"ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం! ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేశారు. ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆప్ నాయకత్వంపై ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు, భద్రత ఉపసంహరణ వెనుక ఉన్న అసలు కారణాలు ఈ కథనంలో చదవండి."
ఢిల్లీ , ఏప్రియల్ 24 : రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం పార్టీని వీడటమే కాకుండా, రాజ్యసభలో ఉన్న మొత్తం 10 మంది ఆప్ ఎంపీలలో ఏడుగురితో కలిసి ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్: బీజేపీ గూటికి రాఘవ్ చద్దా
రాజకీయ వర్గాల్లో ఆప్ భవిష్యత్తు నేతగా గుర్తింపు పొందిన రాఘవ్ చద్దా, గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో విభేదిస్తున్నారు. ఈ క్రమంలోనే "సైద్ధాంతిక విభేదాల" కారణంగా తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆప్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన, పార్టీ తన ప్రాథమిక లక్ష్యాల నుండి పక్కకు తొలిగిందని ఆరోపించారు. రాజ్యసభలో ఆప్ ఉప పక్ష నేత పదవి నుంచి చద్దాను తొలగించిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఒకేసారి ఏడుగురు ఎంపీలు పార్టీ మారుతుండటంతో రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా పడిపోనుంది.
సమాజంలో మార్పు తీసుకురావాలనే పవిత్ర ఆశయంతో, సామాన్యుడి గొంతుకగా నిలవాలని తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానని, కానీ ప్రస్తుతం ఆ పార్టీ తన రాజకీయ గమ్యాన్ని విస్మరించిందని రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. "ఆప్ లో ఇప్పుడు ఎటువంటి సిద్ధాంత నిబద్ధత మిగలలేదు. కనీస విలువలు లేని పార్టీలో కొనసాగడం నా వల్ల కాదు" అని ఆయన కరాఖండిగా చెప్పారు. తాను ఒక 'తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని' అని తన శ్రేయోభిలాషులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారని, అందుకే దేశ హితం కోరి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.
భద్రత ఉపసంహరణే సంకేతమా? తెర వెనుక ఏం జరిగింది?
గత కొద్ది రోజులుగా రాఘవ్ చద్దా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ బీజేపీ నేతలకు దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిన Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆప్ అధిష్టానానికి, చద్దాకు మధ్య దూరం పెరిగిందని స్పష్టమైంది. అయితే, పంజాబ్ సర్కార్ భద్రత తొలగించిన గంట వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు Z కేటగిరీ భద్రతను కల్పించడం చర్చనీయాంశమైంది. పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, దేశాభివృద్ధిని విస్మరించిందని చద్దా విమర్శించారు.
రాఘవ్ చద్దా మరియు మెజారిటీ ఎంపీల నిష్క్రమణ ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఢిల్లీ, పంజాబ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.