భారత్‌లో పలు ఉగ్రదాడులకు మాస్టర్‌మైండ్, లష్కరే-తొయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాపై లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్థాన్‌లో వరుసగా జరుగుతున్న ఈ 'అజ్ఞాత' దాడుల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలు ఈ ప్రత్యేక కథనంలో...
ఇస్లామాబాద్, ఏప్రియల్ 17: పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద ముఠా నాయకులకు కాలం చెల్లుతోందా? వరుసగా జరుగుతున్న దాడులు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. భారత్‌లో జరిగిన పలు విధ్వంసకర దాడుల వెనుక సూత్రధారి, లష్కరే-తొయిబా వ్యవస్థాపక సభ్యుడు అమీర్ హంజాపై లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. లాహోర్‌లోని పెకో రోడ్‌లో జరిగిన ఈ దాడిలో హంజా తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో పెరుగుతున్న అంతర్గత అస్థిరతను, ఉగ్రవాద నాయకుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును మరోసారి బహిర్గతం చేసింది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, 66 ఏళ్ల అమీర్ హంజా ఒక ప్రైవేట్ వార్తా ఛానల్ కార్యాలయం సమీపంలో తన కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తుతెలియని సాయుధులు మోటారు సైకిల్‌పై వచ్చి, హంజా ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని తూటాల వర్షం కురిపించారు. ముఖ్యంగా '24 న్యూస్ హెచ్‌డి' టీవీ ఛానల్‌కు చెందిన వాహనంలో హంజా ప్రయాణిస్తుండటం గమనార్హం. ఈ దాడిలో అతనికి పలు బుల్లెట్లు తగిలాయి. అదృష్టవశాత్తూ అదే వాహనంలో ఉన్న మతపరమైన కార్యక్రమాల నిర్వాహకుడు, రిటైర్డ్ జస్టిస్ నజీర్ అహ్మద్ గాజీ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు. రక్తం మడుగులో ఉన్న హంజాను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాద ముఠా లష్కరే-తొయిబాలో హఫీజ్ సయీద్ తర్వాత అమీర్ హంజాను రెండో అత్యంత కీలకమైన నాయకుడిగా పరిగణిస్తారు. 1980వ దశకంలో హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కర్ పునాదులు వేసిన వారిలో హంజా ప్రథముడు. 1959లో గుజ్రాన్‌వాలాలో జన్మించిన ఇతను, అఫ్గాన్ జిహాద్ కాలం నుండి క్రియాశీలకంగా ఉన్నాడు. కేవలం తుపాకీ పట్టిన ఉగ్రవాదిగానే కాకుండా, తన రచనల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో హంజా సిద్ధహస్తుడు. అమెరికా ట్రెజరీ విభాగం ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, ఆర్థిక ఆంక్షలు విధించింది. సంస్థకు నిధులు సేకరించడం, కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టడం, విదేశీ ఏజెన్సీలతో డీల్స్ కుదుర్చుకోవడంలో హంజా పాత్ర అత్యంత కీలకం.
భారత భద్రతా దళాలకు అమీర్ హంజా పేరు సుపరిచితం. 2005లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' (IISc)పై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రధాన కుట్రదారులలో ఇతను ఒకడు. కాశ్మీర్ వెలుపల లష్కరే-తొయిబా జరిపిన మొదటి పెను వినాశనం ఇదే కావడం గమనార్హం. భారత్‌లో ఉగ్రవాద మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేయడంలోనూ, సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహించడంలోనూ హంజా కీలక పాత్ర పోషించాడు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఇతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వచ్చింది.
హంజాను హతమార్చడానికి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా ఏడాది క్రితం, మే 2023లో లాహోర్‌లోని అతని నివాసం వెలుపల కూడా ఇలాగే కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అతను ప్రాణాలతో బయటపడటంతో పాకిస్థాన్ ప్రభుత్వం అతనికి భద్రతను కూడా కల్పించింది. అయితే, తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్యే దుండగులుఈ దాడి చేయడం కలకలం రేపుతుంది. 2018లో జమాత్-ఉద్-దావాలో జరిగిన నిధుల అవకతవకల తర్వాత హంజా కొంతకాలం క్రియాశీలక ఉగ్రవాదానికి దూరంగా ఉన్నాడని ప్రచారం జరిగినప్పటికీ, లోలోపల అతను వ్యవస్థను నడిపిస్తూనే ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
'గుర్తుతెలియని వ్యక్తుల' భయం
పాకిస్థాన్‌లో గత ఏడు నెలలుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు వరుసగా హతమవుతున్నారు. 2024లోనే ఇప్పటివరకు దాదాపు ఏడుగురు అగ్రశ్రేణి ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్, రియాసి బస్సు దాడి మాస్టర్‌మైండ్ జియావుర్ రెహ్మాన్ వంటి వారు కూడా ఇదే తరహాలో హతమయ్యారు. ఈ క్రమంలోనే అమీర్ హంజాపై జరిగిన దాడి ఉగ్రవాద శిబిరాల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రభుత్వం తమకు రక్షణ కల్పించడంలో విఫలమవుతోందని హఫీజ్ సయీద్‌కు చెందిన 'పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్' (పి ఏం ఏం ఎల్) ఆరోపిస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుతం లాహోర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉండే ఇలాంటి వ్యక్తులపై పట్టపగలు దాడులు జరుగుతుండటం పాకిస్థాన్ నిఘా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. అమీర్ హంజా పరిస్థితి విషమంగా ఉండటంతో లష్కర్ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఒకవేళ హంజా మరణిస్తే, అది లష్కరే-తొయిబాకు కోలుకోలేని దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు.