న్యూ డిల్లీ, ఏప్రియల్ 24 : భారత బ్యాంకింగ్ రంగంలో పెను సంచలనం నమోదైంది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్' (PPBL) లైసెన్స్‌ను రద్దు చేస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు తక్షణం అంటే 24వ తేదీ పని గంటల ముగింపు సమయం నుంచే అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘన, డిపాజిటర్ల ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి తీవ్రమైన కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుకు ప్రధాన కారణాలివే

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949లోని సెక్షన్ 22(4) కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి ఆర్బీఐ ఈ లైసెన్స్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలను ఆర్బీఐ తన నివేదికలో పొందుపరిచింది. బ్యాంకు కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా సాగుతున్నాయని, మేనేజ్‌మెంట్ వ్యవహారశైలి ప్రజా ప్రయోజనాలకు హానికరంగా ఉందని ఆర్బీఐ గుర్తించింది. బిఆర్ చట్టంలోని సెక్షన్ 22(3)(బి), 22(3)(సి), 22(3)(ఇ) మరియు 22(3)(జి) నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని పేర్కొంది. లైసెన్స్ మంజూరు సమయంలో విధించిన షరతులను ఉల్లంఘించడం ద్వారా బ్యాంకు తన విశ్వసనీయతను కోల్పోయిందని ఆర్బీఐ అభిప్రాయపడింది.

డిపాజిటర్ల నగదు భద్రతపై ఆర్బీఐ స్పష్టత

లైసెన్స్ రద్దు నేపథ్యంలో ఖాతాదారులు, డిపాజిటర్ల ప్రయోజనాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, బ్యాంకును మూసివేసే (వైండింగ్ అప్) ప్రక్రియలో భాగంగా డిపాజిటర్ల బాధ్యతలను తీర్చడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వద్ద తగినంత నగదు లభ్యత (Liquidity) ఉందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంకును పూర్తిగా మూసివేసేందుకు సంబంధిత హైకోర్టులో త్వరలోనే దరఖాస్తు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం, సెక్షన్ 5(బి) కింద నిర్వచించిన బ్యాంకింగ్ కార్యకలాపాలను గానీ, సెక్షన్ 6 కింద పేర్కొన్న ఇతర వ్యాపారాలను గానీ నిర్వహించడానికి సదరు సంస్థకు ఇకపై ఎలాంటి అనుమతి ఉండదు.

గత వైఫల్యాలే నేటి నిర్ణయానికి పునాది

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గత కొన్ని ఏళ్లుగా ఆ సంస్థకు పలు హెచ్చరికలు, ఆంక్షలు జారీ చేస్తూనే ఉంది. తొలుత మార్చి 11, 2022న కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. ఆ తర్వాత 2024 జనవరి 31 మరియు ఫిబ్రవరి 16 తేదీల్లో మరిన్ని కఠిన ఆంక్షలను విధించింది. ఇందులో భాగంగా కస్టమర్ అకౌంట్లు, వాలెట్లు, ప్రీపెయిడ్ సాధనాల్లో కొత్తగా డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను నిలిపివేసింది. ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ, బ్యాంకు తన తీరును మార్చుకోకపోవడంతో చివరకు లైసెన్స్ రద్దు చేయడమే సరైన మార్గమని ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చీఫ్ జనరల్ మేనేజర్ బ్రిజ్ రాజ్ పేరుతో అధికారిక ప్రకటన విడుదలైంది.

Rbi Press Release: 2026-2027/143