కడప , ఏప్రియల్ 11 : ప్రేమ పేరుతో పిచ్చి ముదిరిన ఓ ఉన్మాది, నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఉదంతం వైఎస్సార్ కడప జిల్లాలో కలకలం రేపింది. ఖాజీపేట మండలం అగ్రహారంలో జరిగిన ఈ దారుణ హత్య కేవలం ఒక కుటుంబానికే కాదు, యావత్ జిల్లాకే తీరని వేదన మిగిల్చింది. ప్రేయసి నిరాకరణను జీర్ణించుకోలేని ఓ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతుకోసి చంపడం నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతురాలు రామకీర్తన (17) స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు పూర్తి చేసి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉంది. అయితే, అదే మండలానికి చెందిన అంజయ కోటాల గ్రామానికి చెందిన వెంకటేష్ (19) గత కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తన ప్రేమను అంగీకరించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వెంకటేష్ కత్తితో రామకీర్తనపై దాడికి తెగబడ్డాడు.

వెంకటేష్ పదేపదే ఫోన్ చేసినా స్పందించలేదన్న కోపంతో, నేరుగా ఆమె ఇంటికే వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ఖచ్చితంగా నిరాకరించడంతో ఆవేశానికి లోనైన నిందితుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.

ఈ దారుణ వార్త తెలియగానే ఖాజీపేట మండలం అట్టుడికిపోయింది. నిందితుడు వెంకటేష్‌ను తమకు అప్పగించాలని, అతడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బాజీపేట కూడలి వద్ద బైఠాయించడంతో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది. "మా బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని ఎన్కౌంటర్ చేస్తారా? లేక మాకు అప్పగిస్తారా?" అంటూ పోలీసులను నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ బాలస్వామిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, ఆందోళనను విరమింపజేశారు.

పోలీసుల కాల్పులు: సినిమా ఫక్కీలో తప్పించుకునే యత్నం

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ నిమిత్తం మైదుకూరు నుంచి మరో రహస్య ప్రాంతానికి తరలిస్తుండగా శనివారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రాధమిక సమాచారం మేరకు కాలకృత్యాల కోసం వాహనాన్ని ఆపిన సమయంలో, నిందితుడు వెంకటేష్ ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులను నెట్టేసి పారిపోతున్న తరుణంలో, ఆత్మరక్షణ కోసం, పారిపోతున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. వెంటనే అతడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి భారీ భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారు. నిందితుడి దాడిలో గాయపడిన ఇద్దరు పోలీసులకు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ త్వరలోనే గాయపడిన పోలీసులను పరామర్శించనున్నారు.

పునరావృతమవుతున్న దారుణాలు

గతంలో తాడిపత్రిలో జరిగిన చిన్నారి హత్య కేసులో కూడా నిందితుడు ఇదే తరహాలో పోలీసులపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేయడం, పోలీసులు కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. వరుసగా జరుగుతున్న ఇటువంటి ప్రేమోన్మాద దాడులు చర్చనియామ్సంగా మారాయి . తాజా ఘటనలో రామకీర్తన మృతదేహం ప్రస్తుతం రిమ్స్ మార్చురీలో ఉంది, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

ఈ ఘటనతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఒక యువతి ప్రాణం పోవడం ఆ కుటుంబానికి ఎన్నటికీ పూడ్చలేని లోటు. సామాజిక మాధ్యమాల్లో సైతం "జస్టిస్ ఫర్ రామకీర్తన" అంటూ నెటిజన్లు గళమెత్తుతున్నారు. ఇటువంటి ఉన్మాదులకు తక్షణమే చట్ట ప్రకారం శిక్షలు పడితేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు కోరుతున్నారు.