భారతీయ సంగీత శిఖరం ఆశా భోంస్లేకు హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. ప్రస్తుతం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆమెకు అత్యవసర చికిత్స అందుతోంది. డాక్టర్ ప్రతీత్ సమ్దాని బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ..
హైదరాబాద్ , ఏప్రియల్ 11 : భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, లెజెండరీ గాయని ఆశా భోంస్లే అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ సంభవించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఎమర్జెన్సీ మెడికల్ యూనిట్‌లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది దశాబ్దాల పాటల ప్రయాణంలో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆశా త్వరగా కోలుకోవాలని సినీ లోకం, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ఆశా భోంస్లే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రతీత్ సమ్దాని నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ఆశా భోంస్లే ఆసుపత్రిలో చేరిన విషయాన్ని డాక్టర్ సమ్దాని ధృవీకరించినప్పటికీ, ఆమె ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. "ఆమె అడ్మిట్ అయ్యారన్న మాట వాస్తవం, చికిత్స కొనసాగుతోంది.. అంతకు మించి సమాచారం ఇప్పుడు ఇవ్వలేం" అని ఆయన స్థానిక మీడియా వర్గాల ఎదుట పేర్కొన్నారు. అదేసమయంలో , ఆమె కుటుంబ సభ్యుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
ఏడు దశాబ్దాల అప్రతిహత గాన యానం
భారతీయ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే ఒక అజరామరమైన పేరు. 1943లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. శాస్త్రీయ సంగీతంలో ఎంతటి పట్టు ఉందో, వెస్ట్రన్ బీట్స్ ఉన్న 'క్యాబరే' సాంగ్స్ పాడటంలోనూ ఆమెకు సాటి మరెవరూ లేరు. ముఖ్యంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి. బర్మన్‌తో ఆమె కాంబినేషన్ భారతీయ సినిమాకు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించింది. 'దమ్ మారో దమ్', 'చురా లియా హై తుమ్నే జో దిల్ కో' వంటి పాటలు నేటి తరాన్ని కూడా ఊర్రూతలూగిస్తూనే ఉన్నాయి. తన గాత్రంలో వైవిధ్యం కోసం ఆమె నిరంతరం పరితపించేవారని, అంతర్జాతీయ గాయని కార్మెన్ మిరాండా వంటి వారి శైలిని స్ఫూర్తిగా తీసుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించుకున్నారని ఆమె గతంలో పేర్కొన్నారు.
పురస్కారాల 'ఆశా' జ్యోతి
సంగీత రంగంలో ఆమె చేసిన అద్భుత కృషికి గాను భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డుతో గౌరవించింది. రెండు జాతీయ అవార్డులతో పాటు, 1997లో గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ గాయనిగా ఆమె రికార్డు సృష్టించారు. కేవలం గాయనిగానే కాకుండా, 2013లో 'మాయి' అనే సినిమా ద్వారా నటిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను గుర్తుచేసే ఆ చిత్రంలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఆశా భోంస్లే చికిత్స పొందుతున్న వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, గాయకులు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వద్ద భారీగా మీడియా ప్రతినిధులు, అభిమానులు చేరుకోవడంతో పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రి వర్గాల నుండి తదుపరి హెల్త్ బులిటెన్ వెలువడాల్సి ఉంది.