దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులకు కీలకమైన 'ఆధార్' సేవలను మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ –యూఐడీఏఐ అడుగులు వేస్తోంది. ఆధార్ కేంద్రాల గుర్తింపులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రముఖ డిజిటల్ మ్యాపింగ్ సంస్థ 'మ్యాప్ మై ఇండియా' తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా ఇకపై 'మ్యాపిల్స్' యాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత ఆధార్ కేంద్రాల వివరాలు ఒక్క క్లిక్ తో అందుబాటులోకి రానున్నాయి.

డిజిటల్ మ్యాపింగ్‌తో పక్కా సమాచారం

సాధారణంగా ఆధార్ కేంద్రాల కోసం వెతికే క్రమంలో ప్రజలు అనధికారిక కేంద్రాల బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో, ఏప్రిల్ 1న ఢిల్లీలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, యూఐడీఏఐ ధృవీకరించిన ప్రతి ఆధార్ సేవా కేంద్రం – ఏ ఎస్ కె మరియు ఇతర నమోదు కేంద్రాల ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని మ్యాపిల్స్ యాప్‌లో నిక్షిప్తం చేస్తారు.

దీనివల్ల నివాసితులు తమ ఇంటికి సమీపంలో ఉన్న కేంద్రాలను సులభంగా గుర్తించడమే కాకుండా, అక్కడికి చేరుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను అంటే నావిగేషన్ ను కూడా పొందవచ్చు.

సేవల వారీగా వర్గీకరణ

ఈ కొత్త విధానంలో కేవలం చిరునామా మాత్రమే కాకుండా, ఏ కేంద్రంలో ఏ విధమైన సేవలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా కొత్తగా ఆధార్ తీసుకునే పెద్దల కోసం ప్రత్యేక కేంద్రాలు. ఐదేళ్ల లోపు పిల్లల నమోదు కోసం ప్రత్యేక సదుపాయాలున్న కేంద్రాలు. చిరునామా మార్పు, ఫోన్ నంబర్ అనుసంధానం వంటి సేవలు అందించే కేంద్రాలు ఇలా వినియోగదారులు తమకు కావాల్సిన సేవను బట్టి ఫిల్టర్ చేసుకునే సౌకర్యం ఉండటం వల్ల, సమయం వృధా కాకుండా నేరుగా సంబంధిత కేంద్రానికి వెళ్లవచ్చు.

ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ లేదా ఇతర సెర్చ్ ఇంజన్లలో ఆధార్ కేంద్రాల కోసం వెతికినప్పుడు పాత లేదా మూతబడిన కేంద్రాల వివరాలు కూడా కనిపిస్తుంటాయి. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తోంది. ఈ నేపథ్యంలో, "పౌరుల సౌకర్యమే మా ప్రథమ ప్రాధాన్యత" అని యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ పేర్కొన్నారు. అధికారిక డేటాను నేరుగా మ్యాపింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ్యాప్ మై ఇండియా సహ వ్యవస్థాపకుడు రాకేష్ వర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్త పంపిణీ కలిగిన ఆధార్ వ్యవస్థకు తమ సాంకేతికతను అందించడం గర్వకారణమని, దీనివల్ల సామాన్యులకు డిజిటల్ మ్యాపింగ్ ఫలాలు అందుతాయని తెలిపారు.

ఎప్పటి నుండి అందుబాటులోకి?

వచ్చే రెండు నెలల కాలంలో ఈ సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. యూఐడీఏఐ అందించే తాజా డేటాను మ్యాపిల్స్ ప్లాట్‌ఫామ్‌లోకి క్రోడీకరించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక్కసారి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, మారుమూల ప్రాంతాల్లో సైతం పౌరులు తమకు అందుబాటులో ఉన్న ఆధార్ సేవలను వెతుక్కోవడం అడ్డంకి లేకుండా సాగుతుంది.

పారదర్శకత - జవాబుదారీతనం

ఈ ఒప్పందం కేవలం సాంకేతిక అనుసంధానం మాత్రమే కాదు, ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను పెంచే ఒక విప్లవాత్మక చర్య. డిజిటల్ ఇండియా లక్ష్యాలలో భాగంగా ప్రతి భారతీయుడికి ప్రభుత్వ సేవలను డిజిటల్ పద్ధతిలో చేరువ చేయడంలో ఇది మరో ముందడుగు. ఆధార్ కేంద్రాల వద్ద ఉండే రద్దీని తగ్గించడానికి, సేవల నాణ్యతను పర్యవేక్షించడానికి కూడా ఈ మ్యాపింగ్ ఉపయోగపడనుంది. ఇంకా చెప్పాలంటే, ఆధార్ అనేది కేవలం ఒక కార్డు మాత్రమే కాదు, అది ఒక పౌరుడి డిజిటల్ ఉనికి. ఆ ఉనికిని సుస్థిరం చేసే కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం పౌరుల హక్కు. ఆ హక్కును అత్యంత సులభంగా, సురక్షితంగా అందించడానికి యూఐడీఏఐ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.

  • Pib