డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2026 చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. డెహ్రాడూన్ నుండి విడుదలైన చార్‌ధామ్, హేమకుండ్ సాహిబ్ యాత్ర కోసం భారీగా భక్తులు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు.  ఈ ఏడాది అంటే మార్చి 18, 2026 వరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు మొత్తం 6,86,305 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతుంది . దీంతో ఈ ఏడాది యాత్రలో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఏడు లాగే ఈసారి కూడా కేదార్‌నాథ్ పట్ల భక్తులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. కేదార్‌నాథ్ వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 2,29,295 గా నమోడుకావటంతో ఈ ఆలయం మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా బద్రీనాథ్ 2,02,622, గంగోత్రి 1,28,253 , యమునోత్రి 1,25,366, హేమకుండ్ సాహిబ్ 769 గా భక్తులు నమోదు చేసుకున్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతుంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ : చార్‌ధామ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనిని పలు మార్గాల్లో ఉచితంగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్ వెబ్‌సైట్: అధికారిక పోర్టల్ https://registrationandtouristcare.uk.gov.in/, https://registrationandtouristcare.uk.gov.in/ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇక మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి "Tourist Care Uttarakhand" యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. వాట్స్అప్ లో మీ మొబైల్ నుండి 8394833833 నంబర్‌కు 'YATRA' అని మెసేజ్ పంపడం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. వీటితో పాటు ఆఫ్‌లైన్ కౌంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రిషికేశ్, హరిద్వార్, సోన్‌ప్రయాగ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లకు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికోసం ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఐ డి ప్రూఫ్ , ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,పని చేస్తున్న మొబైల్ నంబర్ తమ వెంట తీసుకుని వెళ్ళాలి.

యాత్ర రూట్ మ్యాప్ : సాధారణంగా చార్‌ధామ్ యాత్ర , హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి ప్రారంభమవుతుంది. సాంప్రదాయ పద్ధతిలో యాత్ర క్రమం ఇలా ఉంటుంది:

1.యమునోత్రి: హరిద్వార్/రిషికేశ్ → బార్కోట్ → జానకీచట్టి → (6 కి.మీ నడక) యమునోత్రి.

2.గంగోత్రి: బార్కోట్ → ఉత్తరకాశీ → హర్సిల్ → గంగోత్రి.

3. కేదార్‌నాథ్: ఉత్తరకాశీ → గుప్తకాశీ → సోన్‌ప్రయాగ్ → గౌరీకుండ్ → (16-18 కి.మీ నడక) కేదార్‌నాథ్.

4.బద్రీనాథ్: కేదార్‌నాథ్ → రుద్రప్రయాగ్ → జోషిమఠ్ → బద్రీనాథ్.

5.హేమకుండ్ సాహిబ్: బద్రీనాథ్ మార్గంలో ఉండే గోవింద్‌ఘాట్ నుండి ఘంగారియా మీదుగా హేమకుండ్ సాహిబ్‌కు చేరుకోవచ్చు. (ఇది గోవింద్‌ఘాట్ నుండి సుమారు 19 కి.మీ నడక దారి).

ముఖ్యమైన సూచనలు:

ప్రారంభ తేదీలు: ఈ ఏడాది యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలు ఏప్రిల్ 19 నుండి 23 మధ్యలో తెరుచుకునే అవకాశం ఉంది. హేమకుండ్ సాహిబ్ మే 25, 2026న ప్రారంభమవుతుంది.

స్లాట్ బుకింగ్: ప్రతిరోజూ దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యపై పరిమితి ఉంటుంది, కాబట్టి ముందుగానే రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం.

ఆరోగ్య ధృవీకరణ: వృద్ధులు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.