మహారాష్ట్రలోని అమరావతిలో సంచలనం సృష్టించిన మహమ్మద్ అయాన్ అలియాస్ తన్వీర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. కోచింగ్ సెంటర్లనే వేదికగా చేసుకుని 180 మంది బాలికలను ప్రేమ పేరుతో వంచించి, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడిన వైనం. రంగంలోకి దిగిన ఎస్.ఐ.టి, నిందితుడి అక్రమ కట్టడాల కూల్చివేత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ముంబాయి , ఏప్రియల్ 15 : అమాయకపు ముఖం.. పక్కా ప్రణాళిక.. ప్రేమ పేరిట వల.. వెరసి వందలాది మంది అబలల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వడ పట్టణానికి చెందిన ఒక యువకుడి వికృత చేష్టలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రేమ పేరుతో దగ్గరై, నమ్మించి గొంతు కోసే నయా మోసగాళ్ల జాబితాలో మహమ్మద్ అయాన్ అలియాస్ తన్వీర్ (19) ఉదంతం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. పైకి చదువుకునే విద్యార్థిలా కనిపించే తన్వీర్, తన వక్రబుద్ధికి కోచింగ్ సెంటర్లను వేదికగా చేసుకున్నాడు. ఆకాష్ కోచింగ్, ఫ్యూచర్ హంట్ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో చేరుతూ, అక్కడ నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులను లక్ష్యంగా చేసుకునేవాడు. వారిని మాటల్లో దించి, స్నేహం నటించి చివరకు ప్రేమ పేరిట వలలో వేసుకునేవాడు. సోషల్ మీడియాలో 'ఫెస్టివల్ గ్రూప్స్' క్రియేట్ చేసి, విలాసవంతమైన పార్టీలకు ఆహ్వానిస్తూ వారిని ప్రలోభపెట్టేవాడు.
అమాయక బాలికలను నమ్మించి ముంబై, పుణె వంటి నగరాలకు తీసుకువెళ్లి, అక్కడ వారికి తెలియకుండానే అశ్లీల వీడియోలు చిత్రీకరించడం ఈ కిరాతకుడి ప్రధాన వృత్తి. దాదాపు 180 మంది బాలికలను ఈ రకంగా వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడి వద్ద సుమారు 350కి పైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు బాలికలను బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి జీవితాలను నరకప్రాయం చేశాడు. ఈ అకృత్యాల్లో అతనికి సహకరించిన ఉజేర్ ఖాన్, మహమ్మద్ సాద్, తర్బేజ్ ఖాన్ అనే మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రంగంలోకి ఎస్.ఐ.టి.. బుల్డోజర్ల గర్జన
ఈ దారుణంపై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అనిల్ బోండే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఏసీపీ శుభమ్ కుమార్ నేతృత్వంలో 46 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, నిందితుడి అక్రమ కట్టడాలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తన్వీర్ నివాసానికి చెందిన అక్రమ నిర్మాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు.
ప్రస్తుతం తన్వీర్ పోలీసు కస్టడీలో ఉన్నాడు. నిందితుడి మొబైల్ ఫోన్ల నుంచి లభ్యమైన డేటా చూసి అధికారులే విస్తుపోతున్నారు. సైబర్ సెల్ సాయంతో ఆ వీడియోలను ఆన్లైన్ నుంచి తొలగించే ప్రక్రియ మొదలైంది. బాధితులు భయం వీడి ఫిర్యాదు చేసేందుకు వీలుగా ముగ్గురు మహిళా అధికారుల ఫోన్ నంబర్లను కూడా పోలీసులు బహిరంగపరిచారు. ఈ దర్యాప్తులో ఇంకా ఎన్ని విస్తుపోయే నిజాలు బయటపడతాయోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.