జాతీయ వైద్య కమిషన్ (NMC) ఏప్రిల్ 27, 2026న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వైద్య విద్యారంగంలో కీలక మార్పులు చేపట్టింది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 సీట్లు ఉండాలనే నిబంధనను మరియు సీట్ల పెంపుపై ఉన్న 150 గరిష్ట పరిమితిని ఎన్ఎంసీ రద్దు చేసింది. మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రి మధ్య ఉండాల్సిన దూరంపై కూడా స్పష్టమైన సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య అవకాశాలను ఎలా పెంచుతాయో ఇక్కడ చదవండి.
న్యూ ఢిల్లీ, ఏప్రియల్ 29 : జాతీయ వైద్య కమిషన్ (NMC) దేశవ్యాప్తంగా వైద్య విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపుదలపై గతంలో ఉన్న కఠిన నిబంధనలను సవరిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా వైద్య విద్యను మరింత మందికి చేరువ చేసే దిశగా అడుగులు వేసింది. దీనికి సంబంధించి ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లంగర్ పేరుతో అధికారికంగా ఈ నెల 27 గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది.
జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు నిబంధన రద్దు
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రతి 10 లక్షల జనాభాకు గరిష్టంగా 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలనే పరిమితి ఉండేది. ఈ నిబంధన కారణంగా ఇప్పటికే వైద్య రంగంలో ముందంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఉన్న కాలేజీల్లో సీట్లు పెంచుకోవడానికి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యేవి. అయితే, తాజా సవరణల ప్రకారం ఈ నిబంధనను ఎన్ఎంసీ పూర్తిగా తొలగించింది. ఫలితంగా మౌలిక సదుపాయాలు కలిగిన ఏ ప్రాంతంలోనైనా జనాభాతో సంబంధం లేకుండా మరిన్ని వైద్య సీట్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడింది.
150 సీట్ల గరిష్ట పరిమితికి స్వస్తి
కేవలం జనాభా నిబంధన మాత్రమే కాకుండా, సీట్ల సంఖ్యపై ఉన్న మరో కీలక పరిమితిని కూడా కమిషన్ రద్దు చేసింది. 2024-25 విద్యాసంవత్సరం నుండి సీట్ల సంఖ్యను పెంచుకోవాలనుకునే కళాశాలలకు ఉన్న 150 సీట్ల గరిష్ట పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల నాణ్యమైన బోధన, అవసరమైన మౌలిక వసతులు ఉన్న కళాశాలలు తమ సామర్థ్యాన్ని బట్టి సీట్ల సంఖ్యను మరింతగా పెంచుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం ముఖ్యంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
తెలుగు రాష్ట్రాలకు భారీగా పెరగనున్న వైద్య అవకాశాలు
ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు వరంలా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాత నిబంధనల వల్ల ఇక్కడ కొత్త కాలేజీలకు అనుమతులు రావడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ ఆంక్షలు తొలగిపోవడంతో, ఈ రాష్ట్రాల్లో మరిన్ని కొత్త వైద్య కళాశాలలు రావడంతో పాటు, ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. తద్వారా స్థానిక విద్యార్థులకు సొంత రాష్ట్రాల్లోనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడతాయి.
కళాశాల - ఆస్పత్రి మధ్య దూరంపై స్పష్టత
మెడికల్ కాలేజీలు మరియు వాటికి అనుబంధంగా ఉండే బోధనా ఆస్పత్రుల మధ్య ఉండాల్సిన దూరం విషయంలోనూ ఎన్ఎంసీ కీలక సవరణలు చేసింది. గతంలో కాలేజీకి, ఆస్పత్రికి మధ్య ప్రయాణ సమయం గరిష్టంగా 30 నిమిషాలు ఉండాలనే నిబంధన ఉండేది. అయితే ట్రాఫిక్ సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల సమయాన్ని లెక్కించడం ఇబ్బందిగా మారడంతో, ఇప్పుడు దాన్ని కిలోమీటర్ల రూపంలోకి మార్చింది. ఇకపై కాలేజీ, ఆస్పత్రి మధ్య గరిష్ట దూరం 10 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ ప్రాంతాల్లోని రాష్ట్రాలకు మాత్రం ఈ దూరాన్ని 15 కిలోమీటర్ల వరకు సడలించారు.
జాతీయ వైద్య కమిషన్ తీసుకొచ్చిన ఈ 'యూజీ-ఎంఎస్ఆర్ 2023' సవరణలు దేశవ్యాప్తంగా వైద్య విద్య నాణ్యతను పెంచడంతో పాటు, వైద్య సీట్ల కొరతను అధిగమించడానికి దోహదపడుతాయని నిపుణులు భావిస్తున్నారు.