హైదరాబాద్, ఏప్రియల్ 12 :

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఏడు దశాబ్దాలకు పైగా తన గళంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గాన కోకిల, పద్మ విభూషణ్ ఆశా భోంస్లే కన్నుమూసారు.శనివారం ఆమెకు హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ యూనిట్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకానికి చేరుకున్నారు. ఆశా భోస్లే అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. సంగీత సామ్రాజ్యంలో ఒక ధ్రువతారగా వెలిగిన ఆమె మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రావ్యమైన మెలోడీలైనా, హుషారైన క్లబ్ సాంగ్స్ అయినా, భక్తి భావంతో నిండిన భజనలైనా.. ఆమె గొంతులో పలికితే అది ఒక మధుర కావ్యం. నేపథ్య గాయనిగా గిన్నిస్ బుక్ రికార్డులను తిరగరాసిన ఆశా ప్రస్థానం భారతీయ కళా సాంస్కృతిక వారసత్వంలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది.

మహారాష్ట్రలోని సాంగ్లీలో 1933 సెప్టెంబరు 8న ఒక విశిష్ట సంగీత కుటుంబంలో ఆశా భోంస్లే జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ గొప్ప శాస్త్రీయ గాయకుడు కావడం ఆమెకు పుట్టుకతోనే సంగీత ఓనమాలు నేర్పింది. అయితే తొమ్మిదేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆశా జీవితం మలుపు తిరిగింది. కుటుంబ భారాన్ని మోసే క్రమంలో తన సోదరి లతా మంగేష్కర్‌తో కలిసి సినిమాల్లో పాడటం ప్రారంభించారు. 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బాల్' ద్వారా ప్రారంభమైన ఆమె ప్రయాణం, 1948లో 'చునారియా'తో హిందీ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ కాలంలో అగ్ర గాయనిల ప్రాభవం ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుని 1950ల నాటికి తిరుగులేని గాయనిగా ఎదిగారు.

వైవిధ్యమే ఆమె ప్రాణం

ఆశా భోంస్లే గాత్రం ఒక అద్భుత రసగుళిక. ఆమె కేవలం ఒకే విధమైన పాటలకు పరిమితం కాలేదు. పాప్, గజల్స్, జానపద గీతాలు, ఖవ్వాలీలు ఇలా ప్రతి ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఓ.పి. నయ్యర్, ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల కంపోజిషన్లలో ఆమె పాడిన పాటలు నేటికీ ఆల్ టైమ్ హిట్స్. ‘ఉమ్రావ్ జాన్’ చిత్రంలో ఆమె ఆలపించిన గజల్స్ వింటుంటే ఆమెలోని శాస్త్రీయ సంగీత పరిణతి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పాశ్చాత్య పోకడలు ఉన్న పాటలను కూడా భారతీయత ఉట్టిపడేలా పాడటంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకే ఆమెను బహుముఖ ప్రజ్ఞాశాలి అని సంగీత ప్రపంచం కీర్తిస్తుంది.

నాయకుల అక్షర నివాళి

ఆశా భోంస్లే మరణవార్త తెలియగానే దేశంలోని రాజకీయ, కళా రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన సంతాపం తెలుపుతూ, భారతదేశం చూసిన అత్యంత ఐకానిక్ మరియు బహుముఖ గాత్రాలలో ఆశా ఒకరని కొనియాడారు. దశాబ్దాల పాటు ఆమె చేసిన సంగీత యానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ఆమెతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆమె గొంతులోని శాశ్వతమైన తేజస్సు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తన సందేశంలో ఆశా గారి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గజల్స్ నుంచి భజనల వరకు ఆమె ప్రదర్శించిన ప్రతిభ సాటిలేనిదని గుర్తు చేసుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే వంటి అవార్డులు ఆమె ప్రతిభకు నిదర్శనాలని, భారతీయ కళా ప్రపంచాన్ని సుసంపన్నం చేయడంలో ఆమె అసమాన పాత్ర పోషించారని శ్లాఘించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశా భోంస్లే మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా సంగీత పరిశ్రమకు ఆమె అందించిన సేవలు వెలకట్టలేనివని, అత్యధిక పాటలు రికార్డు చేసిన కళాకారిణిగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సంతాపాన్ని తెలియజేస్తూ, భారతీయ సంగీత రంగానికి ఆమె మరణం తీరని లోటని పేర్కొన్నారు. పలు భాషల్లో ఆమె ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర

ఆశా భోంస్లే కేవలం గాయని మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం. తన సోదరి లతా మంగేష్కర్‌తో ఉన్న ఆరోగ్యకరమైన పోటీని గౌరవిస్తూనే తనదైన ప్రత్యేక శైలిని కాపాడుకోవడం ఆమెకే సాధ్యమైంది. దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఆమెకు 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలు లభించాయి. ఆమె మరణం ఒక శకానికి ముగింపు పలికినా, ఆమె గళం నుంచి జాలువారిన మధుర గీతాలు కోట్లాది మంది హృదయాలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆ స్వర మాధుర్యం ఎన్నటికీ వాడిపోదు.