తెలుగులో ఒక సినిమా ఉంది . జగపతి బాబు హీరోగా నటిస్తే రోజా, ఆమని హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా పేరు శుభలగ్నం. ఇందులో ఆమనికి డబ్బు మీద ఆశ. ఆ డబ్బు ఆశ చూపించి రోజా జగపతిబాబును కొనుగోలు చేసి అతనితో జీవితం ప్రారంభిస్తుంది. సరిగ్గా ఇలాంటి సినిమా హిందీలో కూడా తీసారు. ఆ సినిమా పేరు అనిల్ కపూర్ నటించిన 'జుదాయి'. ఇందులో శ్రీదేవి పాత్రను కాజల్ పోషించింది. ఆమె చాలా డబ్బు ఆశపడే గృహిణి. అనిల్ కపూర్ మూవిలో రాజ్ గా ఆమె భర్త పాత్రలో మంచి మనసున్న వ్యక్తిగా నటించారు. ఉర్మిళ సినిమాలో జాన్‌వీగా ధనవంతురాలి పాత్ర పోషించారు. జాన్‌వీకి రాజ్ నచ్చుతాడు ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. డబ్బు కోసం కాజల్ తన భర్తనే అమ్మడానికి ఒప్పుకుంటుంది. తర్వాత జరిగే భావోద్వేగ పరిణామాలు, కుటుంబం పాడవడం, పశ్చాత్తాపం.. ఇవే ఈ రెండు సినిమాలలోని ఇతివృత్తం.

థాయ్‌లాండ్‌లో సినిమాను తలపించే ఒక వింత ఘటన : తాజాగా ఇలాంటి వింత ఘటన ఒకటి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో వెలుగు చూసింది.ఖున్ క్వాంగ్(31) అనే మహిళ తన భర్తకు చాలా కాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పరాయి స్త్రీ తో వుండగా తన భర్తను పట్టుకుంది. భర్త క్షమాపణలు కోరి అపుడు బయట పడ్డా తిరిగి అతడు తన ప్రియురాలిని కలవడం ప్రారంభించాడు. దీంతో ఖున్ క్వాంగ్ తన భర్తను నిలదీసింది. అయితే ప్రియురాలు తనతో సంబంధాన్ని తెంచుకోవడానికి నిరాకరిస్తోందని,విడిపోతే తనను తాను గాయపరచుకుంటానని బెదిరిస్తోందని భర్త తన భార్యకు వివరించాడు. అయితే ఈ సంఘటనలో ఖున్ క్వాంగ్ క్రుంగి పోలేదు. తన భర్త ప్రియురాలి ముందు ఒక అసాధారణ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. తన భర్తతో ఆమె కలిసి ఉండటానికి అంగీకరిస్తూ ఇందుకు ప్రతి నెలా తనకు 30,000 బాట్ చెల్లించాలని షరతు పెట్టింది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 85 వేలు చెల్లించే షరతుకు ఆ ప్రియురాలు ఒప్పందానికి అంగీకరించింది. ఈ వింత వ్యవహారం పై అక్కడి కోర్టు విచారించి "భర్త-లీజు ఒప్పందాలకు" ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని స్పష్టం చేసింది.

ఎలా వెలుగులోకి వచ్చింది?:థాయ్‌లాండ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోన్-క్రాసే' (Hone-Krasae) అనే టీవీ టాక్ షోలో ఆ మహిళ స్వయంగా పాల్గొని తన కథను వివరించడంతో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆమె భర్త ఒక పోలీస్ ఆఫీసర్. అతను గత కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా ఆమె తెలుసుకుంది. భర్తను వదులుకోలేక, అలాగని ప్రియురాలిని వదలని భర్తను చూసి విసిగిపోయి ఆమె ఈ వింత నిర్ణయం తీసుకుంది.ఆశ్చర్యకరంగా భర్త ప్రియురాలు ఈ ఒప్పందానికి అంగీకరించింది. "డబ్బు సమస్య కాదు, అతను నాతో ఉంటే చాలు" అని ఆమె పేర్కొంది. అయితే, భార్య తనను ఇలా 'వస్తువులా' అద్దెకు పెట్టడాన్ని భర్త వ్యతిరేకించాడు. ఇది తన ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని అతను షోలో తెలిపాడు. థాయ్ చట్టం ప్రకారం ఒక భార్య తన భర్తను ఇలా లీజుకు ఇవ్వడం చెల్లదని, అక్కడి చట్టాలకు ఇది విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు.

డబ్బు కోసం భర్తను వదిలేసిన భార్య.. భోపాల్‌లో నిజ జీవిత సంఘటన

తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ ఇపుడు వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. అదే సమయంలో కుటుంబ విలువలు, సంబంధాలపై చర్చకు ఈ కేసు తెరలేపింది. ఈ కేసు సైతం మనం పైన ప్రస్తావించిన జుదాయి , శుభలగ్నం సినిమా కధలను కథను తలపిస్తోంది. భోపాల్ ఫ్యామిలీ కోర్టులో 42 ఏళ్ల వ్యక్తి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అతనికి తనకంటే పెద్ద వయసున్న మహిళ(54)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.వారి 16 ఏళ్ల కుమార్తె ఈ గొడవలతో విసిగిపోయి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. సాదారణంగా ఇలాంటి సందర్భంలో విడాకులు తీసుకునే మహిళ భర్త నుంచి కుటుంబ ఖర్చుల క్రింద మెయిన్టినెన్స్ కోరుతుంది. కానీ ఈ కేసులో భార్య తీసుకున్న నిర్ణయం విభిన్నంగా నిలిచింది. భర్త ప్రేయసి నుంచే డబ్బు తీసుకుని విడాకులు ఇవ్వాలని నిర్ణయించింది. చివరికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి, సుమారు రూ. 1.5 కోట్లకు సెటిల్‌మెంట్ జరిగింది. ఒప్పందం ప్రకారం. ఆ ప్రియురాలు తన పేరు మీద ఉన్న ఒక డూప్లెక్స్ ఇల్లు, రూ. 27 లక్షల నగదును భార్య పేరు మీదకు బదిలీ చేసింది. భర్తకు విడాకులు ఇస్తూ అతడి భార్య విడాకుల పత్రాలపై సంతకం చేసింది. దీంతో భర్త తన ప్రేయసితో జీవితం కొనసాగించడానికి మార్గం సుగమమైంది. 'డబ్బుకు బదులు భర్తను వదులుకునే' ఒప్పందాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.

"మరి ఇలాంటి ఒప్పందాలపై మీ అభిప్రాయం ఏమిటి?" కామెంట్స్ రూపంలో తెలియచేయండి.