హైదరాబాద్, ఏప్రియల్ 17 ; ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో కూడిన ‘టైమ్ 100’ (TIME 100 - 2026) జాబితాలో భారతీయుల పేర్లు ప్రపంచ వేదికపై స్వర్ణ కాంతులీనుతున్నాయి. గూగుల్ సారథి సుందర్ పిచాయ్, సినీ దిగ్గజం రణబీర్ కపూర్, మానవతావాది, చెఫ్ వికాస్ ఖన్నా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు ప్రముఖ భారతీయ వ్యక్తులు ఆల్ఫాబెట్ సి ఇ ఓ సుందర్ పిచాయ్, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, మరియు మిచెలిన్-స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా టైమ్ ప్రతిష్టాత్మక జాబితాలో చేర్చబడ్డారు. ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేస్తున్న దార్శనికులు, నాయకులు, ప్రత్యేకత కలిగిన వ్యక్తుల పేర్ల నమోదు ద్వారా ఈ వార్షిక సంకలనం గౌరవిస్తుంది.

సుందర్ పిచాయ్: ఏ ఐ ఆర్కిటెక్ట్

టైమ్100 జాబితాలో మూడవసారి చోటు దక్కించుకున్న సుందర్ పిచాయ్, కృత్రిమ మేధస్సుని ప్రజలకు చేరువచేసి గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో, గూగుల్ జెమినీ సి ఎల్ ఐ , నోట్ బుక్ ఎల్ ఏం మరియు సంచలనాత్మక యాన్టిగ్రావిటి వంటి అధునాతన ఏ ఐ సాధనాలను బిలియన్ల కొద్దీ ప్రజల రోజువారీ జీవితాల్లో విలీనం చేసింది. ఈ గుర్తింపు, భారత్‌ను గ్లోబల్ టెక్ పవర్‌హౌస్‌గా సుస్థిరం చేస్తూనే, "ఏ ఐ విప్లవం"లో పిచాయ్ సాధించిన విజయాన్ని బలంగా సూచిస్తుంది.

రణబీర్ కపూర్: సినిమాటిక్ స్టోరీటెల్లర్

ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడిగా రణబీర్ కపూర్ ప్రత్యేకతను చాటుకున్నారు. స్టార్‌డమ్‌ను సూక్ష్మమైన కథా విధానంతో మేళవించినందుకు కపూర్‌ను ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ సినిమాను చేరువ చేయడంలో ఆయన కీలక వ్యక్తిగా పేర్కొనబడ్డారు. త్వరలో రాబోయే రామాయణం వంటి భారీ ప్రాజెక్టులతో, బెన్ స్టిల్లర్ మరియు డొనాల్డ్ ట్రంప్ వంటి అంతర్జాతీయ ప్రముఖుల సరసన ఆయన నిలిచారు.

వికాస్ ఖన్నా: రుచి మరియు దాతృత్వ వారసత్వం

చెఫ్ వికాస్ ఖన్నా కేవలం తన వంటల నైపుణ్యానికే కాకుండా, తన మానవతా హృదయానికి కూడా గుర్తింపు పొందారు. అమృత్‌సర్ నుండి ప్రపంచ స్థాయి వంటగాడిగా ఎదిగిన ఖన్నా, మిచెలిన్-స్టార్ వంటకాలు, సాహిత్యం మరియు చలనచిత్రాల ద్వారా భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో 30 మిలియన్ల మందికి భోజనం అందించిన ఆయన చొరవను టైమ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఈ జాబితాలో సుందర్ పిచాయ్, చెఫ్ వికాస్ ఖన్నా, నటుడు రణబీర్ కపూర్లతో పాటు యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ లు మాత్రమె కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో XIV, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు మరియు 2026 ఆర్టెమిస్ II కమాండర్ రీడ్ వైస్‌మాన్ వంటి ప్రపంచ నాయకులు ఉన్నారు.