విజయవాడ , ఏప్రియల్ 17 : తండ్రి పించన్ డబ్బులు తల్లి మద్యం తాగటానికి ఇవ్వటం లేదని కర్కశంగా కన్నతల్లిని చంపిన ఘటనలు , భర్త ఆస్తి కోసం ప్రియుడితో కలసి కట్టుకున్నవాడిని కడ తేరుస్తున్న మహిళలు .. ఇలా చెప్పుకుంటూ పొతే రోజూ ఎక్కడో ఒక చోట ఒక నేరం వేలుగుచూస్తూనే ఉంది. ఈ నేరాలకు కారణం డబ్బు అనేది ఫైనల్ గా పోలిసుల దర్య్ప్తులో తేలుతుంది . ఇక రూపాయ్ రూపాయ్ నువ్వు ఏమి చేయగలవంటే బంధాల మద్య , స్నేహాలు – సన్నిహితులు, తోబుట్టువుల మద్య చిచ్చు పెట్టగలను అంటుందట. నిజమే ధనం మూలం గా మారి మనుషులమధ్య సంభంధాలు నీటి తుంపర్లుగా మారిపోయాయి . అయితే సమాజంలో కేవలం డబ్బు కోసం మాత్రమె కాదు మంచికి , మానవత్వానికి సైతం ఇంకా చోటు ఉందని నిరూపించే ఘటన ఆంధ్రప్రదేశ్ లోని యెన్ టి ఆర్ జిల్లా నందిగామలో జరిగింది. అక్కడ ఒక వ్యక్తి లక్ష రూపాయల నగదు దొరికినా, ఆశకు పోకుండా బాధితుడిని వెతికి పట్టుకొని ఆ సొమ్మును అందజేయటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యూక్తమవుతున్నాయి.

రాఘవపురం గ్రామానికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి వృత్తిరీత్యా మేకల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో మేకలను కొనుగోలు చేసే నిమిత్తం తన వద్ద ఉన్న లక్ష రూపాయల నగదును తీసుకుని రుద్రవరం గ్రామానికి వెళ్ళాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా, గొల్లమూడి గ్రామం సమీపంలో అనుకోకుండా తన వద్ద ఉన్న నగదును పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాక కానీ ఆ విషయం గమనించుకోని మురళీకృష్ణ, కష్టపడి సంపాదించిన సొమ్ము పోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా

అదే సమయంలో గొల్లమూడి శివాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న సాయిరాం శర్మకు ఆ నగదు లభించింది. పరుల సొమ్ము పాము వంటిదని భావించిన ఆయన, ఆ డబ్బును తన వద్దే ఉంచుకోకుండా అసలైన యజమాని కోసం అన్వేషించారు. వెంటనే అప్రమత్తమై సోషల్ మీడియా వేదికగా తనకు నగదు దొరికినట్లు సమాచారాన్ని చేరవేశారు. ఈ పోస్ట్ కాస్తా బాధితుడు మురళీకృష్ణ దృష్టికి వెళ్లడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడు మురళీకృష్ణ వెంటనే అర్చకుడు సాయిరాం శర్మను సంప్రదించారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం, నందిగామ పాత బస్టాండ్ ఆవరణలోని వినాయక స్వామి ఆలయం వద్ద తోటి అర్చకుల సమక్షంలో ఆ లక్ష రూపాయలను మురళీకృష్ణకు సాయిరాం శర్మ అందజేశారు. కష్టకాలంలో తన సొమ్మును తిరిగి అప్పగించిన అర్చకుడికి మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.