గత 40 రోజులుగా బాంబుల మోతతో, క్షిపణి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టేస్తాయన్న సంకేతాల నడుమ, ఇరాన్‌పై జరగాల్సిన భారీ సైనిక దాడికి కొద్ది గంటల ముందు అగ్రరాజ్యం అమెరికా వెనక్కి తగ్గింది. ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమైన తన నిర్ణయాన్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ఈ మొత్తం పరిణామంలో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

యుద్ధ మేఘాల మధ్య దౌత్య విజయం

నిజానికి మంగళవారం రాత్రి 8 గంటలు (ఈస్టర్న్ టైమ్) దాటితే ఇరాన్‌పై పెను విధ్వంసం మొదలవుతుందని ట్రంప్ గతంలోనే అల్టిమేటం జారీ చేశారు. అయితే, గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు సీన్ మారిపోయింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో సాగిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి. "వినాశకరమైన బలగాల ప్రయోగాన్ని ప్రస్తుతానికి నిలిపివేయండి" అన్న పాక్ నాయకత్వ విన్నపాన్ని ట్రంప్ మన్నించారు. దీనిని "డబుల్ సైడెడ్ సీజ్‌ఫైర్" (రెండు వైపుల కాల్పుల విరమణ) గా ట్రంప్ అభివర్ణించారు.

హార్ముజ్ జలసంధి: కీలకంగా మారిన షరతు

ఈ కాల్పుల విరమణకు అమెరికా ఒక ప్రధాన షరతు విధించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (హార్ముజ్ జలసంధి) ను ఇరాన్ తక్షణమే, సురక్షితంగా తెరవాలి. దీనికి ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సానుకూలంగా స్పందించింది. తమపై దాడులు ఆగిపోతే, తమ సాయుధ దళాల సమన్వయంతో జలసంధి గుండా నౌకల రాకపోకలకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది.

ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో ఒక కీలక వ్యాఖ్య చేశారు. "మేము ఇప్పటికే మా సైనిక లక్ష్యాలను మించి సాధించాము. ఇరాన్‌తో ఒక ఖచ్చితమైన శాంతి ఒప్పందానికి మేము చాలా దగ్గరగా ఉన్నాము" అని పేర్కొనడం చూస్తుంటే, తెరవెనుక చాలా పెద్ద ఒప్పందమే జరుగుతోందని అర్థమవుతోంది.

ఇరాన్ '10 అంశాల' వ్యూహం.. సీఎన్ఎన్ కథనంపై ట్రంప్ ఆగ్రహం

ఇదే సమయంలో ఇరాన్ అమెరికా ముందు 10 కఠినమైన షరతులను ఉంచినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ షరతుల్లో తమపై ఎప్పటికీ దురాక్రమణ చేయకూడదు, హార్ముజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలి., యురేనియం సుసంపన్నతకు అంగీకరించాలి, అన్ని రకాల ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలి, తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడంతో పాటు, అమెరికా దళాలు ఈ ప్రాంతం నుండి వైదొలగాలనే మరికొన్ని నిభందనలు ఉన్నాయి.

అయితే, ఈ షరతులన్నింటికీ అమెరికా అంగీకరించిందని సీఎన్ఎన్ ఇచ్చిన వార్తపై ట్రంప్ నిప్పులు చెరిగారు. అదొక "ఫేక్ న్యూస్" అని, ఇరాన్ ఇచ్చిన 10 అంశాల ప్రతిపాదన కేవలం ఒక "ప్రాతిపదిక" మాత్రమే తప్ప, ఇంకా ఏదీ ఖరారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు సీఎన్ఎన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇస్లామాబాద్‌ వేదికగా శాంతి చర్చలు - ఇజ్రాయెల్ వ్యూహాత్మక మౌనం

యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో, ఈ నెల 10వ తేదీన (శుక్రవారం) ఇస్లామాబాద్‌లో కీలక సమావేశం జరగనుంది. ఈ చర్చలకు ఇరాన్, అమెరికా ప్రతినిధులను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆహ్వానించారు. లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో కాల్పుల విరమణ అమలులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఇస్లామాబాద్ చర్చలు" ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని తీసుకువస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వైట్ హౌస్ మాత్రం ఈ సమావేశంపై ఇంకా ఆచితూచి స్పందిస్తోంది.

ఈ అనూహ్య ఒప్పందంలో ఇజ్రాయెల్ కూడా భాగస్వామి కావడం విశేషం. ఇరాన్‌పై బాంబు దాడులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే, ఇరాన్ తన ప్రాక్సీల (హెజ్బొల్లా, హమాస్) ద్వారా దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇది శాంతా లేక యుద్ధానికి విరామమా?

గత 40 రోజులుగా పశ్చిమాసియాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు సిద్ధమైన తరుణంలో ఈ కాల్పుల విరమణ ప్రకటించడం ఒక పెద్ద ఊరట. కానీ, ఇరాన్ విధించిన షరతులు, అమెరికా కోరుతున్న అణు నియంత్రణల మధ్య సమన్వయం కుదరడం అంత సులభం కాదు. రెండు వారాల గడువు ముగిసేలోపు ఇస్లామాబాద్‌లో జరిగే చర్చలే ఈ ప్రాంత భవిష్యత్తును తేల్చనున్నాయి.

ప్రస్తుతానికి తుపాకులు మూగబోయాయి, బాంబుల మోత ఆగింది. కానీ, ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా లేక రెండు వారాల తర్వాత మళ్ళీ విధ్వంసం మొదలవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఒక బలమైన దౌత్య శక్తిగా ఈ సంక్షోభం ద్వారా అవతరించడం విశేషం.

Sourece : అంతర్జాతీయ వార్తా సంస్థలు , న్యూస్ ఎజెన్సిస్