భారతదేశ అంతర్గత భద్రతను అస్థిరపరచడమే లక్ష్యంగా సరిహద్దు అవతల నుంచి సాగుతున్న ఉగ్ర కోరలు కొత్త రూపం దాల్చుతున్నాయి. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు మళ్ళించడం పాత పద్ధతి అని భావించిన పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐ ఎస్ ఐ , ఇప్పుడు 'ఫాల్స్ ఫ్లాగ్' ఆపరేషన్లతో దేశంలో మత విద్వేషాలు రగిల్చేందుకు భయంకరమైన వ్యూహాన్ని రచించింది. హిందూ యువకులనే పావులుగా వాడుకుని, హిందూ సంస్థలు , ఆస్తులపై దాడులు చేయించడం ద్వారా దేశంలో అంతర్గత యుద్ధం జరుగుతోందనే భ్రమను ప్రపంచవ్యాప్తంగా కల్పించడమే ఈ కుట్రలోని అసలు కోణం.
యూపీ ఏటీఎస్ (ఉగ్రవాద నిరోధక దళం – ఏ టి ఎస్) , ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం ఇటీవల ఛేదించిన వరుస ఉగ్ర మూలాలు ఈ భయంకర వాస్తవాలను వెలుగులోకి తెచ్చాయి.


కుట్ర వెనుక 'నేమ్ టాగ్' పాలిటిక్స్


యూపీలో అరెస్టయిన లోకేష్ అలియాస్ 'పపలా పండిట్', వికాస్ అలియాస్ 'రౌనక్'ల ఉదంతం విస్తుపోయేలా చేస్తోంది. మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ అనే హ్యాండ్లర్, వీరిద్దరికీ భారీగా డబ్బు ఆశ చూపి ముఠాలోకి చేర్చుకున్నాడు. వీరికి ఇచ్చిన మొదటి టాస్క్ ముంబైలోని హిందూ షోరూమ్‌లు, వాహనాలను తగులబెట్టడం. దాడులు చేసిన వారి పేర్లు బయటకు వచ్చినప్పుడు, అవి హిందూ పేర్లుగా ఉంటే అది ఉగ్రవాదంగా కాకుండా 'అంతర్గత గొడవలు'గా చిత్రీకరించవచ్చు అనేది విరి ప్లాన్. ఎందుకంటె పపలా, వికాస్ లు హిందువులు. "హిందువులే హిందువుల ఆస్తులను తగులబెడుతున్నారు" అనే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసి, దేశ ప్రతిష్టను దిగజార్చడం.


రైల్వే సిగ్నళ్లే టార్గెట్.. డిజిటల్ పేమెంట్లతో ఫండింగ్
ముంబైలో ఆస్తుల విధ్వంసానికి భయపడిన ఈ యువకులకు, పాక్ హ్యాండ్లర్ మరో 'సులభమైన' పని అప్పగించాడు. రైల్వే సిగ్నల్ బాక్సులను తగులబెట్టి, ఆ వీడియోలను పంపడం. ఇలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడిన ప్రతిసారీ ఐ ఎస్ ఐ హ్యాండ్లర్లు నిందితులకు QR కోడ్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపేవారు. ఈ నిందితులు కేవలం డబ్బు కోసమే దేశ భద్రతను పణంగా పెట్టడం గమనార్హం.


గత 5 ఏళ్లలో యూపీలో జరిగిన ఇతర ఉగ్ర కుట్రలు:


1. మార్చి 2026: ఢిల్లీ-NCR ఆలయాల వద్ద పేలుళ్లకు ప్లాన్ చేసిన అజీమ్ రాణా, ఆజాద్ అలీల అరెస్ట్.
2. మార్చి 2026: నేవీ లాన్స్ నాయక్ ఆదర్శ్ కుమార్ ఐఎస్ఐ కోసం గూఢచారిగా వ్యవహరిస్తూ పట్టుబడ్డాడు.
3. 2025 మహాకుంభ మేళా: కుంభమేళాలో తొక్కిసలాట, పేలుళ్లు సృష్టించేందుకు బబ్బర్ ఖల్సా ప్లాన్ చేసింది. 3 గ్రెనేడ్లతో లజర్ మసీహ్ అరెస్ట్ అయ్యాడు.
4. నవంబర్ 2025: అయోధ్య, వారణాసిలలో రెక్కీ నిర్వహించిన డాక్టర్ షాహీన్ (జైష్-ఏ-మహ్మద్) మొడ్యూల్ బట్టబయలైంది.
5. మే 2025: వారణాసి ఘాట్లు, రైల్వే స్టేషన్ల ఫోటోలను పాకిస్థాన్‌కు పంపిన తుఫైల్ అహ్మద్ అరెస్ట్.
6. మార్చి 2025: ఫిరోజాబాద్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో డ్రోన్ తయారీ బ్లూప్రింట్లను హనీ ట్రాప్ ద్వారా లీక్ చేసిన రవీంద్ర కుమార్ అరెస్ట్.
7. జూలై 2021: ఆగస్టు 15న లక్నో, కాన్పూర్‌లలో కుక్కర్ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్.



విజయవాడలో ఐసిస్ నీడలు: 'బిఎన్ఎక్స్ కామ్' గుట్టురట్టు


మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఐసిస్ (ISIS) మరియు అల్-ఖైదా (AQIS) అనుకూల కార్యకలాపాలను ఏపీ పోలీసులు ఛేదించారు. ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 'అల్ హకీమ్ షుకూర్' అనే హ్యాండ్లర్, ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లలో 'బిఎన్ఎక్స్ కామ్' (BNX COM) అనే గ్రూపును నడిపిస్తున్నాడు. విజయవాడకు చెందిన రహమతుల్లా షరీఫ్, డానిష్ వంటి యువకులను జిహాదీ భావజాలం వైపు మళ్లించి, ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించడం ఇతని ప్రధాన ఉద్దేశం. పేలుళ్లకు అవసరమైన 'బ్లాక్ పౌడర్', ఐఈడీ (IED) తయారీపై పీడీఎఫ్ డాక్యుమెంట్లను కూడా ఈ గ్రూపులో షేర్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆయుధాలు సరఫరా చేస్తామని వీరికి హ్యాండ్లర్లు భరోసా ఇచ్చారు.

సాకిబ్ వంటి నిందితులు ఆయుధాలతో సోషల్ మీడియాలో 'రీల్స్' చేస్తూ యువతను ఆకర్షించేవారు. ఒకసారి యువత వలలో పడ్డాక, వారికి గజ్వా-ఏ-హింద్ వంటి గ్రూపుల్లో శిక్షణ ఇచ్చి, భారత జాతీయ జెండాను అవమానించడం, జాతీయ గీతాన్ని హేళన చేయడం వంటి దేశద్రోహ పనులకు పురికొల్పేవారు.


గుజరాత్ ఏటీఎస్ చేతికి 'కీలక' సూత్రధారి!


తాజాగా గుజరాత్ ఏటీఎస్ , బనస్కాంత జిల్లాలోని డీసాలో పంజాబ్‌కు చెందిన వాంటెడ్ నేరగాడు బిక్రమ్‌జిత్ సింగ్ అలియాస్ విక్కీ పట్టుబడ్డాడు. డీసాలోని ఒక డాబాలో కూలీగా నటిస్తూ తలదాచుకుంటున్న ఇతడు, పాక్ గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టీకి ప్రధాన అనుచరుడు. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లపై గ్రెనేడ్ దాడుల వెనుక ఇతని హస్తం ఉంది. కేవలం నేరగాడే కాకుండా, ISI సూచనలతో స్థానిక యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే బాధ్యతను కూడా ఇతడు నిర్వహిస్తున్నాడు.


బీహార్ మదర్సాలో ఆయుధాల కలకలం


మరోవైపు బీహార్‌లోని మోతీహారి జిల్లాలో ఒక మదర్సాపై జరిగిన దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. అక్కడ పోలీసులు ఒక పిస్టల్ మరియు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే మదర్సా నుండి PFI కి చెందిన యాకూబ్ అరెస్టయ్యాడు. అయోధ్య రామమందిరంపై సోషల్ మీడియాలో బెదిరింపులు ఇచ్చిన ఇతని నెట్‌వర్క్ ఇంకా యాక్టివ్‌గా ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.


కేవలం మతపరమైన ఉన్మాదమే కాకుండా, పేదరికం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని విదేశీ శక్తులు స్థానిక యువతను పావులుగా వాడుకుంటున్నాయి. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాల పట్ల జాగ్రత్త వహించాలని భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


ఈ 'ఫాల్స్ ఫ్లాగ్' కుట్రను ఛేదించిన తర్వాత ఏటీఎస్ అధికారులు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని నిరూపించడమే కాకుండా, భారతదేశంలో మతపరమైన అస్థిరత సృష్టించడానికి విదేశీ శక్తులు కొత్త దారులు వెతుకుతున్నాయి. స్థానిక నేరగాళ్లను, నిరుద్యోగులను తమ పావులుగా వాడుకుంటున్నాయి.