ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ షాదరాలో అక్రమ ఆయుధాల ముఠాను అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి 3 తుపాకులు, 23 లైవ్ తూటాలు స్వాధీనం. ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు. పూర్తి వివరాల కోసం చదవండి.
న్యూఢిల్లీ, ఏప్రియల్ 17 : దేశ రాజధానిలో మరోసారి తుపాకుల మోత మోగించేందుకు స్కెచ్ వేసిన ఒక అక్రమ ఆయుధాల ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గాలపై ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా, నగరంపై పట్టు సాధించి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని కలలు కన్న ఒక యువకుడి వ్యూహాన్ని పోలీసులు ఆదిలోనే చిదిమేశారు. షాదరా ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్ నిర్వహించిన క్రైమ్ బ్రాంచ్ బృందం, ఒక నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది.
ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న అక్రమ వసూళ్లు , కాంట్రాక్ట్ కిల్లింగ్ కేసులలో అక్రమ ఆయుధాల వినియోగం పెరగడంపై క్రైమ్ బ్రాంచ్ విభాగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అక్రమ ఆయుధాల సరఫరాదారులపై నిఘా ఉంచిన పోలీసులకు, ఏప్రిల్ 14న ఒక కీలక సమాచారం అందింది. షాదరాలోని భోలానాథ్ నగర్ నివాసి అయిన అబు తాలిబ్ అనే వ్యక్తి, తన ప్రత్యర్థి ముఠాపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారీగా ఆయుధాలను నిల్వ చేసినట్లు ఇన్‌ఫార్మర్ ద్వారా తెలిసింది. దీంతో ఏసీపీ సునీల్ శ్రీవాస్తవ పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ గుర్మీత్ సింగ్ నేతృత్వంలోని ఈఆర్-1 బృందం మెరుపు దాడికి ప్రణాళిక రచించింది.
ఎస్‌ఐ సంజయ్ త్యాగి, ఏఎస్‌ఐ వినయ్ త్యాగి, హెచ్‌సీలు అంకుర్, మోహిత్, అజయ్, తరుణ్ మరియు కానిస్టేబుళ్లు దీపక్, ఆకాశ్ వర్మలతో కూడిన ప్రత్యేక బృందం షాదరాలోని ఒక కళాశాల సమీపంలో మోహరించింది. పక్కా సమాచారంతో భోలానాథ్ నగర్‌లోని నిందితుడి నివాసంపై దాడి చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా నిందితుడు దాచి ఉంచిన రెండు అత్యాధునిక పిస్టల్స్, ఒక దేశీ కట్టా (నాటు తుపాకీ), 23 తూటాలు (Live Cartridges), 11 ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
ఫ్రూట్ వ్యాపారం ముసుగులో.. గ్యాంగ్‌స్టర్ కలలు
పోలీసుల విచారణలో నిందితుడు అబు తాలిబ్ (27) జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి, సోదరుడితో కలిసి హోల్‌సేల్ ఫ్రూట్ వ్యాపారం చేస్తున్న ఈ నిందితుడు, పైకి సామాన్యుడిగా కనిపిస్తూనే లోపల నేర సామ్రాజ్య విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ లో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిలో నేరప్రవృత్తి ఉంది. నేర ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలని తహతహలాడుతున్నాడు. కేవలం ఆయుధాలను సేకరించడమే కాకుండా, తనకంటూ ఒక కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుచరులను సమీకరిస్తున్నట్లు పోలీసుల ఇంటర్రాగేషన్‌లో వెల్లడైంది.
నిందితుడు అబు తాలిబ్ ఈ ఆయుధాలను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి సేకరించినట్లు పోలిసుల అంగీకరించాడు. సుమారు 2-3 విడతలుగా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న 11 ఖాళీ తూటాలను పరిశీలించిన పోలీసులకు నిందితుడు మరో కీలక సమాచారం ఇచ్చాడు. ఆయుధాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి నిందితుడు ఇప్పటికే పలుమార్లు 'టెస్ట్ ఫైరింగ్' కూడా నిర్వహించినట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న ఆయుధాల నాణ్యతను బట్టి చూస్తే, వీటి వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నేర చరిత్ర మరియు ప్రతీకారేచ్ఛ
అబు తాలిబ్ ఇదివరకు 2018లో ఫర్ష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో నిందితుడిగా ఉన్నాడు. జిమ్ సమీపంలో పార్కింగ్ గొడవ కారణంగా జరిగిన ఆ వివాదంలో ఐపీసీ సెక్షన్ 324, 506 కింద కేసులు నమోదై ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అయితే, స్థానిక ప్రత్యర్థులతో ఉన్న శతృత్వం కారణంగా, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి తాలిబ్ కరడుగట్టిన నేరస్థుడిగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఆత్మరక్షణ కోసం కాకుండా, ప్రాంతీయంగా తన ఆధిపత్యం చాటుకోవడమే లక్ష్యంగా ఇతడు ఆయుధాలు సమకూర్చుకున్నట్లు డీసీపీ పంకజ్ కుమార్ వెల్లడించారు.
ఈ అరెస్ట్‌తో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జరగబోయే ఒక పెద్ద రక్తపాతాన్ని పోలీసులు నివారించగలిగారు. అబు తాలిబ్‌పై ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 కింద కేసు నమోదు చేసి, విచారణను ముమ్మరం చేశారు. మీరట్‌లో ఆయుధాలను సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి ఎవరు? ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వ్యవస్థీకృత నేర ముఠాలతో ఈ నిందితుడికి ఏవైనా లింకులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్ బృందం ప్రదర్శించిన చాకచక్యం మరియు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.