న్యూఢిల్లీ, ఏప్రియల్ 14: పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోమారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రధానాంశాలుగా నిలిచాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ ఏడాది ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగిన మూడవ కీలక సంభాషణ ఇది కావడం విశేషం.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడంపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ప్రస్తుతం అక్కడ ఒక రకమైన స్తబ్దత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ సరఫరా చైన్ కు ఇబ్బంది కలగకుండా జలసంధిని అందుబాటులో ఉంచాలని మోదీ, ట్రంప్ కి నొక్కి చెప్పారు. శాంతి పునరుద్ధరణకు, ఉద్రిక్తతల తగ్గింపునకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.

బలపడుతున్న 'గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్'

తమ మధ్య సాగిన చర్చల వివరాలను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం 'X' వేదికగా పంచుకున్నారు. "నా స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సాధించిన గణనీయమైన పురోగతిని మేము సమీక్షించాము. మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం" అని మోదీ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కుదిరిన వాణిజ్య ఒప్పందం నుంచి నేటి వరకు ఇరు దేశాల మధ్య సహకారం కొత్త పుంతలు తొక్కుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చర్చల సందర్భంగా ఇరువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం కూడా ప్రతిబింబించింది. భారత ప్రజలు అధ్యక్షుడు ట్రంప్‌ను ఎంతో ప్రేమిస్తారని మోదీ చెప్పగా, దానికి స్పందనగా ట్రంప్ కూడా "నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను" అని వ్యాఖ్యానించినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు కీలక పరిణామాలపై భారత ప్రధానిని సంప్రదిస్తూనే ఉన్నారని, వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య ఉన్న అపారమైన సాన్నిహిత్యానికి ఇదే నిదర్శనమని గోర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 22తో ముగియనున్న ప్రస్తుత కాల్పుల విరమణ గడువు లోపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతి దిశగా అడుగులు పడాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.