దేశవ్యాప్త ఉన్నత విద్యా సంస్థల్లో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమం కోసం అపెక్స్ కమిటీ ఏర్పాటుతో పాటు ఎన్‌ఐటీ కురుక్షేత్రలో పరిపాలనా ప్రక్షాళన చేపట్టింది. పూర్తి వివరాలు ఇక్కడ..
న్యూఢిల్లీ, ఏప్రియల్ 28 : దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా, క్యాంపస్ వాతావరణంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. ముఖ్యంగా ఎన్‌ఐటీ (NIT) కురుక్షేత్ర, ఐఐఈఎస్‌టీ (IIEST) షిబ్‌పూర్ సంస్థల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర విద్యాశాఖ మంత్రి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‌ఐటీ కురుక్షేత్ర బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (BoG) ఛైర్మన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో.. క్యాంపస్ పాలన, విద్యార్థుల మానసిక ఉల్లాసం, మౌలిక సదుపాయాల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దేశవ్యాప్త ఉన్నత విద్యా సంస్థల కోసం అపెక్స్ కమిటీ
కేవలం కురుక్షేత్ర, షిబ్‌పూర్ సంస్థలకే పరిమితం కాకుండా దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పుల కోసం ఒక 'అపెక్స్ కమిటీ'ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వివిధ సంస్థల డైరెక్టర్లు, ప్రముఖ పూర్వ విద్యార్థులు, మేధావులతో కూడిన ఈ కమిటీ.. క్యాంపస్‌లలో విద్యార్థి కేంద్రిత వాతావరణం ఉండేలా పర్యవేక్షిస్తుంది. అకడమిక్ బ్లాక్‌లు, ల్యాబ్‌లు, లైబ్రరీలతో పాటు మెస్ మరియు రిక్రియేషన్ క్లబ్‌లను ప్రాధాన్యత క్రమంలో ఆధునీకరించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారతీయ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా, విద్యార్థి స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సమీక్షా సమావేశం ఉద్ఘాటించింది.
ఎన్‌ఐటీ కురుక్షేత్రలో పరిపాలనాపరమైన ప్రక్షాళన
ఎన్‌ఐటీ కురుక్షేత్రలో గత కొంతకాలంగా తలెత్తుతున్న పరిపాలనాపరమైన లోపాలు, విద్యా ప్రమాణాల క్షీణతను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే మార్చి 29, 2026న ఎన్‌ఐటీఎస్ఈఆర్ (NITSER) చట్టం-2007 ప్రకారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్ఈటీఎఫ్ (NETF) ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే నేతృత్వంలోని ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. మదన్ గోపాల్, ఎంఏఎన్‌ఐటీ (MANIT) భోపాల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.కె. శుక్లా సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సంస్థలోని నియామకాలు, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వ్యవస్థలపై సమగ్ర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 24న విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను పరిశీలించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్‌ఐటీ కురుక్షేత్ర డైరెక్టర్ రాజీనామాను గౌరవనీయ విజిటర్ ఆమోదించగా, అప్పటి ఇన్-ఛార్జ్ రిజిస్ట్రార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థి కేంద్రిత క్యాంపస్ సంస్కృతికి శ్రీకారం
క్యాంపస్‌లలో కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం తక్షణ చర్యల కింద హాస్టళ్ల ఆధునీకరణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా మే-జూన్ 2026 మాసాల్లో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించడం, వారి మానసిక ఆరోగ్యానికి భరోసానివ్వడం వంటి అంశాలపై ఈ శిక్షణ సాగనుంది. జూలై 2026 నాటికి ఈ మార్పులు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించాలని మంత్రి స్పష్టం చేశారు. అకడమిక్ మరియు నాన్-అకడమిక్ అంశాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సరికొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) రూపొందిస్తున్నారు.
క్రీడలు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నవశకం
మధ్యకాలిక చర్యల కింద విద్యా సంస్థల్లో క్రీడా సంస్కృతిని పెంపొందించడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల దృక్పథాన్ని పెంచాలని నిర్ణయించారు. అలాగే, ఆయా సంస్థల పూర్వ విద్యార్థులను (Alumni) క్యాంపస్ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు, నాయకత్వ లక్షణాల పెంపునకు బాటలు వేయనున్నారు. 'కెన్-డూ' (Can-do) సంస్కృతిని అలవరుచుకునేలా నిపుణులైన అల్యూమ్నీతో గెస్ట్ లెక్చర్స్, చర్చా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.