దేశవ్యాప్తంగా భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలు ఆధారపడటం, ఈ రెండింటి కలయికతో సిసిటివి కెమెరాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయి. ఒకప్పుడు కేవలం బ్యాంకులు, కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాలకే పరిమితమైన ఈ పరికరాలు, ఇప్పుడు సాధారణ కుటుంబాల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అయితే భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ఈ వ్యవస్థలే, అనుకోకుండా వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పుగా మారుతున్నాయన్న అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లలో సిసిటివి కెమెరాల ధరలు గణనీయంగా తగ్గడంతో, సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. కానీ ఈ చౌక ధరల వెనుక ఉన్న అసలు కథను పరిశీలిస్తే, అనేక ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయి. మార్కెట్లో లభిస్తున్న కెమెరాలలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న హార్డ్‌వేర్ ఆధారంగా తయారవుతున్నాయి. దేశీయ బ్రాండ్ల పేరు వాటిపై ముద్రించి ఉన్నప్పటికీ వాటి సాఫ్ట్‌వేర్, సర్వర్లు, డేటా ప్రాసెసింగ్ కంట్రోల్ ఇతర చేస్తుల్లోకి వేలుతుండానే విమర్స్యలు ఇపుడు ఆందోళన కలిగిస్తున్నాయి. సి సి కెమెరా అమర్చి యాప్ దోవ్న్లౌద్ చేసుకున్న తరువాత వాటి పర్యవేక్షణ, నిర్వహనకు సంభందించిన అనుమతులను అంగీకరిస్తూ వినియోగదారులు సమ్మతి ఇవ్వటం ఒక ప్రధాన ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు.

సిసిటివి కెమెరా ఒక పరికరం మాత్రమే కాదని అది నిరంతరం డేటాను సేకరించే యంత్రంగా మారిందని చెబుతున్నారు. ఈ డేటా ఎక్కడ నిల్వ అవుతోంది? ఎవరు యాక్సెస్ చేస్తున్నారు? అనే ప్రశ్నలకు చాలా సందర్భాల్లో స్పష్టమైన సమాధానం ఉండదు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నదేమిటంటే, కొన్ని కెమెరాలు రికార్డ్ చేసిన వీడియోలను బాహ్య సర్వర్లకు పంపే అవకాశం ఉంది. ఇది కేవలం గోప్యత సమస్య మాత్రమే కాదు, దేశ భద్రతకూ సంబంధించిన అంశంగా మారే అవకాశముంది.

డిఫాల్ట్ సెట్టింగ్స్: జాతీయ భద్రతకు పెద్ద ప్రమాదం

ఇళ్లలో సిసిటివి అమర్చే సమయంలో ఎక్కువ మంది డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చకపోవడం చాలా ప్రమాదకరం. ఇన్‌స్టాలేషన్ సమయంలో ఇచ్చిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సంవత్సరాల తరబడి అలాగే వాడటం సాధారణంగా కనిపిస్తోంది. ఇది హ్యాకర్లకు తలుపులు తెరవడమే కాకుండా, ఇన్‌స్టాలేషన్ చేసిన టెక్నీషియన్ లేదా అతని పరిచయ వర్గానికి కూడా అనధికార ప్రవేశానికి అవకాశం కల్పిస్తుంది. కెమెరా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు విడుదల చేసే సెక్యూరిటీ అప్‌డేట్‌లు అనేవి హ్యాకింగ్ ప్రమాదాలను తగ్గించేందుకు కీలకమైనవి. కానీ చాలా మంది వినియోగదారులు వాటిని పట్టించుకోకపోవడం వల్ల, పాత లోపాలు అలాగే కొనసాగుతాయి. ఇది సిస్టమ్‌ను మరింత అసురక్షితంగా మారుస్తుంది.

ఇంట్లోని ప్రతి మూలను కవర్ చేయాలనే ఉద్దేశంతో, కొందరు బెడ్రూమ్‌లు, వ్యక్తిగత ప్రదేశాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గోప్యతకు అత్యంత పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో వ్యక్తిగత వీడియోలు లీక్ అవడం, బ్లాక్‌మెయిల్ కేసులు పెరగడం ఈ సమస్య తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఇటీవల పబ్లిక్ సిసిటివి వ్యవస్థలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కీలక ప్రదేశాల్లోని కెమెరా ఫుటేజ్ విదేశీ ఏజెన్సీలకు చేరిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనితో ప్రభుత్వం సిసిటివి కొనుగోళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడం ప్రారంభించింది. అయినప్పటికీ, ఇప్పటికే అమర్చిన కోట్లాది కెమెరాల భద్రత ఎలా అనే ప్రశ్నకు సమగ్ర సమాధానం ఇంకా లభించలేదు.

సురక్షిత వినియోగానికి సూచనలు

భద్రత కోసం ఏర్పాటు చేసిన సిసిటివి వ్యవస్థ, ముప్పుగా మారకుండా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ చేసిన వెంటనే పాస్‌వర్డ్ మార్చాలి. బలమైన పాస్‌వర్డ్ అంటే అక్షరాలు, అంకెలు, ప్రత్యేక గుర్తులు ఉపయోగించాలి. కెమెరా యాప్ యాక్సెస్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఫర్మ్‌వేర్, యాప్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయడం, వేరే నెట్‌వర్క్‌లో కెమెరా రన్ చేయడం, అవసరం లేని రిమోట్ యాక్సెస్‌ను ఆపివేయదం వంటి జాగ్రత్తలు పాటించాలి.

నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లు సాంకేతిక పరిజ్ఞానం సైతం రెండువైపులా పదును ఉన్న ఒక ద్విముఖ ఖడ్గం. ఒక సిసిటివి కెమెరా మీ ఇంటిని రక్షించే కవచంగా మారగలదు, అదే సమయంలో మీ గోప్యతను ఛేదించే ఆయుధంగా కూడా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల అవగాహన అత్యంత కీలకం. భద్రత కోసం తీసుకున్న చర్యలు, నిర్లక్ష్యంతో ప్రమాదానికి దారి తీస్తే., అది సాంకేతికత వైఫల్యం కాదు, మన అప్రమత్తత లోపమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

భద్రత అంటే కేవలం పరికరాలు కాదు, సరైన వినియోగమే అసలైన రక్షణ.