దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు, స్కూళ్ల పనివేళల్లో మార్పులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
హైదరాబాద్, ఏప్రిల్ 22 :దేశవ్యాప్తంగా వేసవి సెగలు ముందస్తుగానే మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో సామాన్యులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ ఇప్పటికే పాఠశాలల పని వేళల్లో మార్పులు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 24 నుంచి స్కూల్స్ వేసవి సెలవులకు కూడా రంగం సిద్ధమైంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురంలలో ఎండల తీవ్రత తీవ్రరూపం దాల్చింది. కోస్తా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40°C నుండి 44°C మధ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు తెలంగాణలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 42 డిగ్రీలు దాటేశాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఇస్తూ షెడ్యూల్ ఖరారు చేసింది. ప్రస్తుతం ఇక్కడ కూడా మధ్యాహ్నం 12:30 గంటలకే పాఠశాలలు ముగుస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో కఠిన నిర్ణయాలు
మరోవైపు ఉత్తర భారత దేశంలో వడగాల్పుల తీవ్రత మరింత భీభత్సంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ఖజురహోలో గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్వాలియర్, దతియా, శివపురి వంటి ప్రాంతాల్లోనూ 42 డిగ్రీల పైచిలుకు సెగలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా కలెక్టర్ విదిశా ముఖర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్న పిల్లల ఆరోగ్యం దృష్ట్యా నర్సరీ నుండి ఐదో తరగతి వరకు పాఠశాలలకు ఏప్రిల్ 30 వరకు పూర్తిస్థాయిలో సెలవులు ప్రకటించారు. కేవలం ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉదయం పూట తరగతులు నిర్వహించాలని, అది కూడా మధ్యాహ్నం 12:30 కల్లా ముగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ పాఠశాలలన్నింటికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో వాతావరణ నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే తగినంత నీరు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ప్రయాణించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.