మే 3న జరగనున్న NEET UG 2026 పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన నిర్ణయం తీసుకుంది. మే 2, 3 తేదీల్లో మెడికల్ విద్యార్థుల సెలవులపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పూర్తి వివరాలు, విద్యార్థుల నిరసనలపై ప్రత్యేక కథనం.
హైదరాబాద్ , ఏప్రియల్ 30 : నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల జారీ చేసిన తాజా ఉత్తర్వులు వైద్య విద్యా రంగంలో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించనున్న నీట్ యూజీ (NEET-UG 2026) పరీక్షల పారదర్శకతను కాపాడే పేరుతో, మెడికల్ విద్యార్థుల సెలవులపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, పరీక్షల పవిత్రతను కాపాడడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్‌ఎంసీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో మే 3న దేశవ్యాప్తంగా పెన్ మరియు పేపర్ విధానంలో నీట్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో, ఏప్రిల్ 23, 2026న ఎన్‌ఎంసీ సెక్రటరీ డాక్టర్ రాఘవ్ లాంగర్ ఒక పబ్లిక్ నోటీసును జారీ చేశారు. ఈ నోటీసు (No. CDN-14011/1/2026-COORDINATION-NMC) ప్రకారం, మే 2, 3 తేదీలలో మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయకూడదని ప్రిన్సిపాల్స్, డీన్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహా, ఇతర ఏ కారణం చేతనైనా విద్యార్థులు క్యాంపస్ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షా నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ అడుగు వేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక.. గత అనుభవాలే పాఠాలుగా..
ఈ కఠిన నిబంధనల వెనుక కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి రాసిన లేఖ కీలక పాత్ర పోషించింది. ఏప్రిల్ 20, 2026న ఆయన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవకు రాసిన డి.ఓ లేఖలో (DO. No F-24/1/2025-NTA) గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను ప్రస్తావించారు. గత పరీక్షల సమయంలో కొందరు మెడికల్ విద్యార్థులు అక్రమాలకు పాల్పడినట్లు , పరీక్షా ప్రక్రియను ప్రభావితం చేసినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అటువంటి కార్యకలాపాలకు చెక్ పెట్టడానికి, విద్యార్థులను అప్రమత్తం చేయడంతో పాటు వారిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ నొక్కి చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య విద్యా విభాగాల కార్యదర్శులకు కూడా సమాచారం పంపారు.
విద్యార్థి లోకంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం: ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనా?
ఎన్‌ఎంసీ జారీ చేసిన ఈ ఉత్తర్వులు పై వైద్య విద్యార్థులు, విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. కేవలం సెలవులను నిలిపివేయడం వల్ల పేపర్ లీకేజీలు ఆగుతాయా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. పరీక్షల భద్రతను పెంచాల్సింది పోయి, ఇలా విద్యార్థుల స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే ఈ ఉత్తర్వుల పట్ల నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పేరుతో విద్యార్థులను అనుమానించడం వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు . ఏది ఏమైనా, మే మొదటి వారంలో జరగనున్న ఈ పరీక్ష దేశవ్యాప్తంగా అటు అభ్యర్థులలోనూ, ఇటు మెడికల్ విద్యార్థులలోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.