విజయవాడ, ఏప్రియల్ 21 : ఒకప్పుడు చేపల ఉత్పత్తిలో దేశంలో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో ఉన్న బీహార్, ప్రస్తుతం అద్భుతమైన ప్రగతిని నమోదు చేస్తోంది. దశాబ్ద కాలంలో చేపల ఉత్పత్తిలో సుమారు 200 శాతం వృద్ధిని సాధించి, తొమ్మిదవ స్థానం నుండి నాలుగవ స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వాల ప్రోత్సాహం, కేంద్ర నిధుల వెల్లువ, ఆధునిక సాంకేతికత తోడవ్వడంతో బీహార్ మత్స్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే, ఇప్పటికి అక్కడ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే చేపలు అధికంగా మార్కెట్ లో లభిస్తున్నాయి.

పెరుగుతున్న ఉత్పత్తి.. మారుతున్న గణాంకాలు

గత పదేళ్లలో బీహార్ మత్స్య రంగం సాధించిన ప్రగతి అసాధారణం. 2014-15లో కేవలం 4.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే ఉండగా, 2023-24 నాటికి అది 8.73 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది సుమారు 81.98 శాతం వృద్ధి. ఇక 2024-25 నాటికి ఈ గణాంకం 9.59 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే, 2025-26లో రికార్డు స్థాయి దిగుబడి ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కట్ల, రోహు, మృగాల, సిల్వర్ కార్ప్ వంటి రకాలను బీహార్ లోని చెరువులలో ఎక్కువగా పండిస్తున్నారు. కేవలం రాష్ట్ర అవసరాలే కాకుండా, గత ఏడాది సుమారు 38 వేల మెట్రిక్ టన్నుల చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం ద్వారా బీహార్ ప్రాంత చేపల రైతులు దేశీయ మార్కెట్ లో పట్టు బిగిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రాంత చేపల రైతులపై పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. 

రాజకీయ రంగు పులుముకున్న చేపల వివాదం

బీహార్‌లో చేపల ఉత్పత్తి భారీగా పెరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ నుండి వస్తున్న చేపల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో అక్కడ మార్కెట్ లో దిగుమతి అవుతున్న చేపలలో ఫార్మలిన్, కాడ్మియం, సీసం (లెడ్) మరియు పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయంటూ స్థానిక మర్కెట్స్ లో కొందరు ప్రచారం చేస్తుండటం ఎపి , పశ్చిమ బెంగాల్ లకుఇపుడు ఇబ్బందికర పరిణామం గా భావిస్తున్నారు. ఏడేళ్ల క్రితం ఇలాంటి అలజడి రేగటం తో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఆ సమయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని నిషేధం విధించటం తో కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎపి లో పర్యటించి సంపిల్స్ సేకరించి , ప్యాకింగ్ , రవాణా వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశిలించారు. స్థానిక మత్స్య విక్రేతల అసోసియేషన్ సైతం ఒత్తిడి చేయటం తో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.

కేంద్రం ప్యాకేజీల పంట

ఈ సమస్యల నడుమ, మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బీహార్‌పై వరాలు కురిపిస్తోంది. 'ప్రధాన మంత్రి ప్రత్యేక ప్యాకేజీ' కింద రూ. 279.55 కోట్లు, 'ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన' (PMMSY) కింద రూ. 522.41 కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపపిల్లల పెంపకం, మొబైల్ రిటైల్ మార్కెట్లు, కోల్డ్ స్టోరేజీలు మరియు బయోఫ్లోక్ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్స్య శిక్షణ, ఏరేటర్ల ఏర్పాటు వంటి పథకాలతో రైతులను ప్రోత్సహిస్తోంది.

మొత్తానికి, బీహార్ మత్స్య రంగం ఆర్థికంగా పుంజుకుంటున్న మాట వాస్తవమే. ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కానీ, ఇతర రాష్ట్రాల చేపల ఉత్పత్తులపై సాగిస్తున్న ప్రచారంకు బిహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలోనే కట్టడి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.