనుసంధానించబడిన 'ఏజ్ టోకెన్' వ్యవస్థను పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇది పిల్లల వయసును ఖచ్చితంగా నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రాష్ట్రం రూపొందించబోయే చట్టం కేవలం నామమాత్రంగా కాకుండా, ప్రపంచస్థాయి లో పలు దేశాలు ప్రస్తుతం అవలంభిస్తున్న విధి విదానాలపైనా అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. పిల్లలను సెన్సిటివ్, అభ్యంతరకర కంటెంట్ నుండి రక్షించడానికి ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాలు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశిలించాలన్నారు. ఆయా దేశాల్లో అమలవుతున్న లీగల్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ ను మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని, పటిష్టమైన డిజిటల్ భద్రతా వలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ చట్ట పరిధిలోని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది నివేదికను సిద్ధం చేయనున్నారు.
విద్వేషంపై ఉక్కుపాదం: మహిళల భద్రతకు పెద్దపీట
సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని మంత్రి లోకేష్ హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల గౌరవానికి భంగం కలిగించడం కాదని ఆయన స్పష్టం చేశారు. మహిళల పట్ల అవమానకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐటీ చట్టంలోని సెక్షన్-46 కింద అడ్జుడికేటింగ్ అధికారిని (న్యాయ నిర్ణయాధికారి) తక్షణమే నియమించాలని ఆదేశించారు. దీనివల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం అందడమే కాకుండా, సైబర్ నేరగాళ్లలో భయం కలుగుతుంది.
చైతన్యమే ఆయుధం: క్షేత్రస్థాయిలో అవగాహన
కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది. పాఠశాలల్లో నిర్వహించే 'నో బ్యాగ్ డే' సందర్భాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సోషల్ మీడియా దుష్ప్రభావాలపై వివరించనున్నారు. అలాగే, ఏడాదికి రెండుసార్లు జరిగే మెగా పీటీఏ సమావేశాల్లో తల్లిదండ్రులకు తమ పిల్లల డిజిటల్ అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. మహిళా భద్రతపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలోని ప్రతి వర్గాన్ని డిజిటల్ భద్రతలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఐటీ దిగ్గజాల మద్దతు
ఈ సమావేశంలో మెటా, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), షేర్‌చాట్, జోష్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులు పాల్గొని, తాము తీసుకుంటున్న భద్రతా చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వినూత్న చొరవను వారు ప్రశంసించడమే కాకుండా, ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సాంకేతిక పరంగా పిల్లలకు సున్నితమైన కంటెంట్ చేరకుండా చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వారు వెల్లడించారు.
మొత్తానికి, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజ్ఞానానికి వేదిక కావాల్సిన ఇంటర్నెట్, చిన్నారుల పాలిట శాపంగా మారకుండా ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భద్రతా కవచం ఎంతవరకు సఫలీకృతమవుతుందో కాలమే నిర్ణయించాలి. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ సూచనలను అందించారు.