భారతీయ చట్టాల పరిధిలో దశాబ్దాలుగా వేధిస్తున్న 'క్రిమినల్' ముద్రకు ఇక కాలం చెల్లనుంది. చిన్నపాటి పొరపాట్లు, సాంకేతిక లోపాలను నేరాలుగా పరిగణించే పాతకాలపు పద్ధతులకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026" ను తీసుకువచ్చింది. కేవలం వ్యాపారవేత్తలకే కాకుండా, సామాన్య పౌరుల దైనందిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి.

"శిక్ష కంటే ముందే హెచ్చరిక" అనే వినూత్న సూత్రంతో ఈ బిల్లు పనిచేయనుంది. గతంలో చిన్నపాటి ఫారమ్ నింపడంలో తప్పు దొర్లినా లేదా గడువులోగా పత్రాలు సమర్పించకపోయినా జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. ఆ పాత నియంత్రణ వ్యవస్థల స్థానంలో, ఇప్పుడు నమ్మకం ఆధారిత పాలన రాబోతోంది. ఈ బిల్లు ద్వారా 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 చట్టాలను సవరిస్తూ, ఏకంగా 784 నిబంధనలలో మార్పులు చేశారు.

ఈ చట్టం ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిసారి చేసే చిన్న తప్పులకు నేరుగా జరిమానా వేయకుండా 'అడ్వైజరీ' లేదా హెచ్చరికలు జారీ చేస్తారు. హేతుబద్ధమైన జరిమానాలు ఉంటాయి. తప్పు తీవ్రతను బట్టి మాత్రమే పెనాల్టీలు ఉంటాయి. త్వరితగతిన పరిష్కారం దొరుకుతుంది. కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రత్యేక అధికారులు, అప్పిలేట్ అథారిటీల ద్వారా వివాదాలను పరిష్కరిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జరిమానాలను కాలానుగుణంగా సమీక్షిస్తారు.

సామాన్యుడికి ఒనగూరే ప్రయోజనాలు

ఈ బిల్లు కేవలం కార్పొరేట్ సంస్థలకే కాదు, సామాన్య ప్రజల 'జీవన సౌలభ్యం' పై భారీ ప్రభావం చూపనుంది.

  • రైల్వే ప్రయాణికులకు ఊరట: గతంలో రైలు బెర్త్ ఖాళీ చేయకపోతే క్రిమినల్ కేసులు ఉండేవి. ఇప్పుడు అది కేవలం వెయ్యి రూపాయల వరకు సివిల్ జరిమానాకే పరిమితం.

  • మెట్రోలో పొగతాగడం: కలకత్తా మెట్రో వంటి చోట్ల పొగతాగితే ఇకపై క్రిమినల్ కేసులు ఉండవు, 2 వేలు సివిల్ పెనాల్టీతో సరిపెడతారు.

  • డ్రైవింగ్ లైసెన్స్ గడువు: లైసెన్స్ గడువు ముగిసినా 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. తక్షణ జరిమానాల భయం ఉండదు.

  • రాత్రి పూట సంచారం: సూర్యాస్తమయం తర్వాత బయట కనిపిస్తే కారణం చెప్పాలనే బ్రిటిష్ కాలపు ఢిల్లీ పోలీస్ చట్టం (Section 102c) రద్దు చేశారు. ఇకపై రాత్రి పూట తిరగడం నేరం కాదు.

  • ప్రమాద బాధితులకు సమయం: రోడ్డు ప్రమాద బాధితులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో 12 నెలల వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

వ్యాపార రంగానికి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'

ఏం ఎస్ ఏం ఈ లు మరియు ఎగుమతిదారులపై భారాన్ని తగ్గించేలా బిల్లులో కీలక మార్పులు ఉన్నాయి.

  • కాపీరైట్ చట్టం: రిజిస్టర్‌లో చిన్న తప్పులు దొర్లితే గతంలో ఏడాది జైలు శిక్ష ఉండేది, దాన్ని ఇప్పుడు పూర్తిగా తొలగించారు.

  • టీ మరియు పట్టు పరిశ్రమ: తప్పుడు వివరాలు సమర్పించినా మొదటిసారి హెచ్చరిక మాత్రమే ఉంటుంది. పదే పదే తప్పులు చేస్తేనే భారీ జరిమానాలు విధిస్తారు.

  • లీగల్ మెట్రాలజీ: రికార్డుల నిర్వహణలో లోపాలుంటే వెంటనే శిక్షించకుండా 'ఇంప్రూవ్‌మెంట్ నోటీసు' ఇచ్చి సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు.

ఈ ప్రక్రియ 2023లో మొదలైంది. అప్పట్లో 42 చట్టాలను సవరించగా , 2025లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 49 సమావేశాల తర్వాత కమిటీ ఇచ్చిన సూచనలతో ఈ బిల్లును మరింత సమగ్రంగా, 1,000కి పైగా నేరాలను డీక్రిమినలైజ్ చేస్తూ తీర్చిదిద్దారు.

"అపరాధి"గా చూసే విధానం నుండి "భాగస్వామి"గా చూసే దిశగా భారత చట్ట వ్యవస్థ మారుతోంది. జన విశ్వాస్ బిల్లు 2026 ద్వారా ప్రభుత్వం పౌరుల మీద, వ్యాపారాల మీద ఉంచిన ఈ 'విశ్వాసం' దేశ ఆర్థికాభివృద్ధికి, సామాజిక స్వేచ్ఛకు కొత్త బాటలు వేయడం ఖాయం.

..పి ఐ బి