ప్రైవేట్ బస్సుల నకిలీ రిజిస్ట్రేషన్లు, పన్ను ఎగవేత మరియు స్లీపర్ బస్సుల ప్రమాదాలపై సమగ్ర కథనం. రాబోయే 22 నెలల్లో స్లీపర్ బస్సుల దశలవారీ తొలగింపుపై ప్రభుత్వ తాజా నివేదిక.
విజయవాడ, ఏప్రిల్ 19:ప్రయాణికుల రక్షణ గాలిలో దీపంలా మారుతోంది. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తారని నమ్మి ప్రైవేట్ బస్సు ఎక్కితే, ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామా లేదా అన్న భయం ప్రయాణికులను వెంటాడుతోంది. బస్సు ఎక్కడ కొనుగోలుచేసినా నడిపే ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని గాలికి వదిలేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు చేస్తున్న పన్ను ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలు ఇప్పుడు ఒక వ్యవస్థీకృత కుంభకోణాన్ని తలపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో నకిలీ చిరునామాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని, తెలుగు రాష్ట్రాల రోడ్లపై అనేక ఏళ్లుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపబోతున్నాయి. నూజివీడు లో శనివారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఎల్లో ట్రావెల్ బస్సు నడుస్తున్నట్లు గుర్తించి సీజ్ చేసారు. అదేసమయంలో సంభందిత బస్సు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ అధికారులను కోరారు.
పన్ను ఎగవేతే పరమావధి
మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ బస్సు రోడ్డుపై తిరగాలంటే, ప్రతి మూడు నెలలకు రూ. 90 వేల చొప్పున పన్ను చెల్లించాలి. ఏడాదికి దాదాపు రూ. 3.60 లక్షల పన్ను చెల్లించాలసి రావటంతో పన్ని ఎగవేసేందుకు ఆపరేటర్లు అక్రమ విధానాలను అనుసరిస్తున్నారు . ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో అదే బస్సుకు ఏడాదికి కేవలం రూ. 6 వేల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ భారీ వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు, ఆలిండియా పర్మిట్ పేరిట తక్కువ పన్నుతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సేవలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఒకే దేశం-ఒకే విధానంలో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులను కొందరు ఆపరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారు. వాట్సాప్‌లో పత్రాలు పంపితే గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం, వాహన తనిఖీలు (ఫిజికల్ వెరిఫికేషన్) నామమాత్రంగా ఉండటం వంటి లోటు పాట్లు వీరికి వరంగా మారాయి. ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఈ బస్సుల వల్ల ఖజానాకు గండి పడటమే కాకుండా, ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతోంది.
ఆంధ్రా నుంచి అంబాలా వరకు
కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఈ 'రిజిస్ట్రేషన్' కుంభకోణం వేళ్లు పాతుకుపోయాయని ఇటివల అంబాలాలో వెలుగుచూసిన ఘటన నిరూపిస్తోంది. తమిళనాడు, నాగాలాండ్ వంటి రాష్ట్రాలకు చెందిన 200కు పైగా వాహనాలను నకిలీ చిరునామాలతో అంబాలాలో రిజిస్టర్ చేయడం సంచలనం రేపింది. దర్యాప్తులో అధికారులు గుర్తించిన అంశాలు మరింత విస్తుగొలిపేలా ఉన్నాయి. అసలు అస్తిత్వమే లేని కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్లు, బీమా పత్రాలు లేకపోవడం, యజమానుల నకిలీ ఐడీ ప్రూఫ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లక్షల రూపాయలు చేతులు మారడం వల్లే ఈ అక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఫైనల్ రిపోర్టు సిద్ధమవుతుంది. దీనిపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తోసుకోబోతుంది.
స్లీపర్ బస్సుల నిషేధానికి కౌంట్‌డౌన్
ప్రైవేట్ బస్సు ప్రమాదాలు, ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యం కావడంతో భద్రతపై ఆందోళన పెరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించగా, ఇప్పుడు భారత్ కూడా ఆ బాటలో అడుగులు వేయాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా - 'ఆస్కి' ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వరుసగా జరుగుతున్న బస్సు దగ్ధ ఘటనల నేపథ్యంలో, రాబోయే 22 నెలల్లో స్లీపర్ బస్సులను దశలవారీగా తొలగించాలని, వాటిని సీటర్ బస్సులుగా మార్చుకోవాలని నివేదిక స్పష్టం చేసింది. బస్సుల్లో అత్యవసర ద్వారాలు లేకపోవడం, డ్రైవర్ క్యాబిన్ మరియు ప్రయాణికుల కంపార్ట్‌మెంట్ల మధ్య తలుపుల వల్ల ప్రమాద సమయంలో ప్రయాణికులు బయటపడలేక మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో కఠిన నిబంధనలను అమలు చేయడం, 10 కేజీల అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచడం వంటి అంశాలను తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రైవేట్ ఆపరేటర్లు పన్నులు తగ్గించాలని ప్రభుత్వ పెద్దల వద్ద లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నప్పటికీ, వరుసగా జరుగుతున్న ప్రమాదాలు, క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న అక్రమాలు ప్రభుత్వాలను కఠిన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకునే ఏ ఆపరేటర్‌కూ ఇకపై మినహాయింపులు ఉండవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రవాణా శాఖ ఉన్నతాధికారులు సంకేతాలిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ కల్పించే దిశగా సాగుతున్న ఈ సంస్కరణలు, భవిష్యత్తులో రహదారి ప్రయాణాన్ని ఎంతవరకు సురక్షితంగా మారుస్తాయో చూడాల్సి ఉంది.