భారత నౌకాదళ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికాండ్ కెన్యాలోని మొంబాసాకు చేరుకుంది. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ పర్యటన, మహాసాగర్ విజన్ మరియు కెన్యా నౌకాదళంతో సంయుక్త విన్యాసాల పూర్తి వివరాలు ఈ కథనంలో..
హిందూ మహాసముద్రం వేదికగా భారత్ తన వ్యూహాత్మక ప్రాబల్యాన్ని మరోసారి చాటుకుంది. నైరుతి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించిన భారత నౌకాదళ అగ్రశ్రేణి యుద్ధనౌక 'ఐఎన్ఎస్ త్రికాండ్' , ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సోమవారం కెన్యాలోని మొంబాసా ఓడరేవుకు చేరుకుంది. కేవలం ఒక ఓడరేవు సందర్శనగానే కాకుండా, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
భారత పశ్చిమ నౌకాదళ కమాండ్ అధిపతి, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్న తరుణంలోనే ఐఎన్ఎస్ త్రికాండ్ అక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత నౌకాదళ అత్యున్నత స్థాయి వ్యూహకర్తలు, యుద్ధనౌకలు ఒకే సమయంలో కెన్యా గడ్డపై ఉండటం వెనుక స్పష్టమైన దౌత్య సంకేతాలు ఉన్నాయి. "మిత్ర దేశాల భద్రత - సమిష్టి ప్రయోజనం" అనే సూత్రం ప్రాతిపదికగా ఈ భేటీలు సాగుతున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ త్రికాండ్ సిబ్బంది కేవలం విన్యాసాలకే పరిమితం కాకుండా, కెన్యా రక్షణ దళాలకు అవసరమైన అత్యవసర నిత్యావసర వస్తువులను మరియు స్టోర్లను అందజేశారు. ఇది పొరుగు దేశాల పట్ల భారత్ చూపే ఉదారతకు మరియు బాధ్యతాయుతమైన శక్తిగా తన పాత్రకు అద్దం పడుతోంది. పర్యటనలో భాగంగా జరిగే సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు ఇరు దేశాల రక్షణ దళాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించనున్నాయి.
'ప్యాసెక్స్' విన్యాసాలతో ముగింపు
మొంబాసా నుంచి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో కెన్యా నౌకాదళంతో కలిసి ఐఎన్ఎస్ త్రికాండ్ 'ప్యాసేజ్ ఎక్సర్‌సైజ్'లో పాల్గొననుంది. సముద్ర జలాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం. సమాచార మార్పిడిలో సమన్వయం. రెండు దళాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించుకోవడం. వంటి అంశాల్లో ఈ విన్యాసాలు కీలకం కానున్నాయి.
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మహాసాగర్’విజన్ అంటే - ప్రాంతాలవ్యాప్తంగా భద్రత మరియు వృద్ధి కోసం పరస్పర మరియు సమగ్ర పురోగతి. ఈ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో నిరంతరం నిఘా ఉంచుతూనే, మిత్ర దేశాలతో సముద్రయాన సంబంధాలను మరింత దృఢతరం చేసుకుంటోంది. ఐఎన్ఎస్ త్రికాండ్ కెన్యా పర్యటన ఈ వ్యూహాత్మక ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా మిగిలిపోనుంది.