ప్రపంచం ఊపిరి బిగబట్టుకుని ఉంది. నాగరికత పురిటిగడ్డల్లో ఒకటైన ఇరాన్ గడ్డపై మృత్యుఘోష వినిపించబోతోందా? మంగళవారం రాత్రి 12 గంటలు దాటితే ఒక దేశ చరిత్ర భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా జారీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టాయి. "ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది" అంటూ ట్రంప్ చేసిన అరిష్ట ప్రకటన ఇరాన్‌ను మాత్రమే కాదు, మొత్తం అంతర్జాతీయ సమాజాన్ని వణికించేస్తోంది.

ట్రంప్ హెచ్చరిక: ఇది 'డెత్ వారెంట్' వంటిదేనా?

డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో అత్యంత భీకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇరాన్‌లోని ప్రధాన వంతెనలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపించబోతోందని ఆయన స్పష్టం చేశారు. "ఇరాన్‌లో నేడు పవర్ ప్లాంట్ డే మరియు బ్రిడ్జ్ డే. పిచ్చివాళ్లారా.. ఆ జలసంధిని తెరవండి, లేదంటే నరకాన్ని చూస్తారు" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం అనివార్యమని సూచిస్తున్నాయి. 47 ఏళ్ల వైరాగ్యం, అవినీతి, దోపిడీకి ఈ రాత్రితో తెరపడుతుందని, ఇరాన్‌లో సమూలమైన 'ప్రభుత్వ మార్పు' జరగబోతోందని ఆయన ప్రకటించడం విశేషం. కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, దేశ వెన్నెముకగా ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయాలని వైట్ హౌస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మానవ హారాలుగా మారిన జనం.. కళాకారుల సంగీత నిరసన

అమెరికా దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇరాన్ ప్రజలు వీరోచితంగా స్పందిస్తున్నారు. యుద్ధ విమానాల బాంబుల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికి వేలాది మంది యువకులు, విద్యార్థులు, మేధావులు విద్యుత్ కేంద్రాలు, వంతెనల వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ వారు 'మానవ హారాలు'గా ఏర్పడి, దాడులు జరిగితే తాము చావడానికైనా సిద్ధమని ప్రకటించడం అక్కడి ఉద్రిక్త పరిస్థితికి అద్దం పడుతోంది.

ముఖ్యంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు అలీ ఘమ్సారీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. టెహ్రాన్ నగరానికి సగం విద్యుత్తును అందించే దమావంద్ పవర్ ప్లాంట్ వద్ద తన 'తార్' వాయిద్యంతో సంగీతాన్ని సృష్టిస్తూ ఆయన నిరసన తెలుపుతున్నారు. "వినాశనానికి వ్యతిరేకంగా సృజన" అన్నట్లుగా ఆయన చేపట్టిన ఈ వినూత్న పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

అమెరికాలోనే వ్యతిరేక గళం: అగ్రరాజ్య హోదాకు ముప్పు?

ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలోని మాజీ అధికారులు సైతం తప్పుబడుతున్నారు. మాజీ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ హెచ్చరిస్తూ.. "ఇరాన్‌ను నాశనం చేయడం అంటే అమెరికా తన అగ్రరాజ్య హోదాను తానే సమాధి చేసుకోవడమే" అని వ్యాఖ్యానించారు. ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తే, అమెరికా ఇకపై ఒక బాధ్యతాయుతమైన శక్తిగా కాకుండా 'అరాచక శక్తి'గా మారుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రంప్ విధించిన గడువు సమీపిస్తోంది. ఇరాన్ జలసంధి పై నెలకొన్న వివాదం ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లుగా భారీ స్థాయిలో దాడులు జరిగితే, అది కేవలం ఇరాన్ మౌలిక సదుపాయాలనే కాదు, ప్రపంచ చమురు మార్కెట్‌ను కూడా కుప్పకూలుస్తుంది. మానవత్వం మరియు శాంతిని ఆశించే శక్తులు ఇంకా 'విప్లవాత్మక అద్భుతం' ఏదైనా జరిగి యుద్ధం ఆగిపోతుందని ఆశిస్తున్నాయి. ఏది ఏమైనా, ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందో లేక శాంతి వైపు ఒక కొత్త మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

 తాజా పరిణామాలు :

అమెరికాతో చర్చలను నిలిపివేసిన ఇరాన్

ముగ్గురు సీనియర్ ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం.. అమెరికాతో అన్ని రకాల చర్చల ప్రయత్నాలను ఇరాన్ నిలిపివేసింది. తాము ఇకపై కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనబోమని పాకిస్తాన్‌కు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ యుద్ధం పొడవునా వాషింగ్టన్ మరియు టెహ్రాన్ మధ్య పాకిస్తాన్ పరోక్ష మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. కాగా, యుద్ధం గనుక ముదిరితే, తమ పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం తాము సౌదీ అరేబియా పక్షాన నిలబడతామని పాకిస్తాన్ భద్రతా అధికారి ఒకరు ఈ రోజు వెల్లడించారు.

 "రాత్రి 8 గంటల ప్రణాళిక జరిగి తీరుతుంది" - డొనాల్డ్ ట్రంప్

ఫాక్స్ న్యూస్ ప్రతినిధి బ్రెట్ బాయర్ జరిపిన ఫోన్ కాల్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. "రాత్రి 8 గంటల గడువు జరిగి తీరుతుంది" అని స్పష్టం చేశారు. చర్చలు విజయవంతమవుతాయని తానేమీ పందెం కాయడం లేదని, తన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. "మనం ఆ స్థాయికి చేరుకుంటే, వారు ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో దాడి ఉంటుంది" అని ట్రంప్ అన్నట్లు బాయర్ పేర్కొన్నారు. ట్రంప్ విధించిన గడువుకు ఇంకా 8 గంటల సమయం మాత్రమే ఉంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా, రష్యా వీటో

హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) నౌకల రక్షణకు సంబంధించి బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా మరియు రష్యా దేశాలు వీటో చేశాయి. హార్ముజ్ జలసంధి రవాణా మార్గాన్ని పునరుద్ధరించడానికి టేబుల్ మీద ఉన్న ఏకైక అంతర్జాతీయ దౌత్య మార్గం ఇదే. అమెరికాకు చెందిన ఐదవ నౌకా దళానికి (US Fifth Fleet) ఆతిథ్యమిస్తున్న బహ్రెయిన్, యుద్ధం మొదలైనప్పటి నుండి ఈ తీర్మానం కోసం ప్రయత్నిస్తోంది. తాజా పరిణామంతో హార్ముజ్ విషయంలో దౌత్యపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయి.

ఇరాన్‌లోని వంతెనలపై ఇజ్రాయెల్ దాడులు

టెహ్రాన్, కరాజ్, తబ్రిజ్ మరియు కాషన్ ప్రాంతాలలో ఇరాన్ ప్రభుత్వం ఉపయోగిస్తున్న 8 వంతెన భాగాలపై తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి మరియు కాల్పుల విరమణకు ఇరాన్‌ను ఒప్పించడానికి అమెరికా, ఇజ్రాయెల్ తమ దాడులను తీవ్రం చేస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మంగళవారం అర్ధరాత్రి కల్లా ఇరాన్‌లోని ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని సోమవారం ట్రంప్ హెచ్చరించారు. గడువుకు ఇంకా 9 గంటల సమయం ఉండగానే ఇజ్రాయెల్ ఆ హెచ్చరికను అమలు చేయడం ప్రారంభించింది.

భారతీయులకు హై అలర్ట్: రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర 'అడ్వైజరీ' జారీ చేసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ రాబోయే 48 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, గదుల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. సైనిక స్థావరాలు, గ్రిడ్లు, వంతెనలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. రాయబార కార్యాలయం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు భారతీయులతో సమన్వయం చేసుకుంటోంది.

సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లు:

  • +989128109115, +989128109109

  • ఇమెయిల్: cons.tehran@mea.gov.in