హైదరాబాద్, ఏప్రిల్ 20:ఉన్నత విద్యను అభ్యసించాలని తపించే విద్యార్థులకు, ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘పి ఏం -విద్యా లక్ష్మి’ పథకం పరిధిని మరింత విస్తరించింది. మెరిట్ ఆధారంగా టాప్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఎటువంటి పూచీకత్తు, గ్యారంటర్ అవసరం లేకుండా విద్యా రుణాలు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా, ఈ పథకం కింద మరిన్ని కాన్‌స్టిట్యుయంట్ కళాశాలలను అర్హత కలిగిన జాబితాలో చేరుస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

అర్హత నిబంధనల్లో స్పష్టత

గత కొంతకాలంగా అనేక కళాశాలలు, మాతృ సంస్థల పరిధిలోని కాన్‌స్టిట్యుయంట్ యూనిట్లను(ఒక ప్రధాన విశ్వవిద్యాలయం కింద పనిచేసే లేదా ఆ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే ప్రత్యేక విభాగాలు, కళాశాలలు) కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖను కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఉన్నత విద్యా విభాగం, ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ – ఏ ఐ ఎస్ హెచ్ ఇ డేటా మరియు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ – యెన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ 2024 ప్రమాణాల ఆధారంగా కీలక నిర్ణయం తీసుకుంది. మాతృ విశ్వవిద్యాలయం (Parent University) ఇప్పటికే అర్హత గల"క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్" జాబితాలో ఉంటే, దాని పరిధిలోని కాన్‌స్టిట్యుయంట్ యూనిట్లు కూడా విద్యా రుణాలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఆయా కళాశాలలు మాతృ విశ్వవిద్యాలయంలో భాగంగా ఏ ఐ ఎస్ హెచ్ ఇ డేటాలో నమోదై ఉండాలని మరియు యెన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్ ప్రక్రియలో వాటి పనితీరును పరిగణనలోకి తీసుకుని ఉండాలని నిబంధన విధించింది.

జాబితాలో చేరిన ప్రముఖ సంస్థలు

ఈ తాజా మార్పులతో దేశవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల అనుబంధ కళాశాలలకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా, డాక్టర్ డి. వై. పాటిల్ డెంటల్ కాలేజీ & హాస్పిటల్ (పూణే), కె. ఎస్. హెగ్డే మెడికల్ అకాడమీ (నిట్టే), యెనెపోయా మెడికల్ కాలేజీ వంటి సంస్థలతో పాటు, సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) పరిధిలోని సుమారు 43 కాన్‌స్టిట్యుయంట్ సంస్థలు ఇప్పుడు ఈ పథకం కిందకు వచ్చాయి. ఇవన్నీ ఇప్పటికే యెన్ ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తమదైన గుర్తింపు పొందిన సంస్థలు కావడం విశేషం.

విద్యార్థులకు ఎలా ప్రయోజనం?

ఈ నిర్ణయంతో, పైన పేర్కొన్న సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా పి ఏం -విద్యా లక్ష్మి పథకం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం సంబంధిత కళాశాలలు, పథకానికి కావాల్సిన ఇతర అర్హత నిబంధనలను పూర్తి చేస్తే సరిపోతుంది. విద్యార్థులు నేరుగా పి ఏం -విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా తమ విద్యా రుణ సదుపాయాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. 2024 నవంబర్ 6న ప్రారంభమైన ఈ పథకం, పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ తాజా చేర్పులతో మరిన్ని వేలమంది విద్యార్థులకు ఉన్నత విద్య తలుపులు తెరుచుకున్నట్లయ్యింది.