విజయవాడ, మే 19 : దేశవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలలోని అపారమైన బంగారు నిల్వలపై గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో జోరుగా సాగుతున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేవాలయాలకు చెందిన బంగారాన్ని ప్రభుత్వం స్వాదీనం చేసుకోనుందని, అందుకు ప్రతిగా గోల్డ్ బాండ్లను జారీ చేయనుందంటూ వస్తున్న వార్తలపై పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఢిల్లీ విభాగం తాజాగా స్పందించింది. మే 19వ తేదీన ఉదయం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని కుండబద్దలు కొట్టింది.
దేవాలయాల గోల్డ్ మానిటైజేషన్ మరియు గోల్డ్ బాండ్ల జారీ వార్తల్లో వాస్తవమెంత?
దేశంలోని వివిధ దేవాలయాల ట్రస్టులు, ఇతర మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారు నిల్వలను నగదీకరించే (మానిటైజేషన్) ఉద్దేశం ప్రభుత్వానికి ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఆలయాల బంగారాన్ని తీసుకుని ఆయా సంస్థలకు గోల్డ్ బాండ్లను ఇస్తారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ఏమాత్రం విశ్వసించవద్దని కోరింది. అసలు అలాంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని, దానికి సంబంధించిన ఎటువంటి నిర్ణయానికి ఆమోదముద్ర పడలేదని అధికారికంగా తేల్చిచెప్పింది. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలను సృష్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.
స్ట్రాటజిక్ గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా కిందకు ఆలయాల బంగారం?
గోల్డ్ బాండ్ల విషయంతో పాటుగా మరో తప్పుడు ప్రచారం కూడా విపరీతంగా జనాల్లోకి చొచ్చుకువెళ్లింది. ప్రముఖ దేవాలయాల గోపురాలు, తలుపులు, ఇతర ప్రధాన కట్టడాలపై అమర్చిన బంగారు రేకులను సైతం కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోనుందని వార్తలు పుట్టుకొచ్చాయి. వీటిని 'స్ట్రాటజిక్ గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా' (భారత వ్యూహాత్మక బంగారు నిల్వలు) కింద పరిగణిస్తారని జరిగిన ప్రచారంపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ వాదనలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఇలాంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఏ ఆలయ సంపదనూ ప్రభుత్వం ఈ విధంగా పరిగణించబోదని స్పష్టమైన ప్రకటన చేసింది.
వదంతులు నమ్మకండి.. అధికారిక సమాచారాన్నే పరిగణించండి
ఇలాంటి సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన గందరగోళం, ఆందోళన నెలకొనే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. పౌరులెవరూ కూడా ఇటువంటి వదంతులను నమ్మవద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయడం గానీ, ప్రచారం చేయడం గానీ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, కొత్త పథకాల అమలుకు సంబంధించిన సమాచారం ఏదైనా సరే.. దానిని కేవలం పత్రికా ప్రకటనలు, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, ధృవీకరించబడిన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేసింది. కాబట్టి, ఎలాంటి వార్తనైనా గుడ్డిగా నమ్మేముందు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ప్రభుత్వం దేశ పౌరులందరికీ సూచించింది.
Keywords:Temple Gold Monetisation, Indian Government Temple Gold, PIB Fact Check Temple Gold, Gold Bonds to Temples, Strategic Gold Reserves of India, Fake News Temple Gold, Hindu Temples Gold.




