క్రియేటర్లకు అలర్ట్! 📢 మీ సంపాదన ₹20,000 దాటితే 10% TDS కట్ అవుతుందని తెలుసా? సోషల్ మీడియా ఆదాయంపై పన్ను పోటు తప్పదు. మీ ఆదాయాన్ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చదవండి. #Social Media Tax India, #Section 194R for Influencers, #GST for Content Creators, #Income Tax on YouTube Earnings, #TDS on Brand Gifts, #Digital Economy Tax
ఒకప్పుడు సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం.. కానీ నేడు అది ఒక భారీ అర్ధికవ్యవస్థ. చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త సృజనాత్మకత ఉంటే చాలు, నెలకు లక్షల్లో సంపాదిస్తున్న 'డిజిటల్ గురువులు' గల్లీకి ఒకరు కనిపిస్తున్నారు. యు ట్యూబ్రీల్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ ల వరకు పెయిడ్ ప్రమోషన్ల వరకు.. క్రియేటర్ల ఖాతాల్లోకి కాసుల వర్షం కురుస్తోంది. అయితే, ఈ రంగుల ప్రపంచంలో సంపాదన ఎంత వేగంగా పెరుగుతుందో, ఆదాయపు పన్ను శాఖ కన్ను కూడా అంతే గట్టిగా పడుతోంది. "సంపాదించాం.. ఎంజాయ్ చేశాం" అంటే ఇకపై కుదరదు; ప్రతి పైసాకూ లెక్క చెప్పాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది క్రియేటర్లలో ఉన్న ప్రాథమిక అపోహ ఏంటంటే.. "మేము ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు కదా, మాకు పన్ను ఎందుకు?" అని. కానీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, మీరు సోషల్ మీడియా ద్వారా క్రమ పద్ధతిలో ఆదాయం పొందుతుంటే, అది 'వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం' కిందకు వస్తుంది.
మీరు ఫుల్-టైమ్ క్రియేటర్ అయినా లేదా పార్ట్-టైమ్ సంపాదిస్తున్నా, ప్లాట్‌ఫారమ్ నుంచి వచ్చే యాడ్ రెవెన్యూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, అఫిలియేట్ మార్కెటింగ్ కమిషన్లు, చివరకు అభిమానులు ఇచ్చే 'సూపర్ చాట్' విరాళాలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. మీ మొత్తం వార్షిక ఆదాయం పన్ను పరిమితి దాటితే, మీ స్లాబ్ రేటు ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే.
బహుమతులే కదా అని లైట్ తీసుకుంటే కష్టమే!
క్రియేటర్లకు బ్రాండ్ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, వాచీలు, కాస్మెటిక్స్ లేదా విదేశీ పర్యటనలు 'గిఫ్ట్'గా రావడం సహజం. గతంలో వీటికి లెక్క ఉండేది కాదు. కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్, 1963 ప్రకారం ఏర్పడిన ఒక చట్టబద్ధమైన సంస్థ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు – సి బి డి టి.ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం కింద పనిచేస్తుంది. 2022లో ఈ బోర్డు ప్రవేశపెట్టిన సెక్షన్ 194R ఈ ఆటలకు బ్రేక్ వేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు అందుకున్న బహుమతులు లేదా ప్రయోజనాల విలువ రూ.20 వేలు దాటితే, సంబంధిత కంపెనీ 10% టాక్స్ డిడేక్టేడ్ ఎట్ సోర్స్ – టి డి ఎస్ కోయడం తప్పనిసరి. మీరు ఆ వస్తువును వాడినా లేదా తిరిగి ఇచ్చేసినా (రిటర్న్ పాలిసీ లేకపోతే), దాని మార్కెట్ విలువను మీ ఆదాయంగానే పరిగణిస్తారు.
కేవలం ఆదాయపు పన్ను మాత్రమే కాదు, క్రియేటర్లకుజి ఎస్ టి నిబంధనలు కూడా వర్తిస్తాయి. మీ వార్షిక టర్నోవర్ (మొత్తం సంపాదన) 20 లక్షల రూపాయలు దాటిన వెంటనే, మీరు జి ఎస్ టి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అప్పటి నుంచి మీరు బ్రాండ్లకు ఇచ్చే సేవలపై 18% జి ఎస్ టి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలి. డిజిటల్ సేవల ఎగుమతి (విదేశీ కంపెనీల నుంచి ఆదాయం) విషయంలో కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను విస్మరిస్తే భారీ జరిమానాలు తప్పవు.
పన్ను కట్టడమే కాదు, పన్ను ఆదా చేసుకునే మార్గాలు కూడా క్రియేటర్లకు ఉన్నాయి. మీ కంటెంట్ తయారీ కోసం చేసే ఖర్చులను మీరు ఆదాయం నుండి మినహాయించుకోవచ్చు. డిజిటల్ టూల్స్ అంటే Canva, Adobe Premiere Pro వంటి సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్లు. ChatGPT ప్లస్ వంటి AI టూల్స్ కోసం పెట్టే ఖర్చు. కెమెరా, మైక్, ట్రైపాడ్, ఎడిటింగ్ కోసం వాడే హై-ఎండ్ లాప్‌టాప్. అదేవిధంగా స్టూడియో అద్దె, ఇంటర్నెట్ బిల్లులు, కంటెంట్ కోసం చేసే ప్రయాణ ఖర్చులన్నింటికీ ఇన్‌వాయిస్‌లు భద్రపరుచుకుంటే, మీరు ITR-4 (Presumptive Taxation) కింద లబ్ధి పొందవచ్చు. దీనివల్ల మీ మొత్తం సంపాదనలో 50% మాత్రమే ఆదాయంగా చూపి, మిగిలినది ఖర్చులుగా మినహాయించుకునే అవకాశం ఉంటుంది.
విదేశాల్లో నిబంధనలు ఇంకా కఠినం
భారత్‌లో ఇప్పుడిప్పుడే నిబంధనలు అమలవుతుంటే, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇవి మరింత కఠినంగా ఉన్నాయి. అమెరికాలోఒక్క డాలర్ సంపాదనను కూడా వదలరు. ముఖ్యంగా 'పెయిడ్ పార్ట్‌నర్‌షిప్' అని డిస్‌క్లోజ్ చేయకపోతే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నిబంధనల ప్రకారం క్రియేటర్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. యూరోపియన్ యూనియన్ లో పారదర్శకత లేని కంటెంట్‌ను నేరంగా పరిగణిస్తారు. అడ్వర్టైజ్‌మెంట్‌ను అడ్వర్టైజ్‌మెంట్‌గానే చూపాలి, లేదంటే భారీ పెనాల్టీలు విధిస్తారు.
జాగ్రత్త పడకపోతే 'స్క్రూటినీ' ముప్పు!
భారత్‌లో ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా క్రియేటర్లు ఉన్నట్లు అంచనా. వీరిలో ప్రొఫెషనల్ క్రియేటర్ల సంఖ్య తక్కువే అయినా, రానున్న రోజుల్లో ఆదాయపు పన్ను శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌ను పర్యవేక్షించే అవకాశం ఉంది. ఈ నేపద్యంలో క్రియేటర్లు తమ ప్రతి సంపాదనకు ఇన్వాయిస్ ఉండాలి. బ్రాండ్ అగ్రిమెంట్లను భద్రపరుచుకోవాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్లలో ప్రతి ఎంట్రీకి లెక్క ఉండాలి. సంపాదనతో సంబంధం లేకుండా ITR ఫైల్ చేయడం అలవాటు చేసుకోవాలి.
క్రియేటివిటీ అనేది ఒక కళ, కానీ అది ఆదాయ వనరుగా మారినప్పుడు ఒక బాధ్యతగా మారుతుంది. డిజిటల్ ప్రపంచంలో మీరు సృష్టించే ప్రతి 'లైక్' వెనుక ఒక 'టాక్స్' లెక్క దాగి ఉందని మర్చిపోవద్దు. చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలంటే, సరైన ఆర్థిక సలహాదారుని సంప్రదించి, మీ టాక్స్ రిటర్న్స్‌ను పక్కాగా దాఖలు చేయడమే ఉత్తమం. లేదంటే, రీల్స్ హిట్టయినా.. రియల్ లైఫ్‌లో ఐటీ నోటీసులు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు!