న్యూ డిల్లి , ఏప్రియల్ 20 : రాజధాని ప్రాంతాలకు సమీపంలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా రైడ్-హెయిలింగ్ సర్వీసుల వినియోగదారుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాపిడో బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన ఒక యువతికి, గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత సదరు డ్రైవర్ నుంచి ఊహించని రీతిలో వాట్సాప్ సందేశాలు రావడంతో ఆమె నివ్వెరపోయింది. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఆ డ్రైవర్ వ్యవహరించిన తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది?

అనుష్క అనే యువతి తన ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పోస్ట్ చేసింది. "రాపిడో బుక్ చేసుకుంటే ఏమవుతుందిలే?" అని సరదాగా అనుకున్నానంటూ తన వీడియోను ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత జరిగిన చేదు అనుభవాన్ని స్క్రీన్‌షాట్ల రూపంలో బయటపెట్టింది. ఆమెను క్షేమంగా దించిన కొద్దిసేపటికే, సదరు డ్రైవర్ ఆమె నంబర్‌ను సేకరించి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. "గుర్తుపట్టలేదా? ఇప్పుడే కదా నిన్ను డ్రాప్ చేశాను" అంటూ మొదలుపెట్టిన ఆ డ్రైవర్, ఆ తర్వాత ఆమె రూపంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. 'ట్రెడిషనల్ డ్రెస్సులో చాలా బాగున్నావు, చాలా క్యూట్‌గా ఉన్నావు' అని పొగడ్తలతో మొదలుపెట్టి, ఆపై ఆమె వయసు ఎంత? ఒంటరిగా ఉంటున్నావా? రేపు సాయంత్రం నాలుగు గంటలకు కలుద్దామా? అంటూ విసిగించే ప్రశ్నలతో వేధించాడు. ఏమాత్రం సహించని ఆ యువతి, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, ఘటనను ప్రపంచానికి చాటిచెప్పింది.

వినియోగదారుల ఆందోళన.. మౌనం వీడిన రాపిడో

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. ముఖ్యంగా రైడ్-హెయిలింగ్ యాప్స్‌లో ప్రయాణికుల ఫోన్ నంబర్లు డ్రైవర్లకు ఎలా అందుబాటులోకి వస్తున్నాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కేవలం ప్రయాణం కోసం మాత్రమే తీసుకునే వ్యక్తిగత సమాచారం, డ్రైవర్ల చేతిలో పెట్టి ఇలా వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 11.8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో, మహిళల భద్రతకు సంబంధించి యాప్ యాజమాన్యాల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది.

దీనిపై స్పందించిన రాపిడో సంస్థ, తమ డ్రైవర్ (క్యాప్టన్) ప్రవర్తనపై బహిరంగ క్షమాపణలు కోరింది. ఇది తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని, అస్సలు ఆమోదయోగ్యం కాని విషయమని పేర్కొంది. బాధితురాలిని సంప్రదించి, ఆమె రైడ్ వివరాలను సేకరించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాప్స్‌లో ‘ప్రైవసీ నంబర్ మాస్కింగ్’ వంటి పటిష్టమైన భద్రతా చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు మరియు వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.