సాధారణంగా మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు తమ కష్టార్జితమైన బంగారం, వెండి ఆభరణాలు మరియు కీలకమైన ఆస్తి పత్రాలను భద్రపరుచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేది బ్యాంక్ లాకర్లు. ఇంట్లో ఉంచితే దొంగల భయం, అదే బ్యాంకులో అయితే వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని సామాన్యుడి నమ్మకం. అయితే, ఈ లాకర్ల విషయంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్లమెంటులో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు ఖాతాదారుల్లో కొత్త చర్చకు దారితీశాయి. అసలు లాకర్లలో మీ వస్తువులు ఎంతవరకు సురక్షితం? బ్యాంకుల బాధ్యత ఏమిటి? నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే అంశాలపై ఒక లోతైన విశ్లేషణ.
గోప్యత వర్సెస్ భద్రత: బ్యాంకులకు ఆ అధికారం లేదు!
ఇటీవల లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్ బ్యాంక్ లాకర్ల నిర్వహణపై పూర్తి స్పష్టతనిచ్చాయి. కస్టమర్ తన లాకర్‌లో ఏ వస్తువులను ఉంచుతున్నాడో చూసే అధికారం గానీ, వాటిని రికార్డు చేసే హక్కు గానీ బ్యాంకులకు లేదు. ఇది ఖాతాదారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం. బ్యాంక్ కేవలం లాకర్ సౌకర్యాన్ని అందించే 'కస్టోడియన్' మాత్రమే తప్ప, లోపల ఉన్న వస్తువులకు యజమాని కాదు.
చాలామంది ఖాతాదారులు తమ వస్తువులకు బ్యాంకే పూర్తి భీమా కల్పిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. లాకర్‌లో ఏముందో బ్యాంకుకు తెలియనప్పుడు, దానికి భీమా ఎలా కల్పిస్తారనేది సాంకేతిక ప్రశ్న. అందుకే, లాకర్‌లోని వస్తువుల అసలు విలువ ఆధారంగా భీమా కవరేజీ ఇచ్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని మంత్రి స్పష్టం చేశారు.
నష్టం జరిగితే పరిహారం ఎంత? ‘100 రెట్ల’ సూత్రం
ఒకవేళ బ్యాంకులో దొంగతనం జరిగినా, అగ్నిప్రమాదం సంభవించినా లేదా భవనం కూలిపోయి లాకర్లు దెబ్బతిన్నా కస్టమర్ పరిస్థితి ఏమిటి? దీని కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ – ఆర్ బి ఐ ., 2022 జనవరి నుండి కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది.
బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల లేదా మోసం వల్ల నష్టం వాటిల్లితే, సదరు లాకర్ యొక్క వార్షిక అద్దెకు 100 రెట్లు మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలి. ఉదాహరణకు, మీరు ఏడాదికి రూ.3వేలు అద్దె చెల్లిస్తుంటే, మీకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం అందుతుంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలైన భూకంపాలు, వరదల వంటి సందర్భాల్లో బ్యాంకుల బాధ్యత ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. ఇది ఖాతాదారులను కొంత ఆందోళనకు గురిచేసే అంశమే అయినప్పటికీ, భద్రతా పరంగా ఇంటికంటే బ్యాంకులే మేలనేది జగమెరిగిన సత్యం.
నిఘా సంస్థల ‘కీ’ రోల్: గోప్యత ఎప్పుడు వీడుతుంది?
సాధారణ పరిస్థితుల్లో బ్యాంకులు మీ లాకర్‌ను ముట్టుకోలేవు. కానీ, చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో ఈ గోప్యతకు మినహాయింపులు ఉంటాయి. దేశ ఆర్థిక ప్రయోజనాలు, నేర పరిశోధనల దృష్ట్యా దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ (IT), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ (CBI) మరియు కోర్టు ఆదేశాలతో పోలీసులు లాకర్లను తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు. అనుమానిత వ్యక్తులపై సెర్చ్ వారెంట్ ఉన్నప్పుడు, అధికారులు బ్యాంకును సంప్రదిస్తారు. సాధారణంగా కస్టమర్ సమక్షంలోనే లాకర్ తెరిపిస్తారు. ఒకవేళ కస్టమర్ సహకరించకపోతే, నిబంధనల ప్రకారం లాకర్‌ను 'ఫోర్స్ ఓపెన్' (పగలగొట్టడం) చేసే హక్కు వారికి ఉంటుంది. ఈ సందర్భంలో జరిగే ప్రతి అంశాన్ని వీడియో తీయడంతో పాటు, అక్కడ లభించిన వస్తువుల జాబితాను 'పంచనామా' రూపంలో రికార్డు చేస్తారు.
ఖాతాదారులు పాటించాల్సిన కీలక జాగ్రత్తలు
బ్యాంకులో పెట్టేశాం కదా అని నిశ్చింతగా ఉండకుండా, ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు ఇచ్చే పరిహారం పరిమితంగానే ఉంటుంది కాబట్టి, భారీ విలువైన నగలు ఉన్నవారు విడిగా 'ప్రైవేట్ లాకర్ ఇన్సూరెన్స్' తీసుకోవడం ఉత్తమం. ఏడాదికి కనీసం ఒకసారైనా లాకర్‌ను ఆపరేట్ చేయాలి. సుదీర్ఘకాలం పాటు లాకర్‌ను వాడకపోతే, బ్యాంకులు దానిని 'ఇన్-యాక్టివ్'గా పరిగణించి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. లాకర్‌లో ఉంచిన నగలు లేదా పత్రాలకు సంబంధించిన ఫోటోలు, బిల్లులు లేదా జాబితాను ఇంట్లో ఒక కాపీ భద్రపరుచుకోవాలి. ఇది ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఆధారంగా పనిచేస్తుంది. చాలామంది లాకర్లలో పెద్ద ఎత్తున నగదు దాస్తుంటారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఐటీ దాడుల్లో నగదు దొరికితే అది చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది.
బ్యాంక్ లాకర్లు అనేవి కేవలం భౌతిక భద్రతను మాత్రమే ఇస్తాయి తప్ప, ఆర్థికపరమైన పూర్తి గ్యారెంటీని ఇవ్వవు. బ్యాంకింగ్ వ్యవస్థలో మారుతున్న నిబంధనల పట్ల కస్టమర్లు అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, సరైన రికార్డులు కలిగి ఉన్నంత వరకు ఖాతాదారుల సొత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి :
క్రియేటర్లకు అలర్ట్! 📢 మీ సంపాదన ₹20,000 దాటితే 10% TDS కట్ అవుతుందని తెలుసా? సోషల్ మీడియా ఆదాయంపై పన్ను పోటు తప్పదు. మీ ఆదాయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చదవండి.
https://www.kodikoota.com/article/social-media-tax-guide-is-your-online-income-under-it-radar
"గోల్డ్ లోన్ రూల్స్ మారుతున్నాయి! 🚩 ✅ LTV 75% నుండి 85% కి పెంపు. ✅ లోన్ క్లియర్ అయిన 7 రోజుల్లోపు బంగారం ఇవ్వాలి. ✅ లేనిపక్షంలో బ్యాంకుకు రోజుకు ₹5000 పెనాల్టీ. సామాన్యుడికి ఆర్బీఐ రక్షణ కవచం! పూర్తి విశ్లేషణ ...




