నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్-2 మిషన్ అపోలో-13 రికార్డును అధిగమించింది. 4 లక్షల కిలోమీటర్ల సుదూర ప్రయాణం, అంతరిక్షం నుండి సూర్యగ్రహణం వీక్షణ, మరియు ఈ మిషన్ ప్రత్యేకతలపై సమగ్ర కథనం ఇక్కడ చదవండి.
అంతరిక్ష పరిశోధనల్లో మానవుడు మరో మహా అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సరిగ్గా అర్ధ శతాబ్దం క్రితం ‘అపోలో-13’ సృష్టించిన రికార్డులను తిరగరాస్తూ, నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ అంతరిక్ష విజ్ఞానంలో నవ శకానికి నాంది పలికింది. భూమికి అత్యంత దూరంగా, చంద్రునికి అత్యంత చేరువగా వ్యోమగాములు ప్రయాణించి సరికొత్త మైలురాయిని అధిగమించారు. 1970లో అపోలో మిషన్ నెలకొల్పిన 4,00,171 కిలోమీటర్ల దూరపు రికార్డును ఆర్టెమిస్-2 బృందం 4,06,773 కిలోమీటర్ల మేర ప్రయాణించి అధిగమించడం విశేషం.
అంతరిక్ష యాత్రల నియంత్రణ కేంద్రం , హ్యూస్టన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఆర్టెమిస్-2 బృందం సోమవారం నాటికి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి విజయవంతంగా ప్రవేశించింది. ఈ మిషన్‌లో రీడ్ వైజ్‌మ్యాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), మరియు కెనడాకు చెందిన జెరెమీ హన్సన్ సభ్యులుగా ఉన్నారు. చంద్రుని ఉపరితలానికి కేవలం 4,067 మైళ్ల ఎత్తులో ‘ఫ్లైబై’ (Flyby) ప్రక్రియను సుమారు ఏడు గంటల పాటు నిర్వహించారు. ఈ సమయంలో చందమామపై ఉన్న లోతైన అగాధాలను (Craters), ఉల్కల తాకిడి వల్ల ఏర్పడిన గుర్తులను వారు అత్యంత శక్తివంతమైన కెమెరాలతో బంధించారు. ఈ దృశ్యాలు చంద్రుని పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఎంతో కీలకం కానున్నాయి.
మిషన్‌ను అద్భుతంగా మార్చిన 5 అంశాలు
ఈ ప్రయోగం గత మిషన్ల కంటే ఎందుకు భిన్నమైనదో తెలిపే ఐదు ముఖ్యాంశాలను నాసా వెల్లడించింది.భూమి గురుత్వాకర్షణ శక్తిని ‘గులేల్’ (Slingshot) లాగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణిస్తోంది. ఒకవేళ చంద్రుని వెనుక ఇంజిన్ విఫలమైనా, భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం నౌక దానంతట అదే భూమి వైపు వచ్చేలా దీనిని రూపొందించారు. అపోలో కాలంలో రేడియో తరంగాలపై ఆధారపడగా, ఇప్పుడు ఆర్టెమిస్-2 ‘O2O’ సిస్టమ్ ద్వారా 4K అల్ట్రా హెచ్‌డీ వీడియోలను నేరుగా భూమికి స్ట్రీమ్ చేస్తోంది. అంతరిక్షంలో సౌర తుఫానుల నుండి రక్షణ పొందేందుకు ఈ నౌకలో ప్రత్యేక షెల్టర్ ఉంది. అత్యవసర సమయంలో నీటి సంచులు, పరికరాలనే వ్యోమగాములు కవచంలా వాడుకునే వెసులుబాటు ఉంది. లోతైన అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావం మానవ డీఎన్ఏపై ఎలా ఉంటుందో పరీక్షించేందుకు నౌకలో కొన్ని శైవలాలు (Algae) కూడా పంపారు. ఇది భవిష్యత్తులో ‘మానవ మంగళ మిషన్’కు మార్గదర్శకంగా మారుతుంది. నౌక సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే నావికా దళం దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేలా అత్యాధునిక ‘LPD-17’ నౌకను సిద్ధం చేశారు.
ఆర్టెమిస్-2 మిషన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూన్ మిషన్‌గా నిలిచింది. దీని మొత్తం వ్యయం సుమారు 4.09 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో అత్యంత శక్తివంతమైన ‘SLS’ రాకెట్ ధర 2.21 లక్షల కోట్లు కాగా, ఓరియన్ క్యాప్సూల్ ధర 1.89 లక్షల కోట్ల రూపాయల పైమాటే. నలుగురు వ్యోమగాముల భద్రత కోసమే నాసా ఏకంగా 9301 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం గమనార్హం.
భూమిపై సూర్యగ్రహణం.. అంతరిక్షంలో అద్భుతం
వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తున్న సమయంలో భూమిపై ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వారు అంతరిక్షం నుండి వీక్షించారు. చంద్రుడు సూర్యుడిని కప్పివేసిన ఆ అరుదైన దృశ్యాన్ని వారు తమ ఐఫోన్ల ద్వారా చిత్రీకరించడం విశేషం. నీలి రంగులో మెరిసిపోతున్న భూగోళాన్ని, మేఘాల మధ్య దాగి ఉన్న మహాసముద్రాలను అంతరిక్షం నుండి చూసిన అనుభూతి వర్ణనాతీతమని కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్ భావోద్వేగంతో తెలిపారు.
ప్రస్తుతం చందమామ చుట్టూ ప్రయాణాన్ని ముగించుకుని భూమి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 క్యాప్సూల్, ఏప్రిల్ 10వ తేదీన పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ కానుంది. ఈ మిషన్ విజయవంతమైతే, ఆర్టెమిస్-3 ద్వారా మానవుడు మళ్లీ చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టే ప్రక్రియ సులభతరం అవుతుంది. అర శతాబ్దం క్రితం మొదలైన అన్వేషణ, నేడు ఆధునిక సాంకేతికతతో కొత్త శిఖరాలను తాకింది. చంద్రుని ‘డార్క్ సైడ్’ గురించిన రహస్యాలను ఛేదించే దిశగా ఆర్టెమిస్-2 వేసిన అడుగు మానవాళి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
నోట్ :
ఈ కధనంలో మీరు చూస్తున్న చిత్రం ఆర్టెమిస్-II మిషన్‌లో భాగంగా వ్యోమగాములు చంద్రుని మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఏప్రిల్ 6, 2026 సాయంత్రం 6:41 గంటలకు ఓరియన్ అంతరిక్ష నౌక కిటికీ నుండి తీసిన భూ అస్తమయం దృశ్యం ఇది.
గుంతలతో నిండిన చంద్రుని ఉపరితలం వెనుక, తెల్లని మేఘాలతో మెరిసిపోతున్న నీలిరంగు భూగోళం అస్తమిస్తున్నట్లు కనిపిస్తోంది. భూమి యొక్క చీకటి భాగం ప్రస్తుతం రాత్రి సమయాన్ని అనుభవిస్తుండగా, పగలు ఉన్న వైపు ఆస్ట్రేలియా మరియు ఓషియానియా ప్రాంతాలపై ఆవరించిన మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందు భాగంలో కనిపిస్తున్న ఉల్కాపాత గుంత, మెట్ల వంటి అంచులను కలిగి ఉంది. దాని సమతలంగా ఉన్న నేల మధ్యలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. సాధారణంగా భారీ ఉల్కలు చంద్రుని ఉపరితలాన్ని బలంగా ఢీకొన్నప్పుడు, అక్కడి నేల ద్రవ రూపంలోకి మారి ఒక్కసారిగా పైకి చిమ్ముతుంది. ఆ ప్రక్రియలోనే ఇటువంటి సంక్లిష్టమైన గుంతల మధ్యలో ఈ శిఖరాలు ఏర్పడతాయి.